
- డ్రిప్’లో చేరుతం
- రెండు, మూడో దశలో రాష్ట్ర ప్రాజెక్టులు చేర్చాలె
- రెడీగా ఉన్నామని కేంద్రానికి తెలిపిన రాష్ట్ర సర్కారు
హైదరాబాద్, వెలుగు: డ్యాం రిహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్ట్ (డ్రిప్)లో చేరేందుకు రెడీగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. డ్రిప్ రెండు, మూడో దశల్లో మన ప్రాజెక్టులను చేర్చాలని కేంద్రానికి ప్రతిపాదన పంపింది. ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్ కొన్ని రోజుల క్రితం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. ఈ స్కీంలో భాగంగా రాష్ట్రంలోని పాకాల లేక్, లక్నవరం చెరువు, రామప్ప లేక్, ఉస్మాన్ సాగర్, పోచారం చెరువు, హిమాయత్ సాగర్, పాలేరు రిజర్వాయర్, నిజాంసాగర్, డిండి, కోయిల్‌సాగర్, కడెం, మూసీ, నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, స్వర్ణ, ఎల్‌ఎండీ, మల్లూరువాగు, బొగ్గులవాగు, ఎన్టీఆర్ సాగర్, జూరాల, కౌలాస్‌నాలా, సాత్నాల, సింగూరు, ఎల్లంపల్లి, వట్టివాగు, గడ్దెన్నవాగు, అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, పెద్దేవులపల్లి రిజర్వాయర్, పీపీ రావు ప్రాజెక్టులను బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ఖర్చయ్యే 70% నిధులను వరల్డ్ బ్యాంక్, ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ బ్యాంక్ నుంచి కేంద్రం లోన్ తీసుకొని రాష్ట్రానికి సమకూర్చనుంది. మిగిలిన 30% నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. ఈ మేరకు డ్రిప్‌లోని ప్రాజెక్టులకు నిధులు సమకూర్చేందుకు ప్రత్యేకంగా హెడ్ ఆఫ్ ది అకౌంట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
రూ.193 కోట్లు ఖర్చు చేస్తం
డ్రిప్‌లో భాగంగా దేశంలోని 736 డ్యాంలను రీస్టోర్ చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు రూ.10,211 కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించింది. ఈ స్కీంలో రాష్ట్రంలోని 29 ప్రధాన ప్రాజెక్టులను చేర్చి, వాటికి రూ.645.13 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.193 కోట్లు ఖర్చు చేసేందుకు అంగీకారం తెలుపుతూ ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది. రెండు దశల్లో ఈ డ్యాంల పునరుద్ధరణకు త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం సీడబ్ల్యూసీతో ఒప్పందం చేసుకోనుంది. డ్రిప్ మొదటి దశలో గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు సహా పది రాష్ట్రాలు చేరాయి. ఈ స్కీంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంక్లూడ్ కావడంపై సీడబ్ల్యూసీ ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌తో చర్చలు జరిపింది. సీఎం ఓకే అనడంతో డ్రిప్‌లో చేరుతామని సీడబ్ల్యూసీకి తెలిపారు. ఈ స్కీంలో చేరడంతో డ్యాంలు, రిజర్వాయర్లను వరదల నుంచి రక్షించేందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తారు, గేట్లు, ఆనకట్టల నిర్వహణ, ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అనుమతులివ్వడం, వరదల అంచనాకు, డ్యాం నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తారు.