వీఆర్ఏలకు పే స్కేల్.. ఇతర శాఖల్లో సర్దుబాటుకు సర్కార్ ఉత్తర్వులు

వీఆర్ఏలకు పే స్కేల్.. ఇతర శాఖల్లో సర్దుబాటుకు సర్కార్ ఉత్తర్వులు
  • వీఆర్ఏలకు పే స్కేల్.. ఇతర శాఖల్లో సర్దుబాటుకు సర్కార్ ఉత్తర్వులు
  • క్వాలిఫికేషన్స్ ఆధారంగా సర్వీసులోకి
  • టెన్త్ అర్హత కలిగిన వారికి లాస్ట్ గ్రేడ్ సర్వీస్’ పే రూ.19 వేలు
  • ఇంటర్‌‌‌‌కు రికార్డ్ అసిస్టెంట్, లేదా 
  • ఆ స్థాయి పోస్ట్​.. 22,240 నుంచి పేస్కేల్ 
  • డిగ్రీ, ఆపైన చదివినోళ్లకు జూనియర్ అసిస్టెంట్ పోస్ట్​.. 24,280 నుంచి పేస్కేల్
  • కేటీఆర్ బర్త్ డే సందర్భంగా జీవో తీసుకొచ్చినం: కేసీఆర్

హైదరాబాద్, వెలుగు:  వీఆర్ఏలను వివిధ డిపార్ట్‌‌మెంట్లలో సర్దుబాటు చేస్తూ రాష్ట్ర సర్కారు ఉత్తర్వులిచ్చింది. వారికి పే స్కేల్‌‌ను వర్తింపజేసింది. క్వాలిఫికేషన్స్ ఆధారంగా ఆయా డిపార్ట్‌‌మెంట్లలో లాస్ట్ గ్రేడ్ సర్వీస్, రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల్లో సర్దుబాటు చేయనుంది. ఇందుకు అవసరమైన సూపర్ న్యూమరీ పోస్టులను క్రియేట్ చేసేందుకు ఆర్థిక శాఖ పర్మిషన్ ఇవ్వనున్నట్లు తెలిపింది.  సోమవారం ఈ మేరకు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఆర్డర్స్‌‌ జారీ చేశారు.

టెన్త్ అర్హతతో 10,317 మంది

టెన్త్ అర్హత ఉన్న వీఆర్ఏలు 10,317 మంది ఉండగా.. వీరు నీటి పారుదల, మిషన్ భగీరథ విభాగాల్లో పనిచేస్తారని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. మిషన్ భగీరథలో మండలానికి ఆరుగురు చొప్పున 562 మండలాలకు 3,372 మందిని పంప్ ఆపరేటర్స్‌‌గా నియమించనున్నారు. ఇరిగేషన్ శాఖలో హెల్పర్స్‌‌గా 5,073 మందిని తీసుకోనున్నారు. మిగతా వారిని వివిధ డిపార్ట్‌‌మెంట్లలో సర్దుబాటు చేస్తారు. వీరికి లాస్ట్ గ్రేడ్ సర్వీస్ కింద పేస్కేల్ కనిష్టంగా రూ.19 వేలు, గరిష్టంగా రూ.58,850 అందుతుంది. ఇంటర్ విద్యార్హత కలిగిన 2,761 మంది రికార్డు అసిస్టెంట్ లేదా ఆ స్థాయి హోదాతో నియమితులు కానున్నారు. డిగ్రీ, ఆ పైన విద్యార్హత కలిగిన 3,680 మంది జూనియర్ అసిస్టెంట్‌‌ లేదా ఆ స్థాయి హోదాలో విధులు నిర్వర్తించనున్నారు. 

పంచాయతీరాజ్, హెల్త్, గురుకులాలు, ఉన్నత విద్య, స్కూల్ ఎడ్యుకేషన్ ఇతరత్రా డిపార్ట్‌‌మెంట్లలో వీరిని అడ్జస్ట్ చేయనున్నారు. రైతు వేదికలకు 2,600 మంది వీఆర్ఏలను సర్దుబాటు చేస్తున్నారు. మరో కేటగిరీలో 3,794 మంది 61 ఏండ్లు దాటిన వాళ్లు ఉన్నారు. వారు ఇంత కాలం పనిచేసిన దానికి వారు కొనసాగుతున్న క్వాలిఫికేషన్​తోనే వారి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వనున్నారు. ఆర్థిక శాఖ ఈ పోస్టులకు అప్రూవల్ ఇచ్చింది. ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్నవారికి పేస్కేల్ రూ.22,240 – 67,300, డిగ్రీ ఆపైన అర్హత ఉన్న వీఆర్ఏలకు రూ.24,280 – 72,850 ఇవ్వనున్నారు. సీసీఎల్ఏ, జిల్లా కలెక్టర్లు వీఆర్ఏల సర్దుబాటు ప్రక్రియను త్వరలోనే పూర్తి చేయనున్నారు. సర్దుబాటు ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాలను సీసీఎల్ఏ త్వరలోనే రిలీజ్ చేస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఫ్యూడల్ వ్యవస్థకు అవశేషంగా వీఆర్ఏలు

వీఆర్ఏల జేఏసీ ఎంత తొందరగా లిస్ట్ ఇస్తే అంత తొందరగా వారికి ఆర్డర్ లిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. వీఆర్ఏలు ఇక నుంచి పే స్కేల్ ఉద్యోగులని చెప్పారు. ‘‘మీరందరూ ఆయా డిపార్ట్ మెంట్లలో మంచి పేరు తెచ్చుకోవాలని, ఇంకా చదివి ప్రమోషన్లు కూడా తెచ్చుకోవాలని కోరుతున్నా” అని అన్నారు. మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఉత్తర్వులిస్తే బాగుంటుందని భావించి సీఎస్ శాంతి కుమారి, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ సోమవారమే ఉత్తర్వులు వచ్చేలా కృషి చేశారని తెలిపారు. ఈ ప్రక్రియలో ఎలాంటి లీగల్ సమస్యలు తలెత్తకుండా జీవోను రూపొందించినందుకు వారికి సీఎం ధన్యవాదాలు తెలిపారు.

 ఫ్యూడల్ వ్యవస్థకు అవశేషంగా, ప్రజాకంటకంగా వీఆర్ఏ వ్యవస్థ కొనసాగిందని సీఎం కేసీఆర్ విమర్శించారు. గ్రామాల్లో తరతరాలుగా, అతి తక్కువ జీతంతో, రైతుల కల్లాల దగ్గర దానం అడుక్కునే పద్ధతిలో ఎన్నో తరాలుగా పనిచేస్తూ వచ్చారని సీఎం తెలిపారు. మహారాష్ట్రలో కూడా చాలా తక్కువ జీతంతోని వీఆర్ఏలు పనిచేస్తున్నారని మహారాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు తెలిపారన్నారు. కొత్త ఉద్యోగాలు చేపట్టనున్న వీఆర్ఎలకు శుభాభినందనలు తెలిపారు.