- 12న నోటిఫికేషన్..13 నుంచి 16 వరకు దరఖాస్తుల స్వీకరణ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణ కాలేజీల్లో(డీఐఈటీ, సీటీఈ, ఐఏఎస్ఈ) మిగిలి ఉన్న ఖాళీల్లో గెస్ట్ ఫ్యాకల్టీని నియమించుకోవడానికి విద్యాశాఖ అనుమతినిచ్చింది. 2026–-27 విద్యా సంవత్సరంలో విద్యార్థులకు బోధనా నష్టం కలగకుండా ఉండేందుకు స్టాఫ్గ్యాప్ విధానంలో ఈ నియామకాలు చేపడుతున్నట్లు ప్రకటించింది. ఆర్థిక శాఖ ఆమోదించిన పోస్టుల పరిధిలోనే గత నిబంధనల ప్రకారం భర్తీ చేయాలని ప్రిన్సిపాళ్లను ఆదేశించింది.
ఈ నెల 12న ఖాళీల వివరాలతో ప్రకటన విడుదల చేసి, 13 నుంచి 16 వరకు అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. 16న వాటిని షార్ట్‌లిస్ట్ చేసి, ఎస్ఎంఎస్ లేదా ఈ–-మెయిల్ ద్వారా సమాచారం అందిస్తారు. 19న అభ్యర్థులకు డెమోలు, ఇంటర్వ్యూలు నిర్వహించి, 20న తుది ఎంపిక జాబితాను ఎస్సీఈఆర్టీకి పంపుతారు. ఎంపికైనవారు 21న కాలేజీల్లో రిపోర్ట్ చేసి, విధుల్లో చేరాల్సి ఉంటుంది.
కాగా, ఈ నియామకాలు పూర్తిగా టెంపరరీ కావడంతో ప్రిన్సిపాళ్లు ఎట్టిపరిస్థితుల్లోనూ ఎంపికైన ఫ్యాకల్టీకి రిటెన్ ఆర్డర్స్ ఇవ్వొద్దని ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. వాళ్ల సేవలు ఈ విద్యాసంవత్సరం చివరి పనిదినం నాటికి ముగుస్తాయని, ఒకవేళ ఆలోపే రెగ్యులర్, డిప్యుటేషన్ ప్రాతిపదికన టీచర్లు వచ్చినా, బోధన అవసరం తీరిపోయినా వీరి సేవలను వెంటనే నిలిపివేస్తామని పేర్కొన్నారు.
