నోటాకు వేసి ఓటు వేస్ట్ చేసుకోవద్దు: గవర్నర్ తమిళిసై

నోటాకు వేసి ఓటు వేస్ట్ చేసుకోవద్దు:   గవర్నర్ తమిళిసై

జేఎన్‌టీయూ, వెలుగు :  బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై గవర్నర్ తమిళిసై పరోక్ష విమర్శలు చేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓ అభ్యర్థి.. తనకు ఓటు వేయకపోతే కుటుంబంతో కలిసి సూసైడ్ చేసుకుంటానని ఓటర్లను బెదిరించారని, అలాంటి వారిపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇలాంటి వ్యాఖ్యలను ఉపేక్షించవద్దని అన్నారు. ఓటర్లను ఎవరూ బెదిరించకూడదని అన్నారు. గురువారం హైదరాబాద్ కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూ ఆడిటోరియంలో జరిగిన 14వ జాతీయ ఓటర్ల దినోత్సవానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ పార్థసారథి, సీఈవో వికాస్​రాజ్‌తో కలిసి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఓటు అనేది ప్రజల చేతుల్లో ఆయుధమని, దాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని సూచించారు. మంచి నాయకుడిని ఎన్నుకుంటే మంచి పాలన అందుతుందని అన్నారు. ఓటింగ్ శాతం పెరగాలంటే.. ప్రకటనలు ఒక్కటే ఉపయోగపడవని ఎలక్షన్ కమిషన్‌కు సూచించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కును మొదటిసారి వినియోగించుకున్న యువత ఎంతో ఆనందంగా ఓటు వేశారన్నారు. తెలంగాణ ఎన్నికలు ఎంతో విజయవంతమయ్యాయని, రాష్ట్రవ్యాప్తంగా 3.26 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని అన్నారు. ఈ ఎన్నికలు దేశానికి రోల్‌మోడల్​గా నిలిచాయని అన్నారు.

నేను నోటాకు వ్యతిరేకం

ఓటింగ్ రోజును సెలవు రోజుగా కాకుండా.. తమ భవిష్యత్తును నిర్ణయించే రోజుగా యువత భావించాలని తమిళిసై సూచించారు. తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. తాను ‘నోటా’ ఓటుకు వ్యతిరేకమని అన్నారు. పోటీలో ఉన్న వారిలో ఎవరో ఒకరికి ఓటు వేసి ఎన్నుకోవాలని, నోటాకు వేసి నిరుపయోగం చేసుకోవద్దని సూచించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం పెరిగిందని చెప్పారు. హైదరాబాద్ లాంటి చోట్ల తగ్గిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గ్రామాలు, పట్టణాల్లో ఓటింగ్ శాతం పెరిగేలా కృషి చేస్తామన్నారు. వికాస్‌రాజ్ మాట్లాడుతూ.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు విజయవంతంగా జరిగాయని... 80 ఏండ్లు నిండిన వారు, దివ్యాంగులకు ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం కూడా కల్పించినట్లు తెలిపారు. పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఆయా పోటీల్లో విజేతలైన విద్యార్థులు, సిబ్బందికి  గవర్నర్ ప్రశంసాపత్రాలను అందజేశారు. నూతనంగా ఓటు హక్కు పొందిన అఖిల అనే యువతికి ఓటరు కార్డు అందించారు. అడిషనల్ సీఈవో లోకేష్ కుమార్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.