అప్పటిదాకా నావలి రిజర్వాయర్ కట్టొద్దు..!

అప్పటిదాకా నావలి రిజర్వాయర్ కట్టొద్దు..!
  •  తుంగభద్ర బోర్డు మీటింగ్‌లో తేల్చిచెప్పిన తెలంగాణ
  •  ఏపీ హెచ్‌ఎల్సీ విస్తరణ ప్రతిపాదనకు నో

హైదరాబాద్‌, వెలుగు: బ్రజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ (కేడబ్ల్యూడీటీ2) అమల్లోకి వచ్చేదాకా కర్నాటక తలపెట్టిన నావలి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మించొద్దని తెలంగాణ తేల్చిచెప్పింది. ఏపీ ప్రతిపాదించిన తుంగభద్ర హైలెవల్‌ కెనాల్(హెచ్​ఎల్సీ) విస్తరణకు నో చెప్పింది. తుంగభద్ర బోర్డు సమావేశం చైర్మన్‌ డీఎం రాయ్‌పురే అధ్యక్షతన గురువారం వర్చువల్‌గా నిర్వహించారు. తెలంగాణ నుంచి ఈఎన్సీ మురళీధర్‌, ఇంటర్‌ స్టేట్‌ సీఈ మోహన్‌ కుమార్‌, ఏపీ నుంచి ఈఎన్సీ నారాయణ రెడ్డి, కర్నాటక ఇంజనీర్లు సమావేశంలో పాల్గొన్నారు. తుంగభద్ర నదిపై కర్నాటకలోని కొప్పాల్‌ జిల్లా గంగావతి తాలుకాలోని నావలి వద్ద 52 టీఎంసీలతో ప్రతిపాదించిన నావలి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్​నిర్మాణానికి పర్మిషన్ ఇవ్వొద్దని తెలంగాణ అధికారులు పట్టుబట్టారు. తుంగభద్ర రిజర్వాయర్‌లో పూడిక చేరడంతో 30 టీఎంసీల నిల్వ సామర్థ్యం తగ్గిపోయిందని, తద్వారా తుంగభద్ర జలాల్లో కర్నాటక, తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు 230 టీఎంసీల మేర నీటి వాటాను కోల్పోతున్నాయని కర్నాటక అధికారులు తెలిపారు. వాటా కోల్పోయాం కాబట్టి రిజర్వాయర్‌ నిర్మాణానికి అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. తుంగభద్ర హెచ్‌ఎల్సీకి పూర్తి స్థాయిలో నీళ్లు రావడం లేదని, కెనాల్‌ విస్తరణకు అనుమతించాలని ఏపీ అధికారులు కోరారు. బ్రజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌పై సుప్రీం కోర్టు స్టే ఉన్న నేపథ్యంలో నావలి నిర్మాణానికి అనుమతి ఇవ్వొద్దని తెలంగాణ అధికారులు కోరారు. తుంగభద్రతో పాటు సుంకేసుల బరాజ్‌ నుంచి కేటాయింపులకు మించి ఏపీ నీటిని తీసుకుంటోందని, అలాంటప్పుడు విస్తరించాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. బోర్డు చైర్మన్‌ జోక్యం చేసుకొని నావలి రిజర్వాయర్‌, హెచ్‌ఎల్సీ విస్తరణ డీపీఆర్‌లు సమర్పించాలని ఆదేశించారు. డీపీఆర్‌లు పరిశీలించిన తర్వాత మరోసారి చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుందామని తెలిపారు.