
- అధికారులకు మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశం
- యాంటీలార్వా ఆపరేషన్‌ను మరింత విస్తరించాలి
- ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలి
- సీజనల్ వ్యాధుల నివారణపై ఆఫీసర్లతో మంత్రి సమీక్ష
హైదరాబాద్, వెలుగు: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు, మందులు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల నివారణ, నియంత్రణపై శనివారం ఆరోగ్యశ్రీ కార్యాలయంలో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆరోగ్య శాఖ రూపొందించిన కరపత్రాలను మంత్రి ఆవిష్కరించి మాట్లాడారు.
కేసులు ఎక్కువగా నమోదవుతున్న జిల్లాలు, గ్రేటర్ హైదరాబాద్‌లో యాంటీ లార్వా కార్యకలాపాలను విస్తృతం చేయాలన్నారు. వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉన్న జీహెచ్‌ఎంసీ జోన్లలో ప్రత్యేక అధికారులను నియమించాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు సూచించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణపై జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించాలని ఆరోగ్య కార్యదర్శికి ఆదేశించారు. ప్రతి సోమవారం సీజనల్ వ్యాధులపై నివేదిక సమర్పించాలన్నారు.
అలాగే ట్రైబల్ ఏరియాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఐటీడీఏ పీవోలతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. క్షేత్ర స్థాయిలో వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే చేసి, ప్రజలకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని, కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పర్యటించాలని ఆదేశించారు. అన్ని ఆసుపత్రుల్లో సీజనల్ వ్యాధుల చికిత్సకు అవసరమైన సౌకర్యాలు, ఔషధాలు అందుబాటులో ఉంచాలని సూచించారు.
దోపిడీ చేసే ప్రైవేట్ ఆసుపత్రులపై కఠిన చర్యలు
డెంగీ, ప్లేట్‌లెట్స్ పేరుతో రోగులను దోపిడీ చేసే ప్రైవేట్ ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. ప్రజలు ఇండ్లు, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సీజనల్ వ్యాధుల బారిన పడితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న ఉన్నత సౌకర్యాలను వినియోగించుకోవాలని సూచించారు. కాగా.. వాతావరణ మార్పుల కారణంగా సీజనల్ వ్యాధులు అక్కడక్కడా నమోదవుతున్నాయని మంత్రికి అధికారులు తెలిపారు.
గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం చాలా జిల్లాల్లో డెంగీ కేసులు తక్కువగా నమోదయ్యాయని, అయితే గ్రేటర్ హైదరాబాద్‌లో కేసులు స్వల్పంగా పెరిగాయని వివరించారు. 19 జిల్లాల్లో 10 కన్నా తక్కువ కేసులు, మిగిలిన జిల్లాల్లో 10కు పైగా కేసులు నమోదయ్యాయని, టైఫాయిడ్ కేసులు కూడా నిరుటితో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నాయని చెప్పారు. ఈ సమావేశంలో ఆరోగ్య కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తూ, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవీందర్ నాయక్, వైద్యవిద్య డైరెక్టర్ నరేంద్ర కుమార్, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్, మెడికల్ కార్పొరేషన్ ఎండీ ఫణీంద్ర రెడ్డి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఏడాది చివరికల్లా టిమ్స్ లు అందుబాటులోకి రావాలి
సనత్‌నగర్, అల్వాల్, కొత్తపేటలోని టిమ్స్, వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ను ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. టైమ్ లైన్ పెట్టుకొని సమన్వయంతో పనిచేయాలని సూచించారు. శనివారం ఆరోగ్య శ్రీ ట్రస్ట్ కార్యాలయంలో 4 ఆసుపత్రుల నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష నిర్వహించారు.
ఈ ఏడాది చివరికల్లా ఈ హాస్పిటల్స్‌ను ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించిన నేపథ్యంలో ఆరోగ్యశాఖ, ఆర్ అండ్ బీ శాఖల ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు జారీచేశారు. హాస్పిటల్స్ సివిల్ వర్క్స్, అధునాతన వైద్య పరికరాల కొనుగోలు, డాక్టర్లు, సిబ్బంది నియామకాలపై దిశానిర్దేశం చేశారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని, నిర్దేశిత సమయంలో పనులను పూర్తి చేయాలని సూచించారు.
హాస్పిటల్స్ ప్రారంభమైన రోజు నుంచే వైద్య సేవలు అందుబాటులోకి రావాలని ఆదేశించారు. ఈ నాలుగు హాస్పిటల్స్ కోసం అధునాతన వైద్య పరికరాలను కొనుగోలు చేయాలని, ఈ ప్రక్రియలో సంబంధిత డాక్టర్లు, టెక్నికల్ నిపుణుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు.