
మెడికల్‌లో మన సీట్లు మనకే
85% కాంపిటీటివ్ అథారిటీ కోటా సీట్లపై హైకోర్టు కీలక తీర్పు
అవి తెలంగాణ లోకల్ స్టూడెంట్స్‌కే చెందుతాయని ఉత్తర్వులు
జీవో 72ను సవాల్ చేస్తూ దాఖలైన 63 పిటిషన్లు డిస్మిస్
హైదరాబాద్, వెలుగు : ఏపీ విభజన తర్వాత ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లో 85 శాతం కాంపిటీటివ్ అథారిటీ కోటా సీట్లు తెలంగాణ లోకల్ స్టూడెంట్స్‌కే చెందుతాయని హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. నేషనల్ కోటా 15 శాతం సీట్లు పోగా.. మిగిలిన 85 శాతం కాంపిటీటివ్ కోటా సీట్లలో తమకూ తెలంగాణ విద్యార్థుల మాదిరి అడ్మిషన్లు ఉంటాయని ఏపీ విద్యార్థులు దాఖలు చేసిన 63 పిటిషన్లను డిస్మిస్ చేసింది. అడ్మిషన్ రూల్స్‌ను సవరిస్తూ ప్రభుత్వం తెచ్చిన 72కు చట్టబద్ధత ఉందని స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ శ్రవణ్‌కుమార్‌తో కూడిన డివిజన్ బెంచ్ 59 పేజీల తీర్పును వెలువరించింది.
ఏపీ విభజన చట్టంలోని 95వ సెక్షన్ ప్రకారం ఏపీ, తెలంగాణలోని టెక్నికల్, మెడికల్ కాలేజీల్లో జరిగే అడ్మిషన్లలో రెండు రాష్ట్రాల విద్యార్థులకు 85శాతం కోటాలో సీట్ల కేటాయింపులు జరగాలని, అయితే ఆ నిబంధన రెండు తెలుగు రాష్ట్రాల ఏర్పాటు తర్వాత నెలకొల్పిన కొత్త కాలేజీల్లోని సీట్లకు వర్తించదని హైకోర్టు చెప్పింది. ‘‘ఏపీ విభజన చట్టంలోని 95వ సెక్షన్ ప్రకారం.. ఏపీ, తెలంగాణల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్, ఉన్నత, సాంకేతిక విద్య, వైద్య విద్య సీట్ల భర్తీలో పదేండ్లపాటు రెండు రాష్ట్రాలకు కాంపిటీటివ్ అథారిటీ కోటాలో సమాన అవకాశాలు కల్పించాలి. 2014 జూన్ 2వ తేదీ నుంచి పదేండ్ల వరకు కొనసాగే ఆ నిబంధన.. అప్పటికే ఉన్న కాలేజీల్లోని సీట్లకు మాత్రమే వర్తిస్తుంది. ఆ తర్వాత అంటే 2014 జూన్ 3వ తేదీ తర్వాత ఏర్పాటైన విద్యాసంస్థల్లో ఆ నిబంధన వర్తించదు. 2017 అడ్మిషన్ రూల్స్‌కు సవరణ చేస్తూ జీవో 72 జారీ సమర్థనీయమే.
Also Read : భారత్ లో నిపా వైరస్ కలకలం.. ఇద్దరు మృతి
ఈ రూల్స్‌ను పార్లమెంట్ చేయాలన్న వాదన సరికాదు. తెలంగాణ అసెంబ్లీ సవరణ చేయవచ్చు’’ అని స్పష్టం చేసింది. కొత్త మెడికల్ కాలేజీల్లో 85శాతం సీట్లు పూర్తి తెలంగాణ విద్యార్థులకే చెందుతాయన్న తెలంగాణ ప్రభుత్వ వాదనను సమర్థించింది. ఎంబీబీఎస్, డెంటల్ సీట్ల విషయంపై జులై 3న ఇచ్చిన జీవో నంబర్ 72 సరైనదేనని స్పష్టం చేసింది. ఈ నిబంధనల సవరణ రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధం కాదని ప్రకటించింది.
ఆలిండియా కోటాలో పోటీ పడొచ్చు
తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైన 20 ప్రభుత్వ, 14 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని సీట్లలో 85శాతం స్థానిక విద్యార్థులకు చెందుతాయని హైకోర్టు తెలిపింది. ఆలిండియా కోటా 15శాతం సీట్ల కోసం ఏపీ విద్యార్థులు పోటీ పడవచ్చని చెప్పింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఏర్పాటునాటికి ఉన్న కాలేజీల్లో నిబంధన 95 వర్తిస్తుందని, ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కూడా వేరే వాదన చేయలేదని, ఆ ప్రకారమే అడ్మిషన్లు ఉన్నాయని చెప్పిందని గుర్తు చేసింది.
ఇక్కడ వంద శాతం రిజర్వేషన్లు లేవని, 85 శాతం కాంపిటీటివ్ అథారిటీ కోటా సీట్లకే వంద శాతం స్థానికులకు రిజర్వేషన్ ఉందని తెలిపింది. మిగిలిన 15 శాతం ఆలిండియా కోటా సీట్లు ఇతర రాష్ట్రాల విద్యార్థుల మాదిరిగానే ఏపీ విద్యార్థులు సీట్లు సాధించుకోవచ్చని తెలిపింది. అడ్మిషన్ల ప్రక్రియ మొదలైన తర్వాత నిబంధనల సవరణ జీవో 72 వెలువడిందన్న పిటిషన్ల వాదనను కొట్టేసింది. జూన్ 3న నిబంధన సవరణ జీవో వచ్చిందని, మెడికల్ అడ్మిషన్ల నోటిఫికేషన్ జూన్ 6న వచ్చిందని గుర్తుచేసింది. అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాత పిటిషన్లను కొట్టేస్తున్నట్లు ప్రకటించింది.