రాతపూర్వక వాదనలు ఉంటే ఇవ్వండి.. గ్రూప్ 1 పిటిషన్లపై ఇరుపక్షాలకు హైకోర్టు ఆదేశం

రాతపూర్వక వాదనలు ఉంటే ఇవ్వండి.. గ్రూప్ 1 పిటిషన్లపై ఇరుపక్షాలకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: గ్రూప్‌‌‌‌- 1 వ్యాల్యుయేషన్​లో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పలు పిటిషన్లపై హైకోర్టులో సుదీర్ఘంగా కొనసాగిన వాదనలు సోమవారంతో ముగిశాయి. తీర్పును న్యాయస్థానం వాయిదా వేసింది. రాతపూర్వక వాదనలుంటే మంగళవారం సాయంత్రంలోగా సమర్పించాలని ఇరుపక్షాలను ఆదేశించింది. 

గ్రూప్‌‌‌‌-1 మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లతోపాటు పిటిషన్లను కొట్టివేయాలంటూ ‘ఎంపికైన అభ్యర్థులు’ దాఖలు చేసిన ఇంప్లీడ్‌‌‌‌ పిటిషన్లపై జస్టిస్‌‌‌‌ నామవరపు రాజేశ్వరరావు సోమవారం విచారణను కొనసాగించారు. పిటిషనర్ల తరఫు సీనియర్‌‌‌‌ న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ పరీక్షలు పారదర్శకంగా జరగలేదని తెలిపారు. మూల్యాంకనం విధానం ఏమిటో ఏ సమయంలో టీజీపీఎస్సీ వెల్లడించలేదన్నారు.

21 వేల మంది పరీక్ష రాస్తే సుమారు 5 వేల మందివి మాత్రమే ఎందుకు రీవాల్యుయేషన్‌‌‌‌ జరిపారని అనుమానం వ్యక్తం చేశారు. తెలుగులో పరీక్ష రాసిన వారికి అన్యాయం జరిగిందన్నారు. కమిషన్‌‌‌‌ తరఫు సీనియర్‌‌‌‌ అడ్వకేట్​ వాదనలు వినిపిస్తూ.. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించామన్నారు. మూల్యాంకనంలోనూ అభ్యర్థులకు అన్యాయం జరగకుండా పారదర్శకంగా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. 

తెలుగులో రాసినవారు తక్కువ మంది అర్హత సాధించారన్న వాదన వాస్తవం కాదన్నారు. గత కొన్నేండ్లుగా జరిగిన పరీక్ష ఫలితాలను పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుందని, గతంలో కంటే తెలుగు అభ్యర్థుల ఉత్తీర్ణత శాతం తగ్గలేదని చెప్పారు. ఆధారాల్లేని ఆరోపణలతో చేసిన పిటిషన్లను కొట్టివేయాలని కోరారు. వాదనలను విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేసింది.