ఆ అభ్యర్థి ఆన్సర్ ​షీట్లు సమర్పించండి...టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశం

ఆ అభ్యర్థి ఆన్సర్ ​షీట్లు సమర్పించండి...టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశం
  • గ్రూప్1 ఎగ్జామ్​పై విచారణలో టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశం
  • మధ్యంతర ఉత్తర్వుల కొనసాగింపు 
  • విచారణ జూన్‌ 11కు వాయిదా


హైదరాబాద్, వెలుగు: పేపర్​ ఎవాల్యుయేషన్​లో అవకతవకలు ఉన్నాయన్న ఆరోపణలకు ప్రధాన కారణమైన అభ్యర్థి పూజితారెడ్డి జవాబు పత్రాలను సమర్పించాలని టీజీపీఎస్సీకి శుక్రవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రీవాల్యుయేషన్‌‌‌‌కు దరఖాస్తు చేయగా మార్కులు తగ్గిపోయాయంటూ పూజితారెడ్డి చెప్పగా, మరోవైపు మొదటి నుంచి మార్కుల్లో తేడా లేదని, మార్కుల జాబితాను పూజితారెడ్డే తారుమారు చేశారని టీజీపీఎస్సీ ఆరోపించడంతో ఆ అభ్యర్థి జవాబు పత్రాలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఎవాల్యుయేషన్‌‌‌‌లో అవకతవకలపై విచారణ జరిపించాలంటూ దాఖలైన నాలుగు పిటిషన్‌‌‌‌లపై జస్టిస్‌‌‌‌ నామవరపు రాజేశ్వరరావు విచారణ చేపట్టారు. వాదనలు పూర్తికాకపోవడంతో విచారణను జూన్‌‌‌‌ 11వ తేదీకి వాయిదా వేశారు. సర్టిఫికెట్‌‌‌‌ల పరిశీలన చేసుకోవచ్చని, నియామక పత్రాలు జారీ చేయరాదంటూ గతంలో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయన్నారు. 

ఇవీ వాదనలు..

పిటిషనర్లు కావాలని కాలయాపన చేస్తున్నారని, రెండు రోజులుగా చెప్పినవే చెబుతున్నారంటూ టీజీపీఎస్సీ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. దీనిపై పిటిషనర్ల తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వాదనల్లో పదే పదే అడ్డుతగలడం సరికాదన్నారు. పిటిషనర్ల తరఫు సీనియర్‌‌‌‌ న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ పరీక్షల నిర్వహణలో మొదటి నుంచి టీజీపీఎస్సీ తప్పులు చేస్తున్నదన్నారు. ప్రిలిమ్స్‌‌‌‌కు, మెయిన్స్‌‌‌‌కు వేర్వేరు హాల్‌‌‌‌టికెట్లు కేటాయించారని, వాల్యుయేటర్ల ఎంపికలోనూ పారదర్శకత లేదని, ప్రభుత్వ కాలేజీలో పనిచేస్తున్నారని టీజీపీఎస్సీ చెబుతున్న వ్యక్తి ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నారని చెప్పారు. దాదాపు 40 శాతం మంది తెలుగులో పరీక్ష రాశారని, 10 నుంచి 12 శాతం ఉర్దూలో, మిగిలిన వారు ఆంగ్లంలో పరీక్ష రాశారన్నారు. అయితే వాల్యుయేటర్లలో ఎంత మంది తెలుగువారున్నారో వెల్లడించలేదన్నారు. 

తెలుగు మాట్లాడటం వేరు తెలుగు భాష వచ్చి ఉండటం వేరు అన్నారు. కోఠి మహిళా కళాశాలలోని 18వ సెంటరులో 721 మంది రాస్తే 39 మంది, అందులోనే 19వ సెంటరులో 776 మందికి 32 మంది ఎంపికయ్యారన్నారు. అంటే మొత్తం 563 మందిలో సుమారు 12 శాతం ఉన్నారన్నారు. తెలుగు వాళ్లకే మార్కులు ఎందుకు తక్కువ వస్తున్నాయన్నారు. మూల్యాంకనంలో రెండోసారి జరిపి 15 శాతం తేడా ఉంటే మూడో మూల్యాంకనం జరుగుతుందని చెబుతున్నారని, ఆప్టికల్‌‌‌‌ మెషిన్‌‌‌‌ రీడర్‌‌‌‌తో డేటా ఎందుకు భద్రపరచలేదన్నారు. అలాంటప్పుడు మార్కుల కేటాయింపు ఎలా జరిగిందో ఎవరికి తెలుస్తుందన్నారు. టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది రాజశేఖర్‌‌‌‌ వాదనలు వినిపిస్తూ తదుపరి విచారణ నాటికి పూజితారెడ్డి జవాబు పత్రాలను సీల్డ్‌‌‌‌ కవర్‌‌‌‌లో సమర్పిస్తామని చెప్పారు. కాగా, గ్రూప్‌‌‌‌-1 మెయిన్‌‌‌‌ మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ 19 మంది పిటిషన్‌‌‌‌ దాఖలు చేయగా అందులో తన పేరును తొలగించాలంటూ సంగారెడ్డి జిల్లా లింగంపల్లిలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న షబ్నం ఆర్యా జ్యుడీషియల్‌‌‌‌ రిజిస్ట్రార్‌‌‌‌కు లేఖ రాయగా దీన్ని ఈ దశలో అనుమతించలేమని న్యాయమూర్తి చెప్పడంతో పిటిషన్‌‌‌‌ను ఉపసంహరించుకున్నారు.