ఫీజుల ఖరారుపై ఎందుకు లేట్ .. టీఏఎఫ్ఆర్ సీ తీరుపై హైకోర్టు అసంతృప్తి

ఫీజుల ఖరారుపై ఎందుకు లేట్ .. టీఏఎఫ్ఆర్ సీ తీరుపై హైకోర్టు అసంతృప్తి
  • కాలేజీలు డిసెంబరులో ప్రతిపాదనలు పంపితే..జూన్ వరకూ ఎందుకు నిర్ణయం తీసుకోలే?
  • ప్రపోజల్స్  పంపాలని కాలేజీలు కూడా టీఏఎఫ్ఆర్ సీపై ఎందుకు ఒత్తిడి చేయలేదని ఆగ్రహం
  • పలు కాలేజీల పిటిషన్లపై నేడు మధ్యంతర ఉత్తర్వులు

హైదరాబాద్, వెలుగు:  ఇంజినీరింగ్  కాలేజీల్లో ఫీజుల పెంపు ప్రతిపాదనలపై ఏటా ఎందుకు ఆలస్యం చేస్తున్నారని తెలంగాణ అడ్మిషన్  అండ్  ఫీ నియంత్రణ కమిటీ (టీఏఎఫ్ఆర్ సీ) ని హైకోర్టు గురువారం నిలదీసింది. మూడేళ్లకోసారి కాలేజీలను పరిశీలించి నిర్ణయం తీసుకోలేకపోవడం సరికాదని పేర్కొంది. ఫీజుల పెంపుపై డిసెంబరులో కాలేజీలు ప్రతిపాదనలు పంపితే, జూన్  వరకు ఎందుకు నిర్ణయం తీసుకోలేదని ప్రశ్నించింది. ఇంజినీరింగ్  కాలేజీల్లో ఫీజులు 2022–-23 నుంచి 2024-–25 బ్లాక్  పీరియడ్ లోని ఫీజులే 2025–-26కూ వర్తిస్తాయంటూ ప్రభుత్వం గత నెల 30న జారీ చేసిన జీఓ 26ను సవాలు చేస్తూ సుమారు 11 దాకా కాలేజీలు గురువారం ఉదయం లంచ్  మోషన్  పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై జడ్జి జస్టిస్  కె.లక్ష్మణ్  విచారణ చేపట్టి టీఏఎఫ్​ఆర్ సీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

 అలాగే,  ప్రతిపాదనలు పంపాలని టీఏఎఫ్ఆర్ సీపై ఒత్తిడి ఎందుకు తీసుకురాలేదని కాలేజీలపైనా జడ్జి అసహనం వ్యక్తం చేశారు. ప్రతిపాదనలు పంపాలని మిమల్ని (కాలేజీలను) టీఏఎఫ్ఆర్ సీ అడగకపోతే, అప్పుడే హైకోర్టును ఎందుకు ఆశ్రయించలేదని అడిగారు. కౌన్సెలింగ్  పూర్తయి అడ్మిషన్ల సమయంలో లంచ్  మోషన్ల రూపంలో పిటిషన్లు వేయడం ఏమిటని ప్రశ్నించారు. ‘‘ప్రతిపాదనలు చేస్తామన్న నిర్ణయం ప్రభుత్వానిదేనని టీఏఎఫ్​ఆర్ సీ, టీఏఎఫ్ఆర్ సీ ప్రతిపాదనలు పంపితే ఆమోదించడం తప్ప తమ బాధ్యత లేదని ప్రభుత్వం ఒకదానిపై ఒకటి చెబుతూ ఇలాంటి వివాదాలకు ఆస్కారమిస్తున్నాయి’’ అని జడ్జి సీరియస్  అయ్యారు. 

డిసెంబరులోనే ప్రపోజల్స్  సమర్పించాం

కాలేజీల తరఫు సీనియర్ న్యాయవాది అవినాష్   దేశా య్  వాదనలు వినిపిస్తూ డిసెంబరులోనే టీఏఎఫ్ఆర్ సీకి ప్రతిపాదనలు సమర్పించామని, మార్చిలో టీఏఎఫ్ఆర్​సీ సమావేశమైందని, అందులో తమ ప్రతిపాద నలు ఆమోదించిందని చెప్పారు. దీనికి రిజిస్టర్​లో నమోదుచేసిన వివరాలే నిదర్శనమని పేర్కొన్నారు. టీఏఎఫ్ఆర్​సీ తరఫు సీనియర్  న్యాయవాది పి. శ్రీరఘు రాం వాదనలు వినిపిస్తూ కాలేజీలు 5 వేల పేజీలతో ప్రతిపాదనలు సమర్పించాయని, వీటిని పరిశీలించడానికి సమయం పడుతుందన్నారు. 

ఈ నేపథ్యంలో గత బ్లాక్  పీరియడ్​లో వసూలు చేసిన ఫీజులనే ప్రభుత్వం ఈ ఏడాదికి కూడా సిఫారసు చేసిందన్నారు. కాలేజీలు లాభాల కోసం పనిచేయకూడదని సుప్రీంకోర్టు పేర్కొన్నదని గుర్తుచేశారు. ప్రభుత్వం తరఫున రాహుల్ రెడ్డి వాదనలు వినిపిస్తూ టీఏఎఫ్​ఆర్​సీ ప్రతిపాదనలను ఆమోదించడం వరకే తమ బాధ్యత అని పేర్కొన్నారు. కొన్ని కాలేజీలు గత ఏడాది కన్నా రూ.60 వేలకుపైగా పెంచాలని ప్రతిపాదనలు పంపాయన్నారు. ప్రస్తుతం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తే 1.06 లక్షల మంది ఇంజినీరింగ్, 38 వేల ఎంసీఏ, ఎంబీయే విద్యార్థులపై భారం పడుతుందన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి మధ్యంతర పిటిషన్లపై శుక్రవారం ఉదయం ఉత్తర్వులు జారీ చేస్తామంటూ విచారణను వాయిదా వేశారు. అయితే కేశవ్ మెమోరియల్ దాఖలు చేసిన పిటిషన్లను మరో న్యాయమూర్తి ముందు ఉంచాలంటూ రిజిస్ట్రీని ఆదేశించారు.