
- మరో 9 మంది అపాయింట్‌మెంట్లు రద్దు చేసిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: హెచ్‌సీఏ క్రికెట్ ఆపరేషన్స్ అండ్ గేమ్ డెవలప్‌మెంట్ కన్సల్టెంట్‌గా ఇండియా మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ నియామకాన్ని హైకోర్టు రద్దు చేసింది. హెచ్‌సీఏలోని నలుగురు ఆఫీస్ బేరర్లు అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుండా వెంకటేశ్ సహా పది మంది సిబ్బందిని నియామిస్తూ తీసున్న నిర్ణయం చెల్లదని తేల్చింది. ఇప్పటివరకు వీళ్లకు చెల్లించిన వేతనాలను హెచ్‌సీఏ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, సీఈవోల వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ల నుంచి రికవరీ చేయాలని హెచ్‌సీఏను ఆదేశించింది.
ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక తీర్పు వెలువరించారు. హెచ్‌సీఏ రూల్స్‌కు విరుద్ధంగా ఈ పది మంది నియామకాలు ఉన్నాయని పేర్కొంటూ హెచ్‌సీఏ వైస్ ప్రెసిడెంట్ సర్దార్ దల్జీత్ సింగ్, జాయింట్ సెక్రటరీ టి.బసవ రాజు, సునీల్ అగర్వాల్, అపెక్స్ కౌన్సిల్ ప్రతినిధులు అర్జున్ స్వరూప్, వంకా రోమా సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ అనంతరం హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. నలుగురు హెచ్‌సీఏ ఆఫీస్ బేరర్లు గతేడాది ఆగస్టు 30న అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుండా రూ. 75 లక్షల వార్షిక వేతనంతో వెంకటేశ్ ప్రసాద్‌ను క్రికెట్ కార్యకలాపాలకు కన్సల్టెంట్‌గా నియమించారని పిటిషనర్లు పేర్కొన్నారు. వాదనలు విన్న తర్వాత ప్రసాద్‌తో పాటు వివిధ పోస్టులు నిర్వర్తిస్తున్న హిమానీ యాదవ్, మమతా కనోజియా, అర్జున్, సబ్యసాచి, రాజశేఖర్ షన్బాల్, హైదరాబాద్ రంజీ కోచ్ వినీత్ సక్సేనా, శ్రవంతి నాయుడు, బీఆర్ సువర్ణ, ఎస్‌ఎన్ అమిత్‌ల అపాయింట్‌మెంట్లను హైకోర్టు రద్దు చేసింది.