
- ఎస్సీ గురుకులాల్లో ఈట్ రైట్ పోగ్రాంను తీసుకొచ్చిన ప్రభుత్వం
- 238 గురుకులాల్లో అమలు.. ఫుడ్ సేఫ్టీ కమిషనర్‌తో తనిఖీలు
- కూరగాయలు, సరుకులు, చికెన్ సరఫరాకు రూల్స్
- లోపాలు ఉంటే కాంట్రాక్టర్ ను మార్చుడే..
- డైనింగ్, కుకింగ్ ప్రాంతాలు, స్టూడెంట్ హైజెనిక్పై క్లాసులు
హైదరాబాద్, వెలుగు: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు స్టార్ట్ చేసింది. ఎస్సీ గురుకులాల్లో ‘ఈట్ రైట్’ పేరుతో కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా 238 ఎస్సీ గురుకులాల్లో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ), స్టేట్ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపడుతున్నది.
ప్రతి ఒక్క విద్యార్థికి క్వాలిటీ ఫుడ్ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నది. అన్ని గురుకులాల్లో ప్రతి ఒక్క విద్యార్థికి నాణ్యమైన భోజనం అందించేందుకు ఇప్పటికే కామన్ డైట్ మెనూ ప్రోగ్రాంను ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఎన్నో ఏండ్ల తర్వాత ఇటీవల గురుకుల విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ చార్జీలను కూడా పెంచింది. ఫుడ్ పాయిజన్స్ కు చెక్
గురుకులాలకు పాలు, కూరగాయలు, నూనెలు, చికెన్‌తో పాటు కిరాణ సరుకులను కాంట్రాక్టర్లు సరఫరా చేస్తున్నారు. అయితే, ఇవి క్వాలిటీ లేకపోవడం, ఎక్స్‌పైరీ డేట్ దాటి పోవడంతో చెడిపోతుండటంపై ఎన్నో ఫిర్యాదులు అధికారులకు అందాయి. వీటితో వంట చేయడంతో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకున్నాయి. వీటికి చెక్ పెడుతూ ఎస్సీ గురుకుల సొసైటీ ‘ఈట్ రైట్’ అనే కొత్త ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ ఉన్న కాంట్రాక్టర్లే గురుకులాలకు సరుకులు, పాలు, చికెన్ సరఫరా చేయాలనే రూల్ పెట్టారు. ఈ సర్టిఫికెట్ లేకపోతే కాంట్రాక్టర్‌ను తొలగించి.. కొత్తవారిని నియమించే బాధ్యతలను అడిషనల్ కలెక్టర్లకు అప్పగించారు. ఒక్క గురుకులంలో 4 అంశాలపై ఎఫ్ఎస్ఎస్ఏ రిపోర్ట్ లు రెడీ చేస్తున్నారు. ఇందులో కిరాణా సరుకులు, క్యాటరింగ్, కూరగాయలు, చికెన్ కు ఇలా ఒక్కో దానికి ఒక్కో సర్టిఫికెట్‌ను కాంట్రాక్టర్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఎఫ్ఎస్ఎస్ఏ రూల్స్‌కు అనుగుణంగా కాంట్రాక్టర్ల సరఫరా ఉందా? లేదా? అనేది ఈ లైసెన్స్ ఇచ్చే అథారిటీ గమనించి ఇస్తుందని అధికారులు చెబుతున్నారు. అలాగే, గురుకులాలకు సరఫరా అవుతున్న సరుకులపై ప్రతినెలా రిపోర్టులు రెడీ చేసి.. సొసైటీ హెడ్ ఆఫీస్ కు పంపించాల్సి ఉంటుంది. గురుకులాల్లో వంట చేసే ప్రాంతాలు, డైనింగ్ హాల్, సరుకులు నిల్వ ఉంచే స్టోర్ రూమ్ ను ఫుడ్ సేఫ్టీ కమిషనర్ (హెల్త్ డిపార్ట్ మెంట్)తో తనిఖీ చేయిస్తున్నారు. వ్యక్తిగత శుభ్రత, క్యాంపస్ నీట్ గా ఉంచుకోవడం,ఈ ప్రాంతాలు హైజెనిక్‌గా ఉండేలా స్టూడెంట్స్ కు టీచర్లు, వార్డెన్లు అవగాహన కల్పించడంతోపాటు వారానికి రెండు క్లాసులను ప్రత్యేకంగా బోధిస్తున్నారు.
స్టూడెంట్స్‌తో డైట్ కమిటీలు..
ప్రతి గురుకులంలో లంచ్, డిన్నర్ టైమ్ లో స్టూడెంట్స్ ను పర్యవేక్షించేలా ప్రతి నెలా 33 మందితో డైట్ కమిటీలను ఇటీవల ఏర్పాటు చేశారు. ఇందులో 8 నుంచి 11వ తరగతి వరకు విద్యార్థులుంటారు. ప్రతి విద్యార్థికి ఒక నెలపాటు విధి నిర్వహణ బాధ్యత ఉంటుంది. ఈ అకడమిక్ ఇయర్ నుంచే ఈ కమిటీలు స్కూల్ ఎంట్రీ, డైనింగ్ హాల్ దగ్గర బోర్డులు ఏర్పాటు చేస్తాయి. కూరగాయలు, నూనె, ఇతర వంట సామగ్రిని పరిశీలించడం, స్టోర్ రూమ్ తాళాలు దగ్గరే పెట్టుకోవడం, వంటచేసే ప్రాంతం నీట్ గా ఉందా? అనేది చెక్ చేయనున్నది. వంట చేసిన తర్వాత స్టూడెంట్స్‌కు వడ్డించే ముందు కుకింగ్ సిబ్బందితో కలిసి కమిటీ ఫుడ్‌ను టేస్ట్ చేయనున్నది. ఫుడ్ క్వాలిటీపై స్టూడెంట్స్ నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవడం లాంటి పనులను కమిటీ పర్యవేక్షిస్తుంది. సమస్యలు ఉంటే వెంటనే సంక్షేమ భవన్‌లో ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని వార్డెన్స్‌కు గురుకుల ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు.
ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
‘ఈట్ రైట్’ ప్రోగ్రాం ద్వారా ఫుడ్ సేఫ్టీ అధికారులు జిల్లా కేంద్రంలోని ఎస్సీ గురుకులాల్లో తనిఖీలు నిర్వహించాల్సి ఉంటుంది. వారంలో కనీసం రెండు, మూడుసార్లు రెగ్యులర్ విజిట్స్ చేయాలి. కిచెన్ వాతావారణం, ఫుడ్ సేఫ్టీ కమిషన్ నియమ నిబంధనలను పాఠశాలలు పాటిస్తున్నాయా? లేదా? అనేది పరిశీలిస్తారు. ఎఫ్ఎస్ఎస్ఏఐ, రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషన్ నిబంధనలు పాటించే గురుకులాలకు ఎఫ్ఎస్ఎస్ఏఐ ద్వారా ఈట్ రైట్ సర్టిఫికెట్లు జారీ చేస్తారు. లోపాలున్న గురుకులాలకు సంబంధించిన రిపోర్ట్‌ను హైదరాబాద్‌లోని ఎస్సీ గురుకుల సొసైటీ కి పంపించాల్సి ఉంటుంది. లోపాలు ఉంటే ఆయా కాంట్రాక్టర్లు, అధికారులపై చర్యలు తీసుకోనున్నారు. అలాగే, తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమిషన్ జారీ చేసిన ఈట్ రైట్ హ్యాబిట్స్ (ఆహారపు అలవాట్లు) పుస్తకాన్ని విద్యార్థుల కోసం సిలబస్ లో భాగం చేయనున్నారు.
‘ఈట్ రైట్’ ప్రోగ్రాం ఉద్దేశమిదే
‘ఈట్ రైట్’ ప్రోగ్రాంలో ప్రతి గురుకుల స్కూల్ నుంచి విద్యార్థులతో ఒక డైట్ కమిటీని ఏర్పాటు చేశారు. వీరిని మానిటరింగ్ చేసేందుకు ఇద్దరు టీచర్లతో ఈట్ రైట్ వలంటీర్లను నియమిస్తారు. వీరి సూచనలతో పాటు మెస్ కమిటీ సంబంధిత గురుకుల హాస్టల్ కిచెన్, పరిసరాలు, ఆహార పదార్థాల నిల్వలు, ఆరోగ్యకర మైన ప్రాంతంలో వంటలు చేస్తున్నా రా? లేదా? అనే అంశాలను పరిశీలిస్తుంది. ఎప్పటికప్పుడు నివేదికను స్కూల్ యాజమాన్యానికి ఇవ్వాల్సి ఉంటుంది.