
- నీళ్లు, నిధులు, నియామకాల ఆకాంక్షలు నెరవేరలె
- పేపర్ లీకేజీలతో నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నరని ఫైర్
భద్రాద్రి కొత్తగూడెం/సూర్యాపేట/చేగుంట, వెలుగు: తెలంగాణలో అవినీతి రాజ్యమేలుతున్నదని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. ‘‘తెలంగాణ వస్తే అద్భుతమైన మార్పులు జరుగుతాయని ఊహించాం. కానీ అలాంటిదేమీ జరగలేదు. 2004లో వైఎస్ ప్రభుత్వ కాలంలో అవినీతి ప్రారంభమైంది. అది 2014 నుంచి మరింత పెరిగింది” అని అన్నారు. ‘‘నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో 1,200 మంది తెలంగాణ బిడ్డల ఆత్మబలిదానాలతో రాష్ట్రం ఏర్పడింది. ఈ గౌరవంతోనే తెలంగాణ రాజకీయాలపై పదేండ్లు మాట్లాడలేదు. కానీ నీళ్లు, నిధులు, నియామకాల ఆకాంక్షలు నెరవేరలేదు. అందుకే ఇప్పుడు ధర్మయుద్ధం చేసేందుకు వచ్చాను. నేను రాష్ట్రంలో తిరగకపోయినా ప్రతిచోట 3 వేల నుంచి 5 వేల మంది జనసేన నాయకులు, సైనికులు ఉన్నారు. ప్రజలు పిలిస్తే తప్ప మనం రాకూడదు. అందుకే దశాబ్దం తర్వాత కొత్తగూడెంలో సభకు వచ్చాను’’ అని చెప్పారు. గురువారం కొత్తగూడెం, సూర్యాపేట, దుబ్బాక నియోజకవర్గాల్లో పర్యటించిన పవన్బీజేపీ, జనసేన అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు.
యువత కోసం కొట్లాడ్తం..
నీళ్లు, నిధులు, నియామకాల ఆకాంక్షలు నెరవేరలేదని పవన్ కల్యాణ్ అన్నారు. ‘‘నిరుద్యోగ భృతి జాడ లేదు. నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుకుంటోంది. పేపర్‌లీకేజీలతో కొందరు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. వేలాది మంది నిరాశకు లోనయ్యారు. పేపర్ లీకేజీల పాపం బీఆర్ఎస్ ప్రభుత్వానిదే” అని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో 15 లక్షల మంది కౌలు రైతుల గురించి బీఆర్ఎస్ప్రభుత్వం ఏనాడూ పట్టించుకోలేదని మండిపడ్డారు. గ్రేటర్హైదరాబాద్చుట్టే అభివృద్ధి జరుగుతోందని, ఈ పరిస్థితి మారాలన్నారు.
డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే బంగారు తెలంగాణ..
రాష్ట్రంలో డబుల్ఇంజిన్సర్కార్వస్తే బంగారు తెలంగాణ సాకారమవుతుందని పవన్ అన్నారు. ‘‘కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఉంది. తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి వస్తేనే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఆడబిడ్డల భవిష్యత్‌కు భరోసా దొరుకుతుంది. బీసీలకు బీజేపీ పెద్ద పీట వేస్తోంది. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉంది” అని అన్నారు.