తడిసిన వడ్లను కొన్న ఏకైక రాష్ట్రం మనదే.. మంత్రి జగదీశ్​రెడ్డి

తడిసిన వడ్లను కొన్న ఏకైక రాష్ట్రం మనదే.. మంత్రి జగదీశ్​రెడ్డి

 

  •    ఇక నుంచి ముందస్తుగా పంటల సాగు 
  •    జడ్పీ మీటింగ్​లో మంత్రి జగదీశ్​రెడ్డి 
  •    సభలో కన్నీటి పర్వంతమైన పీఏ పల్లి జడ్పీటీసీ 

నల్గొండ అర్భన్, వెలుగు : అకాల వర్షాలకు తడిసిన వడ్లను కొనుగోలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి జగదీశ్​రెడ్డి తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల నుంచి బయట పడేందుకు రానున్న యాసంగిలో పంటలను ముందస్తు సాగు చేయాలని సీఎం కేసీఆర్​ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. శనివారం నల్గొండ జడ్పీ మీటింగ్​ హాల్​లో చైర్మన్​బండా నరేందర్​రెడ్డి అధ్యక్షతన జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. గతంలో కంటే ప్రస్తుతం 10 రెట్లు పంట పెరిగిందని, రాష్ట్రంలోనే జిల్లాను ఆదర్శంగా నిలిపేలా ఇప్పటికే 6లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని తెలిపారు. మరో వారం రోజులలో ధాన్యం కొనుగోళ్లు పూర్తవుతాయన్నారు. 

దేశంలోనే వడ్ల కొనుగోళ్లలో తెలంగాణ నెంబర్​ వన్​గా నిలిచిందన్నారు. గత పాలకుల కాలంలో ఫ్లోరోసిస్​ అభివృద్ధి చెందిందని, ప్రస్తుతం రైతు, వ్యవసాయం అభివృద్ధి చెందుతుందన్నారు. మే నెలలో మొదటి పంటను,  నవంబర్ చివరి నాటికిరెండో పంట నాట్లు పూర్తి చేయాలని సూచిస్తూ జడ్పీ చైర్మన్​ బండా నరేందర్​రెడ్డి తీర్మానం చేశారు. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, నోముల భగత్, రవీంద్ర నాయక్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, జడ్పీ సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, డిప్యూటీ సీఈఓ కాంతమ్మ, జడ్పీటీసీలు, ఎంపీపీలు, తదితరులు పాల్గొన్నారు.

కన్నీరు పెట్టిన పీఏపల్లి జడ్పీటీసీ

ధాన్యం కొనుగోళ్ల విషయంలో సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని పీఏపల్లి జడ్పీటీసీ అలుగుబెల్లి శోభారాణి సభ దృష్టికి తీసుకొచ్చింది. మంత్రి జగదీశ్​రెడ్డి మాట్లాడుతూ ఈవిషయం స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారా అంటూ అడిగారు. ఎమ్మెల్యే రవీంద్రకుమార్​ సహకరించడం లేదని ఆమె సమాధానమిచ్చింది. దీంతో ఎమ్మెల్యేకు, జడ్పీటీసీకి వాగ్వావాదం జరిగింది. వెంటనే ఎమ్మెల్యే మైక్​ తీసుకుని మాట్లాడుతూ ‘నువ్వుండేది హైదరాబాద్​లో.. నిరంతరం ప్రజల మధ్యన తిరిగేది నేను.. నువ్వెంత.. నా గురించి మాట్లాడే స్థాయి ఉందా నీకు’ అంటూ గట్టిగా అన్నారు. దీంతో జడ్పీటీసీ కన్నీరు పెట్టుకుంది.