జాగృతిలో చేరడమంటే బతుకమ్మ ఆడినట్టు ఉంటది..జాగృతి అంటే పోరాటాల జెండా: కవిత

జాగృతిలో చేరడమంటే బతుకమ్మ ఆడినట్టు ఉంటది..జాగృతి అంటే పోరాటాల జెండా: కవిత

హైదరాబాద్​, వెలుగు: కాంగ్రెస్​ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుతూనే ఉంటామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అన్నారు. పలువురు బీసీ నేత లు శుక్రవారం కవిత సమక్షంలో జాగృతిలో చేరిన సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. జాగృతి అంటేనే పోరాటాల జెండా.. విప్లవాల జెండా అని అన్నారు. జాగృతిలో చేరడమంటే బతుకమ్మ ఆడినట్లు ఉంటుందని, అదే సమయంలో పిడికిలెత్తి పోరాటం కూడా చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. 

ఆడబిడ్డలకు నెలకు రూ.2,500 ఇస్తామని సర్కారు మోసం చేసిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రసవం కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లిన గర్భిణులకు కేసీఆర్ కిట్ తో పాటు ఆర్థిక సాయం అందించేవారని, కానీ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అది బంద్ అయ్యిందని పేర్కొన్నారు.  బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో పాటు వారికి ఇచ్చిన అన్ని హామీల అమలుకు కొట్లాడాలని పిలుపునిచ్చారు. కాగా, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించేందుకు అనుసరించాల్సిన చర్యలపై బీసీ నాయకులు, యునైటెడ్ పూలే ఫ్రంట్ (యూపీఎఫ్) నేతలతో ఆమె సమావేశమై చర్చించారు.