తెలంగాణ జాబ్ స్పెషల్.. జనాభా ఆర్థికాభివృద్ధి

తెలంగాణ జాబ్ స్పెషల్.. జనాభా ఆర్థికాభివృద్ధి

జనాబా పెరిగే కొద్దీ ఉపయోగించని వనరులు వినియోగంలోకి వస్తాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతుంది. మరోవైపు జనాభా పెరిగే కొద్దీ వనరులకు డిమాండ్​ పెరిగి వాటిని అనుత్పాదక రంగంలో వినియోగించవచ్చు. అందుకే కొంత మంది ఆర్థికవేత్తలు జనాభా ఆర్థికాభివృద్ధికి ఆటంకమని భావించగా మరికొందరు అభివృద్ధికి దోహదపడుతుందని భావించారు. 

జనాభా పెరుగుదలకు కారణాలు

1. అల్ప మరణరేటు :  1950–51లో 27.4శాతం ఉన్న మరణరేటు 2020 నాటికి 6.0కి తగ్గింది. అంటే మరణ రేటు వేగంగా తగ్గింది.

మరణ రేటు తగ్గడానికి కారణాలు :  కరవుకాటకాల నివారణ, వైద్య సదుపాయాలు విస్తృతమై అంటువ్యాధులను నివారించడం, తలసరి ఆదాయం, జీవన ప్రమాణం పెరగడం, సురక్షిత మంచినీటి లభ్యత పెరగడం, శిశు మరణాల రేటు తగ్గడం.

2. అధిక జనన రేటు : 1950–51లో 39.9 గా ఉన్న జననరేటు 2020 నాటికి 19.5కి తగ్గింది. అంటే మరణరేటు తగ్గినంత వేగంగా జననరేటు తగ్గలేదు. కేరళ, తమిళనాడు, గోవాలు మినహాయించి జననరేటు చెప్పుకోదగిన విధంగా తగ్గలేదు. అనేక ఆర్థిక, సాంఘిక కారకాలు అధిక సంతానోత్పత్తికి అనుకూలంగా ఉన్నాయి. 2020 నాటికి సంతానోత్పత్తి రేటు 2.0. దీనికి గల ఆర్థిక, సాంఘిక, ఇతర అంశాలుగా విడదీయవచ్చు. 

ఆర్థికాంశాలు

వ్యవసాయ ఆధిపత్యం :  వ్యవసాయ సమాజంలో పిల్లలు ఆర్థిక భారంగా అనిపించరు. ఎక్కువకాలం వ్యవసాయ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉంటారు. అంటే వ్యవసాయంలో ఎక్కువగా బాల కార్మికులు అవసరం అవుతారు. కాబట్టి పెద్ద కుటుంబాల పట్ల మొగ్గు చూపుతారు. కేరళ, తమిళనాడు, గోవాల్లో సాంఘిక చైతన్యం పునరుత్పాదక రేటును తగ్గించింది. 

నెమ్మదిగా సాగే పట్టణీకరణ :  దేశంలో పట్టణీకరణ నెమ్మదిగా సాగుతున్నది. 2011 నాటికి 31.14 శాతం మాత్రమే పట్టణీకరణ ఉంది. పైగా అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దేశంలో పట్టణీకరణ జనన రేటు పట్ల ప్రజల సాంఘిక దృక్పథాన్ని నెమ్మదిగా మారుస్తుంది. 

పేదరికం : పెద్ద కుటుంబాల వల్లే పేదరికం ఎక్కువగా ఉంది. వృద్ధాప్యంలో ఆర్థిక భద్రతకు పేదలు అధిక సంతానాన్ని కోరుకుంటారు. పేదలు తమ పిల్లలను ఆస్తులుగా భావిస్తున్నారు. ఎక్కువ సభ్యులు ఉంటే ఎక్కువ ఆదాయం సంపాదించవచ్చని భావిస్తారు. 

సాంఘికాంశాలు

వివాహం సార్వజనీనమవడం: మతపరంగానూ సాంఘిక పరంగానూ మన దేశంలో వివాహం తప్పనిసరి అయింది. 

బాల్య వివాహాలు :  మన దేశంలో 47 శాతం బాలికలకు 18 సంవత్సరాలు కంటే ముందుగానే వివాహం జరుగుతున్నది. 

నిరక్షరాస్యత :  దేశంలో పురుషుల్లో 81 శాతం, స్త్రీలు 65 శాతం అక్షరాస్యులుగా ఉన్నారు. మిగతావారు నిరక్షరాస్యులు. కుటుంబం, వివాహం, పిల్లల పట్ల మన వైఖరిని మార్చే ది విద్య మాత్రమే.

సాంఘిక, మత మూఢ నమ్మకాలు :  భారతీయులు ముఖ్యంగా హిందువులు మత సాంప్రదాయాల ప్రకారం కొన్ని కార్యక్రమాలు కుమారుడే నిర్వహించాలి. కాబట్టి మగ పిల్లలను కోరుకుంటారు.

    ఉష్ణమండల ప్రాంతం (స్త్రీ, పురుషులు త్వరగా మెచ్యుర్​ కావడం) 
    బహు భార్యత్వం 
    నియంత్రించే అంశాలు

ఆర్థికాంశాలు

పారిశ్రామిక రంగ విస్తరణ :  పారిశ్రామిక రంగంలో ఉపాధి ఎంత అవసరమో అంతమందికే ఉపాధిని అందిస్తుంది. కాబట్టి పారిశ్రామిక రంగంలో కుటుంబ సభ్యులను పరిమతం చేసుకుంటారు. పైగా పరిమిత కుటుంబం వల్ల జీవన ప్రమాణం పెరుగుతుంది.

పేదరిక నిర్మూలన

ఉపాధి అవకాశాల కల్పన :  పట్టణాల్లో ప్రభుత్వం అవస్థాపనా సదుపాయాలు పెంచి ఉపాధి అవకాశాలను కల్పిస్తే పట్టణ ప్రజల వైఖరులు పరిమిత కుటుంబానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి జనాభా తగ్గుతుంది.

కుటుంబ నియంత్రణా కార్యక్రమాలు :  చైనాలో ఒక సంతానం అనే నిబంధన రావడంతో చైనా గణనీయంగా జనాభా పెరుగుదల రేటును తగ్గించుకోగలిగింది. మన దేశంలో కేరళ, తమిళనాడు, గోవాలు మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో కుటుంబ నియంత్రణ సాధనాలపై అంత జాగృతి లేదు. కుటుంబ నియంత్రణ కేంద్రాలు స్థాపించడం, సమాచారం, ప్రోత్సాహకాలను అందించడం, కుటంబ నియంత్రణపై పరిశోధన మొదలైన చర్యలను ప్రభుత్వం చేపడుతున్నది.

ఆదాయ సమ పంపిణీ :  పేదవారు పిల్లలను తమ ఆస్తులుగా భావిస్తారు. పేదలకు ప్రభుత్వం అదనంగా భూమిని ఇవ్వడం లేదా ఆదాయాన్ని పున: పంపిణీ చేయడం వంటి చర్యలు చేపట్టడం వల్ల వారి జీవన ప్రమాణం పెరగడంతో పేదరికం తగ్గవచ్చు.  

సాంఘికాంశాలు

అక్షరాస్యతను పెంచడం :  కుటుంబం, వివాహం, పిల్లల సంఖ్య మొదలైన అంశాలపై ప్రజల వైఖరిని మార్చేది విద్య మాత్రమే. కాబట్టి విద్యస్థాయి పెరిగే కొద్దీ మూఢ నమ్మకాలు తగ్గుతాయి. హేతువాదం పెరుగుతుంది. పరిమిత కుటుంబాన్ని కోరుకుంటారు. మహిళల అక్షరాస్యతను సంతానోత్పత్తి రేటుకు సంబంధం ఉంటుంది. స్త్రీ అక్షరాస్యత పెరిగే కొద్దీ సంతానోత్పత్తి రేటు తగ్గుతుంది.

స్త్రీ విద్యాస్థాయిని పెంచడం :  స్త్రీ విద్యాస్థాయి పెరిగే కొద్దీ స్త్రీ పట్ల వివక్షత తొలగిపోయి జనాభా తగ్గుతుంది.

కనీస వివాహ వయస్సును పెంచడం : 1978లో స్త్రీ పురుష వివాహ వయస్సును 18 నుంచి 21 సంవత్సరాలకు పెంచినా బాల్య వివాహాలు కొనసాగుతున్నాయి. కాబట్టి విద్య ద్వారా ప్రజల ఆలోచనలో మార్పు తీసుకువచ్చి 21 సంవత్సరాలు పైనే వివాహం జరిగేటట్లు ప్రోత్సహించాలి.

ఆర్థికాభివృద్ధికి ఆటంకం

  •     జనాభా పెరిగే కొద్దీ భూమిపై ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా భూమి–మానవ నిష్పత్తిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. 1951 జనాభా లెక్కల్లో మన దేశంలో జనసాంద్రత 117 కాగా, 2011 నాటికి 382కు పెరిగింది. చదరపు కిలోమీటర్​కు నివసించే జనాభా పెరగడం వల్ల తలసరి ఒక్కొక్కరికి వచ్చే భూమి తగ్గుతుంది. కమతాలు విభజనకు లోనవుతాయి. ఫలితంగా ఉత్పాదకత తగ్గుతుంది. కాబట్టి జనాభా వృద్ధి పెరగడం ఆర్థికాభివృద్ధికి ఆటంకమవుతుంది. 
  •     జనాభా పెరిగే కొద్దీ అనుత్పాదక ఉద్దేశానికి ఉపయోగించే వనరులకు డిమాండ్​ పెరుగుతుంది. ఫలితంగా ఉత్పాదక రంగాలకు లభించే వనరులు తగ్గుతాయి. మూలధన కల్పన కూడా క్షీణించవచ్చు.
  •     జనాభా పెరిగే కొద్దీ నిరుద్యోగిత పెరుగుతుంది. మన దేశంలో ప్రచ్ఛన్న నిరుద్యోగిత పెరుగుతున్నది.
  •     జనాభా పెరిగే కొద్దీ తలసరి ఆదాయం తగ్గి జీవన ప్రమాణం పడిపోతుంది.
  •     జనాభా పెరగడం వల్ల ఆహార ధాన్యాలు, వినియోగ వస్తువులకు డిమాండ్​ పెరిగి విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ఎగుమతి ద్వారా లభించే విదేశీ మారక ద్రవ్యం తక్కువ ఉండటం వల్ల అభివృద్ధి చెందుతున్న దేశాల్లో విదేశీ వ్యాపార చెల్లింపుల శేషంలో లోటు ఏర్పడుతుంది. 
  •     జనాభా పెరిగే కొద్దీ కనీస అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై పడుతుంది. ప్రభుత్వం రైతుల నుంచి, మిల్లర్ల నుంచి ఆహార ధాన్యాలు కొనుగోలు చేసి తక్కువ ధరకు ప్రజలకు అందించాల్సి వస్తుంది. దీనివల్ల ప్రభుత్వంపై భారం పడుతుంది. 
  •     జనాభా వేగంగా పెరగడం వల్ల వృత్తుల విభజనలో మార్పు చాలా నెమ్మదిగా సంభవిస్తుంది. దీనికి కారణం పెరిగే జనాభాకు అధికంగా ఆహార ధాన్యాలను అందించాల్సి రావడం, ఇతర రంగాల్లో పెట్టుబడి పెట్టడానికి పెట్టుబడి నిధులు తక్కువగా ఉండటం.

అభివృద్ధికి ఆటంకం కాదు 

కొంతమంది ఆర్థికవేత్తలు జనాభా వృద్ధి ఆర్థికాభివృద్దికి ఆటంకం కాదని వాదించారు. జనాభా పెరిగే కొద్దీ ఉపయోగించకుండా ఉన్న సహజ వనరులు ఉపయోగంలోకి వస్తాయి. ఫలితంగా సహజ వనరులు గరిష్టంగా వినియోగించబడుతాయి. జనాభా పెరగడం వల్ల పారిశ్రామిక వస్తువులకు డిమాండ్​ పెరిగి పారిశ్రామికాభివృద్ది జరుగుతుంది. ఇంగ్లండ్​లో జనాభా పెరుగుదల పారిశ్రామిక విప్లవం రావడానికి కారణమైంది.