తెలంగాణలో భూ రీసర్వే @ 1,000 గ్రామాలు.. 416 ఊళ్లలో పూర్తి

తెలంగాణలో భూ రీసర్వే @ 1,000 గ్రామాలు.. 416 ఊళ్లలో పూర్తి
  •     ఇయ్యాల కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీవోలతో వీసీ 

హైదరాబాద్, వెలుగు: సమగ్ర భూ రీసర్వే వెయ్యి గ్రామాల మైలురాయిని దాటిందని, అందులో 416 గ్రామాల్లో సర్వే ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి తెలిపారు. సర్వేను అత్యంత పారదర్శకంగా, శాస్త్రీయంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్. లోకేశ్ కుమార్, సర్వే అండ్ ల్యాండ్ సెటిల్‌‌‌‌‌‌‌‌మెంట్ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు, జాయింట్ డైరెక్టర్ ప్రసన్నలక్ష్మి తదితర ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10,954 రెవెన్యూ గ్రామాలు ఉండగా.. తొలి దశలో హైదరాబాద్ మినహా మిగిలిన 32 జిల్లాల్లో జిల్లాకు 70 గ్రామాల చొప్పున ఎంపిక చేయడంతోపాటు నక్షాలు అందుబాటులో లేని గ్రామాలను కలుపుకొని మొత్తం 2,720 గ్రామాల్లో రీసర్వే నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సమీక్ష సందర్భంగా సర్వేలో పాల్గొంటున్న క్షేత్రస్థాయి సిబ్బందితో మంత్రి స్వయంగా ఫోన్‌‌‌‌‌‌‌‌లో మాట్లాడి సమస్యలు, రైతుల స్పందన, సాంకేతిక పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

అభ్యంతరాల నమోదుకు చాన్స్​ఇవ్వండి

ఈ సర్వే ప్రక్రియలో భూ యజమానుల ప్రయోజనాలు, వారి అభిప్రాయాలు, మనోభావాలకే ప్రాధాన్యం ఇవ్వాలని, రైతుల సంతృప్తే సర్వే విజయానికి ప్రామాణికమని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో సర్వే ప్రారంభించడానికి ముందు సంబంధిత గ్రామానికి చెందిన రెవెన్యూ రికార్డులు, భూముల విస్తీర్ణం, హక్కులు, సరిహద్దులను అధికారులు పూర్తిస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. సర్వే పూర్తయిన వెంటనే సంబంధిత భూ యజమానులకు తప్పనిసరిగా నోటీసులు జారీ చేయాలని చెప్పారు.

అభ్యంతరాల నమోదుకు చాన్స్​ఇవ్వాలన్నారు. సర్వే తీరు, నోటీసులు, అభ్యంతరాల నమోదు, పరిష్కార విధానాలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. రీసర్వే ప్రారంభ దశలోనే ఉన్నందున చిన్న తప్పిదం జరిగినా ఊరుకోబోమని హెచ్చరించారు. భవిష్యత్తులో ఒక్క భూవివాదం కూడా రావొద్దన్నారు. సర్వే పూర్తయిన గ్రామాల్లో ప్రతీ భూమికి ఆధార్ తరహాలో భూదార్ నంబర్ల కేటాయింపును వేగవంతం చేయాలని ఆదేశించారు. బుధవారం కలెక్టర్లు, అడిషనల్​కలెక్టర్లు, ఆర్డీవోలు, సర్వే శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లతో ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు మంత్రి ప్రకటించారు.