తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సమీకృత గురుకుల విద్యావిధానం విద్యారంగంలో ఒక విప్లవాత్మక అడుగుగా నిలవనుంది. సామాజిక, ఆర్థిక అసమానతలను తగ్గించేందుకు విద్యనే ప్రధాన ఆయుధంగా రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈక్రమంలో కుల–మత–వర్గ వివక్షలకు తావు లేకుండా పేద, గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో సమీకృత గురుకుల విధానాన్ని తీసుకొచ్చింది. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ గురుకుల భవనాన్ని ఆధునిక మౌలిక వసతులతో నిర్మించాలన్న ఆలోచన తెలంగాణ విద్యా చరిత్రలో ఒక మైలురాయిగా భావించవచ్చు.
కా ర్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా, అంతర్జాతీయ స్థాయిలో విద్యను ఆహ్లాదకరమైన వాతావరణంలో అందించాలన్న ప్రభుత్వ సంకల్పం సమాజంలోని సబ్బండ వర్గాల్లో సరికొత్త ఆశలను నింపుతోంది. భవనాల నిర్మాణం, వసతుల కల్పన ఎంతో ఖర్చుతో కూడుకున్నదైనప్పటికీ, విద్యను ప్రాథమిక రంగంగా భావించిన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో గణనీయమైన కేటాయింపులు చేయడం అభినందనీయం. దాదాపు మూడు దశాబ్దాల క్రితం ప్రభుత్వ పాఠశాలల్లో అన్నివర్గాల విద్యార్థులు కుల–మత–వర్గ వివక్షలకు తావు లేకుండా విద్యను అభ్యసించి ఉన్నతస్థితికి చేరారు. ఆ తరం విద్యార్థులు సామాజిక సమన్వయం, సహనుభూతిని కలిగి సమాజ అభ్యున్నతి కోసం వివిధ రంగాల్లో నేటికీ నిస్వార్థంగా సేవలందిస్తున్నారు. ప్రస్తుతం ఆ పరిస్థితి క్రమంగా కనుమరుగవుతోంది.
ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా ఉచిత విద్య
ప్రైవేటు విద్యారంగం గణనీయంగా విస్తరిస్తున్నకొద్దీ ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల సంఖ్య అదే స్థాయిలో తగ్గుతూ వచ్చింది. ప్రైవేటీకరణ పరాకాష్టకు చేరిన కార్పొరేటీకృత విద్యారంగంలో విద్య సామాన్యుడికి అందని ద్రాక్షగా మారింది. ఫలితంగా పేద, మధ్యతరగతి కుటుంబాలు ప్రైవేటు విద్య మోజుతో ఆర్థికంగా చితికిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా ఉచిత విద్య, వసతి సౌకర్యాలు కల్పిస్తున్న గురుకుల విద్యాసంస్థలకు విశేష ఆదరణ పెరిగింది.
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దూర దృష్టితో 1971లో నల్గొండ జిల్లా సర్వేయల్‌లో స్థాపించిన గురుకుల పాఠశాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థలో ఒక సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. అక్కడ విద్యనభ్యసించిన మహేందర్ రెడ్డి, రామకృష్ణా రావు, బుర్ర వెంకటేశం వంటి వారు నేడు ప్రముఖ స్థానాల్లో విధులు నిర్వహిస్తున్నారు.
అదే స్ఫూర్తితో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య అందించాలనే లక్ష్యంతో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు స్థాపించడం జరిగింది. నాటి ఐఏఎస్ అధికారి ఎస్.ఆర్. శంకరణ్ చొరవతో ఏర్పాటైన ఈ పాఠశాలలు అనేకమంది దళిత విద్యార్థుల అభ్యున్నతికి దోహదపడ్డాయి.
సమీకృత గురుకుల క్యాంపస్‌లు
క్రమంగా ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల విద్యార్థుల కోసం కూడా ప్రత్యేక గురుకులాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం గురుకులాల సంఖ్య 1,040కి చేరుకుంది. ఈ క్రమంలో వివిధ గురుకుల సొసైటీలను ఒకే క్యాంపస్‌లో సమీకరించి సమీకృత గురుకుల క్యాంపస్‌లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించిన నిర్మాణపనులు వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశించారు. ఈ నిర్మాణాలు పూర్తిచేసి వచ్చే విద్యా సంవత్సరానికే ప్రారంభించాలనే ఆశాభావాన్ని ప్రభుత్వం వ్యక్తం చేస్తోంది.
అయితే, దాదాపు 3000 మంది విద్యార్థులు ఉండే ఒక క్యాంపస్‌ను మినీ యూనివర్సిటీ స్థాయిలో సమర్థవంతంగా నిర్వహించడం నిర్వాహకులకు కత్తిమీద సాములాంటిదే. అయినప్పటికీ ప్రభుత్వం దృఢ సంకల్పంతో, మంచి ఉద్దేశంతో ముందుకు సాగుతున్న తరుణంలో, రేపటి గురుకుల విద్యావ్యవస్థ సమర్థవంత నిర్వహణకు కచ్చితమైన దారులు ఏర్పడతాయనే విశ్వాసం ప్రతి ఒక్కరిలో ఉండాల్సిందే.
కామన్ గురుకుల విద్యా విధానం
ఈ విప్లవాత్మక నిర్ణయపు వెలుగులో కామన్ గురుకుల విద్యా విధానం రూపకల్పనకు బాటలు పడే అవకాశాలు మొదలైంది. ఇప్పటికే ప్రభుత్వం కామన్ మెనూ ప్రవేశపెట్టిన నేపథ్యంలో, కామన్ గురుకుల విద్యా విధానాన్ని కూడా తీసుకువస్తుందనే అభిప్రాయాలకు మరింత బలం చేకూరుతోంది. వాస్తవానికి ఒక్కో శాఖలో ఒక్కో రకమైన విధి విధానాలు ఉండడం శ్రేయస్కరం కాదు. ఎందుకంటే ఉద్యోగుల రిక్రూట్మెంట్, ప్రమోషన్లు, వేతనాల్లో తారతమ్యం ఉండటంవల్ల వారి ఆలోచనలపై, పనితీరుపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.
ఏకరూప రిక్రూట్మెంట్, పని విధానాల్లో సారూప్యత ఉన్నప్పటికీ, ప్రమోషన్లు, వేతనాల్లో తేడాలు ఉద్యోగుల అసంతృప్తికి దారితీస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో మొత్తం గురుకుల విద్యావ్యవస్థకు నష్టం కలిగించే అంశాలకు ప్రభుత్వం అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. ఇటీవల ప్రభుత్వం రూపకల్పన చేస్తున్న తెలంగాణ విద్యా బిల్లులో కామన్ గురుకుల విద్యా విధానమనే అంశాన్ని చేర్చాలి.
తెలంగాణ గురుకుల విద్యావ్యవస్థను ఒకే గొడుగు కిందికి తీసుకురావాలి లేదా కనీసం కామన్ డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలి. దీంతో సమీకృత గురుకుల విద్యా విధాన స్ఫూర్తికి సార్థకత చేకూరుతుంది. ఈక్రమంలో మొత్తం గురుకుల విద్యావ్యవస్థలో ఒక సరికొత్త విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలని మా గురుకుల విద్యాసంస్థల అసోసియేషన్లు విజ్ఞప్తి చేస్తున్నాయి.
-డా. అజయ్‌కుమార్ రౌతు,అధ్యక్షుడు,తెలంగాణ గురుకుల ప్రిన్సిపాల్స్ అసోసియేషన్
