టీజీ మార్స్ వచ్చేసింది..హైవేలపై 24 గంటల పెట్రోలింగ్.. ప్రతి పీఎస్‌‌లో రోడ్ క్రాష్ రెస్పాన్స్ ఆఫీసర్

టీజీ మార్స్ వచ్చేసింది..హైవేలపై 24 గంటల పెట్రోలింగ్.. ప్రతి పీఎస్‌‌లో రోడ్ క్రాష్ రెస్పాన్స్ ఆఫీసర్
  •  ఈ-చలాన్లు, ప్రమాదాల డేటాతో ఉల్లంఘనలపై నిఘా
  • 300 మంది సిబ్బంది బదలాయింపు.. అడిషనల్ డీజీపీ/ఐజీ స్థాయి అధికారి డైరెక్టర్ 

హైదరాబాద్‌‌,వెలుగు: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నిర్వహణ, రోడ్ సేఫ్టీ, హైవే పెట్రోలింగ్, ప్రమాదాల దర్యాప్తు, ఎలక్ట్రానిక్ ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌తో పాటు రైలు ప్రయాణ భద్రత కోసం తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్‌‌మెంట్ రోడ్ అండ్ రైల్ సేఫ్టీ (టీజీ మార్స్) బ్యూరో ఏర్పాటైంది. ఈ మేరకు జీఓ ఎంఎస్ నంబర్ 135ను సీఎస్ సంజయ్ జాజు గురువారం జారీ చేశారు.

రాష్ట్రంలో 32 వేల కిలోమీటర్లకు పైగా రోడ్డు నెట్‌‌వర్క్, 1.8 కోట్లకు పైగా వాహనాలు ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ నిర్వహణలో టెక్నాలజీ, ట్రైనింగ్, డేటా విశ్లేషణ, ప్రమాణాల్లో ఏకీకృత విధానం తీసుకురావడమే లక్ష్యంగా ఈ బ్యూరోను ఏర్పాటు చేశారు.

బ్యూరో డైరెక్టర్‌‌గా అడిషనల్ డీజీపీ లేదా ఐజీ స్థాయి అధికారి

హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే టీజీ మార్స్‌‌కు రాష్ట్రవ్యాప్తంగా అధికార పరిధి ఉంటుంది. అడిషనల్ డీజీపీ లేదా ఐజీ స్థాయి అధికారి డైరెక్టర్‌‌గా వ్యవహరిస్తారు. ప్రతి పోలీస్ కమిషనరేట్‌‌లో జాయింట్ సీపీ (ట్రాఫిక్), ప్రతి జిల్లాలో అదనపు ఎస్పీ (ట్రాఫిక్) పోస్టులను ఏర్పాటు చేయనున్నారు. అవసరమైతే ప్రస్తుతం ఉన్న పోస్టులను రీ-డిజిగ్నేట్ చేసి వీటిని భర్తీ చేయనున్నారు.

వివిధ పోలీస్ విభాగాల నుంచి 300 మంది సిబ్బందిని బ్యూరోకు బదలాయించనున్నారు. జాయింట్ డైరెక్టర్ (ట్రాఫిక్), జాయింట్ డైరెక్టర్ (రోడ్ అండ్ రైల్ సేఫ్టీ) ఆధ్వర్యంలో రెండు ప్రధాన విభాగాలు పనిచేస్తాయి. ట్రాఫిక్ నిర్వహణ, ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్, ప్రమాదాల దర్యాప్తు, ప్రాసిక్యూషన్‌‌కు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ఒకే రకమైన ప్రమాణాలు, ఎస్‌‌ఓపీలు, మార్గదర్శకాలను బ్యూరో రూపొందిస్తుంది.

అయితే రోజువారీ ట్రాఫిక్ నిర్వహణ, ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌పై కమిషనర్లు, ఎస్పీల అధికారాలు యథాతథంగా కొనసాగుతాయి. రోడ్డు ప్రమాదాల కేసుల నమోదు, దర్యాప్తును మరింత శాస్త్రీయంగా మార్చేందుకు ఈ-డిటైల్డ్ యాక్సిడెంట్ రిపోర్ట్ (ఈడీఏఆర్), సీసీటీఎన్‌‌ఎస్, ఈ-కోర్టులతో అనుసంధానాన్ని బ్యూరో పర్యవేక్షిస్తుంది.

 ప్రతి పీఎస్‌‌లో రోడ్ క్రాష్ రెస్పాన్స్ ఆఫీసర్

రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పోలీస్‌‌స్టేషన్‌‌లో రోడ్ క్రాష్ రెస్పాన్స్ ఆఫీసర్‌‌ను నియమించనున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకోవడం, బాధితులను గోల్డెన్ అవర్‌‌లో ఆస్పత్రికి తరలించేలా చూడటం, ప్రమాద వివరాలను ఈడీఏఆర్‌‌లో నమోదు చేయడం ఆయన బాధ్యతగా ఉంటుంది. హైవేలపై 24 గంటల పెట్రోలింగ్ నిర్వహించనున్నారు. జాతీయ రహదారులు, ఎక్స్‌‌ప్రెస్‌‌వేలు, ఓఆర్‌‌ఆర్, నోటిఫై చేసిన రాష్ట్ర రహదారులపై హైవే పెట్రోల్ యూనిట్లు పనిచేస్తాయి.

50 కిలోమీటర్లకు పైగా జాతీయ లేదా రాష్ట్ర రహదారి పరిధి ఉన్న పోలీస్‌‌స్టేషన్లలో హైవే పెట్రోల్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి పెట్రోల్ యూనిట్‌‌లో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్‌‌తో పాటు ప్రత్యేక పెట్రోలింగ్ వాహనం ఉంటుంది. ఈ వాహనాల్లో డ్యాష్‌‌బోర్డ్ కెమెరాలు, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ఏఎన్‌‌పీఆర్), స్పీడ్ డిటెక్షన్ పరికరాలు ఏర్పాటు చేస్తారు. 

 ఉల్లంఘనలపై డేటాతో నిఘా..

ట్రాఫిక్ ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్ అనలిటిక్స్ అండ్ ఇంటెలిజెన్స్ సెల్‌‌ను బ్యూరోలో ఏర్పాటు చేయనున్నారు. ఈ-చలాన్లు, రోడ్డు ప్రమాదాలు, పెట్రోలింగ్ డేటాను విశ్లేషించి ప్రమాదకర ప్రాంతాలు, ట్రాఫిక్ ఉల్లంఘనల హాట్‌‌స్పాట్లు గుర్తిస్తారు. ట్రాఫిక్ ఉల్లంఘనలపై వసూలయ్యే కాంపౌండింగ్ ఫీజు, జరిమానాల్లో 40 శాతం ట్రాఫిక్ మేనేజ్‌‌మెంట్ ఫండ్‌‌కు జమ చేయనున్నారు.

ఈ నిధులను ఎలక్ట్రానిక్ ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్ పరికరాలు, బాడీ-వోర్న్, డ్యాష్‌‌బోర్డ్ కెమెరాలు, ఈ-చలాన్ పరికరాలు, హైవే పెట్రోల్ వాహనాలు, టెక్నాలజీ, శిక్షణకు వినియోగిస్తారు. ట్రాఫిక్, రోడ్ సేఫ్టీతో పాటు మెట్రో రైలు, బుల్లెట్ ట్రైన్ సహా రాష్ట్రంలోని ఇతర రైలు రవాణా వ్యవస్థల భద్రత, ప్రభుత్వ రైల్వే పోలీస్‌‌స్టేషన్ల పర్యవేక్షణ, రైలు ప్రమాదాలపై తక్షణ స్పందన కూడా టీజీ మార్స్ పరిధిలోకి వస్తుంది.