- తీవ్ర ఉద్రిక్తత.. అరెస్ట్
బషీర్‌బాగ్, వెలుగు: ఎస్సీ వర్గీకరణ బిల్లును పునఃసమీక్షించాలని డిమాండ్ చేస్తూ సోమవారం తెలంగాణ మాల సంఘాల జేఏసీ చేపట్టిన అసెంబ్లీ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం అనంతరం అసెంబ్లీ వైపు వెళ్లేందుకు యత్నించిన నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. అసెంబ్లీ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, జేఏసీ నాయకుల మధ్య తోపులాట, వాగ్వావాదం జరిగి కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.
ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ మందాల భాన్కర్, అధ్యక్షుడు చెరుకు రాంచందర్, గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ బేర బాలకిషన్ మాట్లాడుతూ.. చేవెళ్ల డిక్లరేషన్ ద్వారా ఎస్సీ రిజర్వేషన్లను 15 శాతం నుంచి 22 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. రోస్టర్ విధానాన్ని సవరించి 20లోపు రెండు రోస్టర్ పాయింట్లు కల్పించాలని కోరారు. ముఖ్యమంత్రి వైఖరికి నిరసనగా అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చినట్టు వెల్లడించారు.
మాలల హక్కుల కోసం ఏ త్యాగాలకైనా సిద్ధమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మాలలకు జరుగుతున్న అన్యాయాలపై అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి వివేక్ వెంకటస్వామి, మాల ప్రజాప్రతినిధులు చర్చించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొండి వైఖరి విడనాడి తమ డిమాండ్లు పరిష్కరించాలని, లేనిపక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
