
ఖానాపూర్, వెలుగు : వైద్య విధాన పరిషత్ పరిధిలో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించాలని తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ స్టేట్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ చారి డిమాండ్ చేశారు. ఖానాపూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేస్తున్న తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఉద్యోగులు శుక్రవారం స్థానిక ఆస్పత్రి ఎదుట మౌన ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ చారి మాట్లాడుతూ ఉద్యోగులకు జీతాలు ఆలస్యం కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో జీతాలు చెల్లించాలని పలుమార్లు అధికారులను కలిసి విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జీతాలు సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్లు వంశీ మాధవ్, మమత, శైలజ, సుధీర్, ఉపేందర్, సాయికృష్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.