అసంతృప్తుల నేతలకు కేసీఆర్, కేటీఆర్ బుజ్జగింపులు

అసంతృప్తుల నేతలకు  కేసీఆర్, కేటీఆర్  బుజ్జగింపులు
  •  నేతలతో సమావేశమైతున్న కేసీఆర్, కేటీఆర్
  • కడియం, రాజయ్య మధ్య కుదిరిన సయోధ్య
  •  రాజయ్యకు రైతుబంధు సమితి చైర్మన్ పదవి!
  •  ఎమ్మెల్సీ పల్లా, ఎమ్మెల్యే ముత్తిరెడ్డితోనూ భేటీ
  • ముత్తిరెడ్డికి ఆర్టీసీ చైర్మన్ పదవి ఇచ్చే చాన్స్ 
  • మల్కాజ్​గిరికి త్వరలో కొత్త అభ్యర్థి ఎంపిక

హైదరాబాద్, వెలుగు : అసంతృప్తులను బీఆర్ఎస్ బుజ్జగిస్తున్నది. నియోజకవర్గాల్లో వర్గ విభేదాలను పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. అసంతృప్త లీడర్లతో పాటు ఆశావహులు, ఇతర లీడర్లను పిలిపించుకుని పార్టీ వర్కింగ్ ​ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. అమెరికా, దుబాయ్ టూర్ ముగించుకుని వచ్చినప్పటి నుంచి ఆయన అదే పనిలో ఉన్నారు. ఇప్పటికే అసంతృప్త నేతలతో మంత్రి హరీశ్​, ఎమ్మెల్సీ కవిత మాట్లాడి బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. పార్టీ, ప్రభుత్వంలో అవకాశాలపై కేటీఆర్, కేసీఆర్​తో మాట్లాడుతామని గతంలోనే హామీలు ఇచ్చారు. 

ఈ క్రమంలోనే అసంతృప్త నేతలు, ఆశావహులు, ఎమ్మెల్యేలను ప్రగతి భవన్​కు పిలిపించి కేటీఆర్​మాట్లాడుతున్నారు. మొదట ఉమ్మడి వరంగల్​జిల్లాపై​ దృష్టి పెట్టిన ఆయన.. శుక్రవారం స్టేషన్​ఘన్​పూర్  నుంచి ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, జనగామ నుంచి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​ రెడ్డిని పిలిపించి మాట్లాడారు. మరోవైపు కుత్బుల్లాపూర్​నియోజకవర్గంలో రెండు వర్గాలుగా ఉన్న పార్టీ లీడర్లు.. పార్టీ చీఫ్​ కేసీఆర్​ను కలిశారు. పార్టీ గెలుపు కోసం అందరూ కలిసే పనిచేయాలని కేసీఆర్​ వారికి దిశానిర్దేశం చేశారు. 

శాంతించిన రాజయ్య..  

స్టేషన్​ఘన్​పూర్​ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్య స్థానంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి ఈసారి అవకాశం ఇచ్చారు. అప్పటి నుంచి పార్టీపై రాజయ్య అసంతృప్తితో ఉన్నారు. కేసీఆర్​నాయకత్వంలో పని చేస్తానని చెప్తూనే.. ఆయన కాంగ్రెస్​తోనూ టచ్​లోకి వెళ్లినట్టు ఆరోపణలు వచ్చాయి. మాదిగ మేధావుల సమావేశం సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహతో రాజయ్య సమావేశమవడంతో ఆయన పార్టీని వీడటం ఖాయమని ప్రచారం జరిగింది. చీఫ్​విప్​వినయ్​భాస్కర్ ​సహా పలువురు నేతలు ఆయనను కలిసి బీఆర్ఎస్​లోనే కొనసాగాలని సూచించారు. ఈ క్రమంలో కడియం, రాజయ్యను ప్రగతి భవన్​కు పిలిపించుకున్న కేటీఆర్.. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చారు. స్టేషన్​ఘన్​పూర్​లో కడి యం శ్రీహరి గెలుపునకు కృషి చేయాలని, సముచిత స్థానం కల్పిస్తామని రాజయ్యకు హామీ ఇచ్చారు. దీంతో శాంతించిన రాజయ్య.. పార్టీ గెలుపు కోసం పని చేస్తానని చెప్పారు.  రాజయ్యకు రైతుబంధు సమితి చైర్మన్​గా అవకాశమిస్తారని సమాచారం. 

కేసీఆర్ ను కలిసిన కుత్బుల్లాపూర్ లీడర్లు.. 

కుత్బుల్లాపూర్​ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్​ రాజు సీఎం కేసీఆర్​తో భేటీ అయ్యారు. పార్టీని గెలిపించాలని ఇద్దరు నేతలకు కేసీఆర్​ సూచించినట్టు తెలిసింది. మంగళవారం నాటికి పెండింగ్​లో ఉన్న నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశముండటంతో నర్సాపూర్, గోషామహల్​కు చెందిన​ లీడర్లను శనివారం పిలిపించి మాట్లాడే చాన్స్ ఉంది. 

పటాన్​చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్​రెడ్డి, ఇక్కడ టికెట్​ ఆశిస్తున్న నీలం మధు ముదిరాజ్​ను ఒకట్రెండు రోజుల్లో పిలిపించి మాట్లాడే అవకాశముందని సమాచారం. కాగా, బీఆర్ఎస్ ను వీడుతున్నట్టు మైనంపల్లి ప్రకటించడంతో మల్కాజిగిరికి కొత్త అభ్యర్థిని ప్రకటించనున్నారు. ఇక్కడి నుంచి ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి, కొడుకు మహేందర్​ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి కోడలు, ప్రస్తుత కార్పొరేటర్ విజయశాంతి రెడ్డి, మండలి రాధాకృష్ణ యాదవ్​ తదితరుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. 

జనగామ టికెట్ పల్లాకు! 

సోమ, మంగళవారం నాటికి జనగామ నుంచి పోటీ చేసే అభ్యర్థిని ప్రకటించే యోచనలో బీఆర్​ఎస్​ అధిష్టానం ఉంది. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి,  పల్లా రాజేశ్వర్​రెడ్డితో పాటు నియోజకవర్గానికి చెందిన ముఖ్య ప్రజాప్రతినిధులు, నాయకులను కేటీఆర్ ప్రగతి భవన్​కు పిలిపించి మాట్లాడారు. ఎవరికి టికెట్​ ఇచ్చినా పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సీఎం కేసీఆర్​తో భేటీ అయ్యారు. 

జనగామ టికెట్​ తనకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మూడు, నాలుగు రోజుల్లో అభ్యర్థిని ప్రకటిస్తామని.. నియోజకవర్గానికి వెళ్లి పని చేసుకోవాలని ఆయనకు కేసీఆర్​ సూచించారు. పల్లాతోనూ కేసీఆర్ సమావేశమై నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై ఆరా తీశారు. జనగామ టికెట్ పల్లాకు దాదాపు ఖరారైందని, ముత్తిరెడ్డికి ఆర్టీసీ చైర్మన్ పదవి ఇస్తారని సమాచారం.