కేసీఆర్ ముందుచూపుతోనే పోలీసు శాఖ అభివృద్ధి

కేసీఆర్ ముందుచూపుతోనే పోలీసు శాఖ అభివృద్ధి

హైదరాబాద్: రాష్ట్ర పోలీసు శాఖ అభివృద్ధి వెనుక సీఎం కేసీఆర్ ముందుచూపు ఎంతో ఉందని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆసిఫ్‌నగర్‌‌లో కొత్త పోలీసు స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని, రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, డీజీపీ మహేందర్ రెడ్డితోపాటు సీపీ అంజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. ఏ దేశంలోనైనా శాంతి భద్రతలు చాలా ముఖ్యమన్నారు. తెలంగాణ పోలీసులకు గొప్ప పేరుందని స్వయంగా కేంద్ర హోమ్ శాఖ చెప్పిందని గుర్తు చేశారు. నగరంలో 6 లక్షల సీసీ కెమెరాలు ఉండటం గొప్ప విషయమన్నారు. 

‘సీఎం కేసీఆర్ ఎంతో ముందుచూపుతో పోలీస్ శాఖను అభివృద్ధి చేస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా పోలీసుల అవసరాలు గుర్తించలేదు. పోలీసులతో అన్ని రకాల విధులను నిర్వహించుకోవడం ఎంతముఖ్యమో వారి అవసరాలు గుర్తించడం అంతే ముఖ్యం. ఒకప్పటి పోలీస్ వేరు, ఇప్పటి  పోలీస్ వేరు. మా నార్త్ జోన్‌‌లో పోలీసులకు పెద్దగా పని ఉండదు. అక్కడ క్రైమ్ రేట్ జీరో. ఎవరైనా ట్రాన్సఫర్ కోసం నా దగ్గరకు వస్తే  పోలీసులకు ఇదే చెప్తా. నార్త్ నుంచి సౌత్ వరకు కూడా పోలీస్ శాఖ పనితీరు చాలా మెరుగైంది. చైర్మన్ కోలేటి దామోదర్ కృషిని అభినందిస్తున్నా. పార్టీలు ఏవైనా ప్రజల అభివృద్ధికి అందరం కలసి కృషి చేద్దాం. పోలీస్ శాఖ అభివృద్ధి అందరికీ అవసరమే. త్వరలోనే ఎస్‌ఆర్ నగర్ పోలీసు స్టేషన్‌‌ను కూడా ప్రారంభించాలని కోరుతున్నా. డీజీపీ, సీపీ నేతృత్వంలో పోలీసు శాఖ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నా’ అని తలసాని పేర్కొన్నారు.