తెలంగాణను గ్లోబల్ స్కిల్ హబ్గా మారుస్తం : మంత్రి వివేక్

తెలంగాణను  గ్లోబల్ స్కిల్ హబ్గా మారుస్తం : మంత్రి వివేక్
  • ప్రత్యేక విజన్​తో ముందుకెళ్తున్నం: మంత్రి వివేక్
  • టామ్​కామ్​తో యువతకు సాంకేతిక, భాషలో ట్రైనింగ్ ఇస్తున్నం
  • జర్మనీ కంపెనీల భాగస్వామ్యంతో ముందుకు
  • ఇండో జర్మన్ యంగ్ లీడర్స్ ఫోరమ్ సదస్సుకు హాజరు

న్యూఢిల్లీ: తెలంగాణను ఇండియా గ్లోబల్ స్కిల్ హబ్​గా మారుస్తామని, ఆ విజన్​తో తమ ప్రభుత్వం ముందుకెళ్తున్నదని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. యువతకు సాంకేతిక, భాషా నైపుణ్యాలతో పాటు ప్రపంచ స్థాయిలో రాణించేలా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్​పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్​కామ్) కేంద్రాల్లోని మోడల్ కెరీర్ సెంటర్లు, ఐటీఐల ద్వారా జర్మనీ, ఇతర విదేశీ భాషలపై శిక్షణను విస్తరింపజేసేందుకు యోచిస్తున్నామని అన్నారు.

ఢిల్లీలోని జర్మనీ ఎంబసీలో గురువారం నిర్వహించిన ఇండో జర్మన్ యంగ్ లీడర్స్ ఫోరమ్ (ఐజీవైఎల్​ఎఫ్) యాన్యువల్ కాన్ఫరెన్స్ 2025కు మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. జర్మనీ అంబాసిడార్, ఐజీవైఎల్​ఎఫ్ కో చైర్మన్ హెచ్​ఈ డాక్టర్ ఫిలిప్ అకర్మాన్ ఆహ్వానం మేరకు ఈ సమిట్​లో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర యువతలో స్కిల్ డెవలప్​మెంట్, ఇంటర్నేషల్ వర్క్ ఫోర్స్ మొబిలిటీ, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల గురించి మంత్రి వివేక్ వివరించారు. 

జర్మనీలో నైపుణ్య కార్మికుల కొరత తీర్చడంలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తున్నదని తెలిపారు. అక్కడి అవసరాలను బట్టి ఇక్కడి యువతకు అన్ని రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నామన్నారు. ఫెడరల్ ఎంప్లాయ్​మెంట్ ఏజెన్సీ (బీఏ), గోథే జెంట్రమ్ హైదరాబాద్, ప్రముఖ జర్మనీ కంపెనీల భాగస్వామ్యంతో ‘టామ్​కామ్’​ను ముందుకు తీసుకెళ్తున్నట్లు వివరించారు. ఆస్​బిల్డింగ్ ప్రోగ్రామ్ కింద టెక్నికల్ ట్రేడ్స్, లాజిస్టిక్స్, కన్​స్ట్రక్షన్​తో పాటు ఇతర నైపుణ్య రంగాల్లో అత్యుత్తమ శిక్షణ అందిస్తున్నామని తెలిపారు.

 ట్రిపుల్ విన్ ప్రాజెక్ట్​లో భాగంగా జర్మనీ సహకారంతో అర్హత ఉన్న తెలంగాణ నర్సులకు ఫ్రీగా జర్మనీ భాష నేర్పించి ఉద్యోగాలు కల్పిస్తున్నామన్నారు. బ్రిడ్జింగ్ బార్డర్స్ ప్రోగ్రామ్ కింద నర్సింగ్ స్టూడెంట్లకు డిగ్రీతో పాటు జర్మనీ భాషలో శిక్షణ ఇస్తున్నామని, ఈ పైలెట్ ప్రాజెక్ట్ ను నిమ్స్, టీఎస్​ఆర్టీసీ నర్సింగ్ కాలేజీల్లో విజయవంతంగా ప్రారంభించామన్నారు. ఈ సదస్సుకు వివిధ రాష్ట్రాల నుంచి పలువురు మంత్రులు, కంపెనీ ప్రతినిధులు హాజరయ్యారు.