శాసనసభలకు హాజరుకాకుండా ప్రజాధనంతో జీతభత్యాలు పొందుతున్న ప్రజాప్రతినిధుల వ్యవహారం ఇప్పుడు తీవ్రమైన చర్చకు దారితీస్తోంది. తాజాగా తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు ఈ అంశాన్ని మళ్లీ కేంద్ర బిందువుగా మార్చాయి.
ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ సభకు రాకపోయినా కోట్ల రూపాయల జీతభత్యాలు పొందుతున్నారని చేసిన వ్యాఖ్య కేవలం రాజకీయ విమర్శగా మాత్రమే చూడలేం. దీనిలో ఒక లోతైన ప్రశ్న దాగి ఉంది. విధులు నిర్వర్తించకుండా వేతనం పొందే హక్కు ఎవరికైనా ఉందా? అనే ప్రశ్న వ్యక్తిగతంగా ఎవరికో సంబంధించింది కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థ నైతికతను ప్రశ్నించే అంశం.
ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకునే సమయంలో వారు తమ ప్రాంత సమస్యలను సభలో ప్రస్తావిస్తారని, అభివృద్ధి కోసం కృషి చేస్తారని విశ్వసిస్తారు. అయితే, ఆ ప్రతినిధులు సభకు హాజరుకాకుండా ఉంటే, ప్రజల గొంతుక ఎక్కడ వినిపిస్తుంది ? ఇది ప్రజాస్వామ్యాన్ని కేవలం ఓటు వేసే ప్రక్రియగా మాత్రమే పరిమితం చేస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర మరింత కీలకం. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ప్రభుత్వాన్ని ప్రశ్నించే శక్తి.
ప్రభుత్వ నిర్ణయాల్లో లోపాలను గుర్తించడం, ప్రజా సమస్యలను బలంగా వినిపించడం ప్రతిపక్ష బాధ్యత. అలాంటి ప్రతిపక్ష నాయకులు సభకు హాజరు కాకపోతే, ప్రభుత్వంపై సమతుల్య పర్యవేక్షణ ఉండదు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరుస్తుంది. శక్తిమంతమైన ప్రతిపక్షం లేకపోతే, పాలనలో పారదర్శకత, బాధ్యత తగ్గిపోవడం సహజం. ఈ నేపథ్యంలో ఒక వ్యవస్థాత్మక మార్పు అత్యవసరం.
‘నో వర్క్..నో పే’ విధానం కేవలం ఉద్యోగులకు మాత్రమే కాదు, ప్రజా ప్రతినిధులకు కూడా వర్తించాలి. అసెంబ్లీ సమావేశాలకు నిర్దిష్ట హాజరు శాతం తప్పనిసరి చేయాలి. ఆ శాతం చేరుకోని సభ్యుల జీతాలను
నిలిపివేయడం, అవసరమైతే సస్పెన్షన్ వంటి చర్యలు తీసుకోవడంవంటి కఠిన నిర్ణయాలు అమలుచేయాలి. ఇది కేవలం శిక్ష విధానం కాదు. బాధ్యతను గుర్తుచేసే వ్యవస్థ.
సంస్కరణలతో పరిష్కారం
పారదర్శకత ఒక కీలక అంశం. ప్రతి ఎమ్మెల్యే హాజరు వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలి. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఈ సమాచారాన్ని సులభంగా ప్రజలకు చేరవేయవచ్చు. ప్రజలు తమ
ప్రతినిధుల పనితీరును అంచనా వేయగలిగితేనే బాధ్యత పెరుగుతుంది. అదేవిధంగా రాజకీయ పార్టీలు కూడా తమ సభ్యులపై క్రమశిక్షణను అమలుచేయాలి. సభకు హాజరుకాని వారిపై చర్యలు తీసుకోవడం ద్వారా పార్టీ స్థాయిలో బాధ్యతను పెంచాలి. ప్రజాస్వామ్యంలో హక్కులు ఉన్నంతగా బాధ్యతలు కూడా ఉంటాయి.
ప్రజలు ఇచ్చిన అధికారం ఒక గౌరవం మాత్రమే కాదు, ఒక బాధ్యత. ఆ బాధ్యతను విస్మరించి, కేవలం హోదా, జీతాలకు పరిమితం కావడం ప్రజల విశ్వాసాన్ని వంచించడమే. ఇది కొనసాగితే ప్రజాస్వామ్యంపై ప్రజల నమ్మకం దెబ్బతింటుంది. కాబట్టి, ‘సభకు రాని ఎమ్మెల్యేలకు జీతాలు ఎందుకు?’ అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిన సమయం వచ్చింది. చట్టపరమైన, వ్యవస్థాత్మక సంస్కరణలు తీసుకురావడం ద్వారా మాత్రమే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుంది. ప్రజాస్వామ్యాన్ని కేవలం ఎన్నికలవరకు పరిమితం కాకుండా, నిరంతర బాధ్యతగా నిలబెట్టాలంటే, ప్రజాప్రతినిధుల హాజరు, పనితీరుపై కఠిన నియంత్రణ తప్పనిసరి.
ప్రజల్లో అవగాహన పెరగాలి
ఈ సమస్యను దీర్ఘకాలికంగా పరిష్కరించాలంటే, చట్టపరమైన మార్పులతోపాటు ప్రజల్లో కూడా అవగాహన పెరగాలి. ప్రజాప్రతినిధుల పనితీరును కేవలం ఎన్నికల సమయంలో కాకుండా, పదవీకాలం మొత్తం పరిశీలించే సంస్కృతి ఏర్పడాలి. సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు ఈ విషయంలో కీలకపాత్ర పోషించగలవు.
ప్రతి ఎమ్మెల్యే లేదా ఎంపీ హాజరు, మాట్లాడిన విషయాలు, అడిగిన ప్రశ్నలు వంటి వివరాలు ప్రజలకు సులభంగా అందుబాటులో ఉంటే తాము ఎన్నుకున్న నాయకుల పనితీరును నిశితంగా గమనించగలుగుతారు. అదే సమయంలో, పౌర సమాజ సంస్థలు, మీడియా కూడా ఈ అంశాన్ని నిరంతరం ప్రస్తావించాలి. కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా, డేటా ఆధారంగా ప్రజాప్రతినిధుల పనితీరును విశ్లేషిస్తూ ప్రజలకు తెలియజేయాలి.
ఇది ప్రజల్లో బాధ్యతను పెంచడమే కాకుండా, నాయకులపై ఒత్తిడిని కూడా పెంచుతుంది. అంతిమంగా ప్రజలే అసలైన నిర్ణయాధికారులు అనే విషయం మరవకూడదు. తమ బాధ్యతలను నిర్వర్తించని నాయకులను తిరస్కరించే ధైర్యం ప్రజలు చూపితేనే మార్పు సాధ్యం. ప్రజాస్వామ్యాన్ని బలంగా నిలబెట్టగలిగే శక్తి చివరికి ప్రజల చేతుల్లోనే ఉంది. ప్రజాస్వామ్యం అంటే ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల పాలన. ఆ సూత్రాన్ని కాపాడాలంటే ప్రజాప్రతినిధులు తమ బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించాలి. లేకపోతే ప్రజాస్వామ్యం రూపకల్పనలో ఉన్న బలం క్రమంగా క్షీణిస్తుంది. హక్కుల కంటే బాధ్యతలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన సమయం వచ్చింది.
‘నో వర్క్..నో పే’ సిద్ధాంతం
ఇది కేవలం తెలంగాణకే పరిమితమైన సమస్య కాదు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే అంశం పునరావృతమవుతోంది. సీఎం చంద్రబాబు గతంలో అసెంబ్లీకిరాని ఎమ్మెల్యేలు జీతాలు తీసుకోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం, ఈ మధ్య జరిగిన అఖిల భారత శాసన సభాపతుల సదస్సులో ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రభుత్వ ఉద్యోగులవలెనే ఎమ్మెల్యేలకు కూడా ‘నో వర్క్ - నో పే’ సిద్ధాంతాన్ని వర్తింపజేయాలని బలంగా ప్రతిపాదించడం ఈ సమస్య ఎంత ప్రాధాన్యమైందో తెలుపుతోంది. ప్రజాప్రతినిధుల విషయంలో కూడా ఇదే సూత్రం అమలు కావాలనే డిమాండ్ బలపడుతోంది.
ప్రస్తుతం తెలంగాణలో ఎమ్మెల్యేల జీతభత్యాలు దేశంలోనే అత్యధికంగా ఉన్నాయనే విషయం తెలిసిందే. నెలకు రూ. 2.5 లక్షలకు పైగా వేతనం పొందుతున్న ప్రజాప్రతినిధులు, ఆ వేతనం వెనుక ఉన్న బాధ్యతను గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ జీతం ప్రభుత్వ ఖజానా నుంచి కాకుండా ప్రజల పన్నుల రూపంలో వస్తుంది. రైతు కష్టం, కార్మికుడి చెమట, మధ్యతరగతి వ్యక్తి ఆదాయంపై చెల్లించే పన్నుల రూపంలో వచ్చిన డబ్బే ఇది. అలాంటి ధనాన్ని స్వీకరిస్తూ తమ బాధ్యతలను నిర్వర్తించక పోవడం అంటే ప్రజల నమ్మకాన్ని దెబ్బతీయడమే.
మేకల క్రిష్ణ, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం
* ఓపెన్పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ఐడీ [email protected]
* రచయితలు ‘వెలుగు’కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
* రచన 700 పదాలకు మించరాదు.
