ఉద్యోగాల ప్రకటన సంతోషమే.. కానీ సర్కార్​ను నమ్మేదెలా?

ఉద్యోగాల ప్రకటన సంతోషమే.. కానీ సర్కార్​ను నమ్మేదెలా?

రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ఉన్నత స్థాయి విధానాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రకటిస్తారని యువతరం ఇన్నాళ్లూ ఎదురుచూసింది. కానీ ఎనభై వేల ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేసి ఆయన చేతులు దులిపేసుకున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌‌(టీఎస్పీఎస్సీ)లో పేరు నమోదు చేసుకున్న నిరుద్యోగుల సంఖ్యే సుమారు 25 లక్షలు. 80 వేల ఉద్యోగాలకే ప్రకటన చేస్తే మిగతా నిరుద్యోగుల సంగతేమిటి? తెలంగాణ యువత భవిష్యత్తు కోసం నిర్ధిష్టమైన ఉద్యోగ, ఉపాధి పాలసీని ప్రకటించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ఏ దేశానికైనా, రాష్ట్రానికైనా యువతే గొప్ప ఉత్పాదక శక్తి. అలాంటి యువతరాన్ని ఏడేండ్లుగా సీఎం కేసీఆర్​ నిర్లక్ష్యం చేయడం దుర్మార్గం. ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ఒక ఉత్తమమైన పాలసీని ప్రకటిస్తారని మేధావి వర్గాలు భావించాయి. తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలే కీలకాంశాలుగా ఉన్నాయి. ఉద్యమంలో ప్రాణాలు లెక్క చేయకుండా పోరాడిన యువతను ఇన్నేళ్లూ నిరాశకు గురి చేయడం విచారకరం.

నమ్మే పరిస్థితి కనిపిస్తలేదు
రాష్ట్రంలో 80,039 ఉద్యోగాలను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేయడం చాలా సంతోషకరమైన విషయం. 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌‌(పర్మినెంట్ చేయడం) మిగిలిన 80,039 కొత్త ఉద్యోగాలకు తక్షణమే నోటిఫికేషన్‌‌ ఇవ్వనున్నట్టు మొత్తం 91,142 ఉద్యోగాలను భర్తీ చేస్తామని అసెంబ్లీలో సీఎం ప్రకటన చేశారు. గ్రూప్‌‌-1, గ్రూప్‌‌-2, గ్రూప్‌‌-3, గ్రూప్‌‌-4 పోస్టులతోపాటు జిల్లాలు, జోనల్‌‌, మల్టీజోనల్‌‌, సెక్రటేరియెట్‌‌, హెచ్‌‌వోడీలు, వర్సిటీల్లోని పోస్టులను భర్తీ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌‌ చెప్పారు. కానీ సీఎం ప్రకటన రెండేండ్లుగా ఉద్యోగ నియామకాల విషయంలో సర్కారు చేస్తున్న గారడీలాగానే కనిపిస్తోంది. నిరుద్యోగ యువతకు సీఎం ప్రకటన సంతోషం కలిగిస్తున్నా.. దానిని నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. ఇందుకు కారణం ముఖ్యమంత్రి రాష్ట్రవ్యాప్తంగా చేపట్టే కార్యక్రమాల తీరే.

నిజాయతీ ఏది?
ఇప్పటికైనా కళ్లు తెరిచి నిరుద్యోగుల గోసను అర్థం చేసుకుని ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేయడం సంతోషమే. కానీ సీఎం ప్రకటనలో నిజాయితీ కనిపించడం లేదు. తక్షణమే నోటిఫికేషన్ అన్న ప్రకటన నిరుద్యోగులు నమ్మేలా లేదు. నిరుద్యోగుల గురించి ఏదో ఒకటి చెపితే అయిపోతుందనే ధోరణిలో సీఎం ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఒక ప్రణాళిక లేకుండా.. నివేదిక లేకుండా ప్రకటన చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రకటించిన 80,039 ఉద్యోగాలకు ఏ కేటగిరీల వారీగా నియామకాలను చేపట్టనుందో స్పష్టత ఇవ్వలేదు. ఒక నిర్దిష్ట ప్రణాళికను సర్కారు ప్రకటించపోవడం వల్ల నిరుద్యోగులు, ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేసేందుకు ఆస్కారం ఏర్పడింది. రాబోయే ఎన్నికల నేపథ్యంలో నిరుద్యోగులకు ఆశ చూపి ఓట్లు దండుకోవడం కోసం ఈ ప్రకటన చేసినట్టుగా సామాజిక ఉద్యమకారులు కూడా సందేహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు న్యాయం చేయాలనుకుంటే శాఖల వారీగా ఖాళీల ప్రకటన చేసినప్పుడే నియామక ప్రక్రియ కూడా ప్రకటిస్తే నిజమే అనే నమ్మకం కలిగి ఉండేది. ఇప్పటికైనా ఇబ్బంది ఏమీ లేదు. అసెంబ్లీ సమావేశాలకు ఇంకా సమయం ఉన్నందున ఆలోపు నియామకాల షెడ్యూల్‌‌ను ప్రకటిస్తే నమ్మశక్యంగా ఉంటుంది. 
మిగతా లక్ష ఉద్యోగాల సంగతేంటి?
బిశ్వాల్ కమిటీ నివేదిక మేరకు రాష్ట్రంలో వివిధ కేటగిరీల్లో దాదాపు లక్షా 91 వేల ఉద్యోగ ఖాళీలు ఉన్నట్టు అంచనా వేసింది. కానీ 80,039 ఉద్యోగాలను భర్తీ చేస్తామని,11,103 కాంట్రాక్టు ఉద్యోగాలను పర్మినెంట్ చేస్తామని ప్రకటన చేయడం ఏమిటి. మిగతా లక్ష ఉద్యోగాలు ఏమైనట్టు. టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన నిరుద్యోగ భృతిని ఇప్పటికైనా అమలు చేయాలి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌‌లో పేరు నమోదు చేసుకుని ఉన్న 25 లక్షల మంది నిరుద్యోగులకైనా నిరుద్యోగ భృతి ఇవ్వాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తొలగించిన విద్యా వలంటీర్లను, ఫీల్డ్ అసిస్టెంట్లను, 22 వేల స్కావెంజర్లను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలి. నిరుద్యోగ యువత ఇన్నాళ్లు ఆ కోచింగ్ ఈ కోచింగ్ అని తిరిగారు. ఇంట్లో అవ్వా అయ్యను డబ్బులు అడిగి కోచింగ్​ సెంటర్లకు వెళ్లారు. సీఎం మాటలైతే చెప్పారు కానీ నోటిఫికేషన్స్ వచ్చేదాకా యువత గుండెల్లో గుబులు మాత్రం పోయేలా లేదు. వచ్చే ఎలక్షన్స్ కోసమైనా ఉద్యోగాల నోటిఫికేషన్స్ ఇస్తారనేది కొందరి ఆశ. మరోసారి కోచింగ్​ కోసం డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఇచ్చిన మాట నిలుపుకుని నోటిఫికేషన్స్ ఇచ్చి నిరుద్యోగుల ఆశలు తీరుస్తుందని ఆశిద్దాం.

హామీలన్నింటికీ మంగళం పాడిన్రు..
గతంలో సీఎం ఇచ్చిన హామీలు, చేసిన ప్రకటనలు చూస్తే సందేహాలు వస్తున్నాయి. నిరుద్యోగ భృతి జాడలేదు. రెండోవిడత గొర్లు ఇవ్వలేదు. రుణ మాఫీ పూర్తిగా చేయలేదు. ఆరోగ్యశ్రీని అనారోగ్యం పాలుజేశారు. దళితులకు 3 ఎకరాలకు మంగళం పాడారు. డబుల్ బెడ్రూం ఇండ్లకు అతీగతీ లేదు. కులానికో ముచ్చట జెప్పి.. తలకో హామీ ఇచ్చారు. అవి అమలుకు ఆమడ దూరంలో ఉన్నాయి. ఎంబీసీ కార్పొరేషన్ మూలకు పడింది. బీసీ ఫెడరేషన్స్ నిధులు లేక అల్లాడుతున్నాయి. 37 లక్షల మంది బీసీ బిడ్డలు రుణం కోసం దరఖాస్తు చేసుకుని నాలుగేండ్లుగా ఎదురు చూస్తున్నారు. పనులన్నీ ఇలా ఉంటే యువతకు ఉద్యోగాలపై నమ్మకం కలిగేదెలా? ఉద్యోగాల ప్రకటన ముఖ్యమంత్రి ముందస్తు ఎలక్షన్ మంత్రమని, నిరుద్యోగ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నమని ప్రతిపక్షాల మాటలు నిజమని నమ్మే పరిస్థితి కనిపిస్తోంది.
- శ్రీనివాస్ తిపిరిశెట్టి, సోషల్‌‌ ఎనలిస్ట్​