మేల్ నర్సింగ్ ఆఫీసర్లకు ప్రమోషన్లు ఇవ్వాలి :  నర్సస్ జేఏసీ

మేల్ నర్సింగ్ ఆఫీసర్లకు ప్రమోషన్లు ఇవ్వాలి :  నర్సస్ జేఏసీ
  • ..ప్రభుత్వానికి తెలంగాణ నర్సస్ జాయింట్ యాక్షన్ కమిటీ విజ్ఞప్తి 

హైదరాబాద్, వెలుగు: మేల్ నర్సింగ్ ఆఫీసర్లకు ప్రమోషన్లలో సమాన అవకాశాలు కల్పించాలని తెలంగాణ నర్సస్ జేఏసీ ప్రభుత్వాన్ని కోరింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 16 ప్రకారం సమానత్వం, ఉపాధిలో సమాన అవకాశాలు అందించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆదివారం జేఏసీ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. 2005లో సమైక్య ఆంధ్రప్రదేశ్‌‌‌‌లో జీవో నంబర్ 82 ద్వారా మేల్ స్టూడెంట్లకు నర్సింగ్ కోర్సులలో ప్రవేశానికి అవకాశం కల్పించారని, 2006లో జీవో నంబర్ 320 ద్వారా నర్సింగ్ స్కూళ్లను కాలేజీలుగా అప్‌‌‌‌గ్రేడ్ చేసి, పురుషులకు అడ్మిషన్లు మంజూరు చేశారని తెలిపింది.

ప్రస్తుతం తెలంగాణలో 1,000 నుంచి 1,200 మంది మేల్ నర్సింగ్ ఆఫీసర్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలందిస్తున్నారని చెప్పింది. అయితే, జీవో నంబర్ 126 (1998), జీవో నంబర్ 466 (1998), జీవో నంబర్ 101 (1997)లోని నిబంధనలు స్టాఫ్ నర్స్, ప్రమోషన్ పోస్టులను మహిళలకు మాత్రమే పరిమితం చేయడంతో  మేల్ నర్సులకు అన్యాయం జరుగుతోందని జేఏసీ పేర్కొంది.