V6 News

ఓటెత్తిన పల్లె జనంతొలి విడత పంచాయతీల్లో భారీగా పోలింగ్

ఓటెత్తిన పల్లె జనంతొలి విడత పంచాయతీల్లో భారీగా పోలింగ్
  • గద్వాల జిల్లాలో 86.77 శాతం
  • నాగర్​కర్నూల్​లో 86.32..
  • వనపర్తిలో 84.91.. 
  • నారాయణపేటలో 84.58..
  • మహబూబ్​నగర్​ జిల్లాలో    83.04 శాతం నమోదు

 

మహబూబ్​నగర్/వనపర్తి/ గద్వాల/నాగర్ కర్నూల్, వెలుగు: ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో గురువారం తొలి విడత పంచాయతీల్లో భారీగా పోలింగ్​నమోదైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. సమస్యాత్మక కేంద్రాలతోపాటు అన్ని పోలింగ్​సెంటర్ల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఆఫీసర్లు ముందస్తు ఏర్పాట్లు చేయడంతో అనుకున్న సమయానికే పోలింగ్ పూర్తయింది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్​ప్రారంభం కాగా.. కొంత మందకొడిగా సాగింది. 9 గంటల తర్వాత పోలింగ్​శాతం పెరిగింది. ఓటర్లు పోలింగ్​సెంటర్ల వద్ద బారులుతీరారు.

మహబూబ్​నగర్, నారాయణపేట జిల్లాల్లో..

మహబూబ్​నగర్ జిల్లాలో తొలి విడత సర్పంచ్, వార్డు స్థానాలకు నిర్వహించిన పోలింగ్​లో 5 మండలాల ఓటర్లు 1,55,544  మంది కాగా.. 1,29,165 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. మండలాల వారీగా.. మహబూబ్​నగర్​రూరల్​లో  29,407 మంది, గండీడ్ మండలంలో 24,217 మంది, నవాబ్​పేట మండలంలో 33,544 మంది, రాజాపూర్ మండలంలో 18,824 మంది, మహమ్మదాబాద్​ మండలంలో 23,173 మంది ఓటు వేశారు. జిల్లాలో మొత్తం 83.04 శాతం పోలింగ్​నమోదైంది. నారాయణపేట జిల్లాలో తొలి విడత 4  మండలాల్లో 66,689 ఓటర్లు ఉండగా.. 56,403 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. మండలాల వారీగా.. గుండుమల్ మండలంలో 12,903 మంది, కోస్గిలో 14,570 మంది, కొత్తపల్లిలో 10,466 మంది, మద్దూరు మండలంలో 16,552 మంది ఓటు వేశారు. 84.58 శాతం పోలింగ్ నమోదైంది.

వనపర్తి జిల్లాలో..

జిల్లాలో తొలి విడత పంచాయతీ ఓటర్లు 1,21,528 మంది కాగా.. 1,03,225 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. 84.91 శాతం పోలింగ్​నమోదైంది. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి–శారద దంపతులు తన సొంతూరు పెద్దమందడి మండలంలోని మంగంపల్లిలో ఓటు వేశారు.  కలెక్టరేట్​లో ఏర్పాటుచేసిన కంట్రోల్​రూమ్​లో వెబ్​ కాస్టింగ్​ను కలెక్టర్​ఆదర్శ్​సురభి పరిశీలించారు. పలు సెంటర్లను ఎస్పీ సునీతారెడ్డి సందర్శించి పోలింగ్​సరళిని తెలుసుకున్నారు.  మొదటి విడత 5 మండలాల్లో పురుషులు 60,253, మహిళలు 61,275 మంది ఓటు వేశారు.  ఖిల్లాగణపురం మండలంలో  87.7,  పెద్దమందడిలో  85.7,  ఏదులలో  83.9,  రేవల్లిలో 83.0, గోపాల్​పేట మండలంలో 82.3 శాతం పోలింగ్​నమోదైంది.  

గద్వాల జిల్లాలో.. 

జోగులాంబ గద్వాల జిల్లాలోని 4 మండలాల్లో 86.77 శాతం పోలింగ్ నమోదైనట్లు కలెక్టర్  సంతోష్ తెలిపారు. ధరూర్ మండలంలో 85.89, గద్వాల మండలంలో 88.71, గట్టు మండలంలో 84.36 శాతం, కేటీ దొడ్డి మండలంలో 87.99 శాతం పోలింగ్ నమోదైనట్లు పేర్కొన్నారు. మొత్తం 57,476 మంది మహిళలు, 56,786 మంది పురుషులు, ఇతరులు ఒకరు ఓటు వేశారని చెప్పారు.

నాగర్​కర్నూల్ జిల్లాలో..

జిల్లాలోని కల్వకుర్తి, ఊర్కొండ, వెల్దండ, వంగూరు, తాడూరు, తెలకపల్లి మండలాల్లో 86.32 శాతం పోలింగ్​నమోదైంది. మొత్తం 1,81,543 ఓట్లకు గానూ 1,56,710 ఓట్లు పోలైనట్లు కలెక్టర్ సంతోష్​ తెలిపారు. వెల్డండ మండలం కుప్పగండ్లలో బ్యాలెట్​ పేపర్​లో వార్డు సభ్యుడికి గుర్తు కేటాయించకపోవడంతో అరగంటపాటు పోలింగ్​నిలిచిపోయింది. కల్వకుర్తి  మండలంలో 26,280, ఊర్కొండ  మండలంలో 14,751, వెల్దండ మండలంలో 23,919, వంగూరు మండలంలో 26,857, తాడూరు మండలంలో 25,947, తెలకపల్లి మండలంలో 33,956 మంది ఓటు వేశారు. జిల్లాలోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సమయం దాటిన తర్వాత క్యూలైన్ లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు.