- సిద్దిపేట జిల్లాలో 88.05 శాతం సంగారెడ్డి జిల్లాలో 87.96 శాతం
మెదక్, మెదక్ టౌన్, వెలుగు: జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 88.46 శాతం పోలింగ్ జరిగింది. అత్యధికంగా రేగోడ్ మడలంలో 91.13 శాతం పోలింగ్ జరిగింది. మిగతా అన్ని మండలాల్లోనూ 85 శాతానికిపైగానే పోలింగ్ జరిగింది. 6 మండలాల్లోని 146 పంచాయతీల్లో 146 సర్పంచ్ స్థానాలు, 1,284 వార్డ్ మెంబర్ స్థానాలకు పోలింగ్ జరిగింది. గురువారం ఉదయం ఏడు గంటలకే పోలింగ్ మొదలైంది.
చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో మొదటి గంటసేపు పోలింగ్ మందకొడిగా సాగింది. 8 గంటల నుంచి క్రమంగా ఊపందుకుంది. ప్రజలు ఉత్సాహంగా తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఒక్కో ఓటు ఎంతో కీలకం కావడంతో సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలకు పోటీచేసిన అభ్యర్థులు వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో ఉన్న వారిని ఆటోలు, కార్లలో పోలింగ్ కేంద్రాలకు తీసుకువచ్చి ఓటేయించారు. మండల పాపన్నపేట మండలంలో ఎల్లాపూర్, పాపన్నపేట, మిన్పూర్, నార్సింగి, మండల కేంద్రమైన టేక్మాల్, రేగోడ్, అల్లాదుర్గం, పెద్దశంకరంపేట, హవేలీ ఘననపూర్లో పోలింగ్ కేంద్రాల వద్ద కోలాహలంగా కనిపించింది. కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు.
సిద్దిపేట జిల్లాలో..
సిద్దిపేట: సిద్దిపేట డివిజన్ పరిధిలోని ఏడు మండలాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొదటి విడత జరిగిన ఏడు మండలాల్లో మొత్తం 88.05 శాతం పోలింగ్‌నమోదైంది. ఉదయం మొదటి రెండు గంటల్లో 24.46 శాతం, 11 గంటల వరకు 60. 06 శాతం, మధ్యాహ్నం వరకు 88.05 శాతం పోలింగ్ నమోదైంది.
గజ్వేల్ డివిజన్ పరిధిలోని గజ్వేల్, జగదేవ్‌పూర్, మర్కుక్, ములుగు, వర్గల్, సిద్దిపేట డివిజన్ పరిధిలోని దౌల్తాబాద్, రాయపోల్ మండలాల్లో మొత్తం 163 పంచాయతీలకు 16 పంచాయతీలు ఏకగ్రీవం కావడంతో 147 గ్రామాలకు ఎన్నికలు నిర్వహించారు. మొదటి విడత ఎన్నికల్లో మొత్తం1432 వార్డులకు 224 వార్డులు ఏకగ్రీవం కావడంతో 1208 వార్డులకు పోలింగ్‌నిర్వహించారు. డివిజన్‌పరిధిలో మొత్తం 1,83,955 ఓట్లకు 1,61,971 మంది ఓటు హక్కును వినియోగించుకోగా వీరిలో పురుషులు 80,413 మహిళలు 81, 557 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళలే 1144 మంది అధికంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ములుగు మండలం ఆర్ అండ్ ఆర్ కాలనీలోని బైలంపూర్ లో పోలీసులు గ్రామస్తులకు మధ్య స్వల్ప వివాదం ఏర్పడింది.
సంగారెడ్డి జిల్లాలో..
సంగారెడ్డి: జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 87.96 శాతం పోలింగ్ జరిగింది. చలి తీవ్రతను లెక్క చేయకుండా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. మొదటి విడతలో సంగారెడ్డి డివిజన్ లోని 7 మండలాల పరిధిలో 136 పంచాయతీలు, 1,246 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 7 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 129 పంచాయతీలు, 1,133 వార్డు స్థానాలకు జరగగా, సంగారెడ్డి మండలంలో 85.25 శాతం, కందిలో 85.05 శాతం, కొండాపూర్ లో 89.74 శాతం, సదాశివపేటలో 89.07 శాతం, పటాన్ చెరులో 84.21 శాతం, గుమ్మడిదలలో 89.49 శాతం, హత్నూర మండలంలో 90.06 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రావీణ్య పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఎన్నికల ప్రక్రియను పరిశీలించారు.

