రోడ్లు లేని పల్లెల లెక్క తీస్తున్నరు .. కనీస వసతులు లేని గ్రామాల వివరాలివ్వాలని సర్కార్‌‌ ఆదేశం

రోడ్లు లేని పల్లెల లెక్క తీస్తున్నరు .. కనీస వసతులు లేని గ్రామాల వివరాలివ్వాలని సర్కార్‌‌ ఆదేశం
  • గ్రామాల్లో సర్వే చేపడుతున్న పంచాయతీ రాజ్‌‌ శాఖ ఆఫీసర్లు
  • ప్రాధాన్యతాక్రమంలో పనులు పూర్తి చేసేలా ప్లాన్‌‌
  • నిధుల కోసం కేంద్ర, రాష్ట్ర, స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలని నిర్ణయం

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో కనీస మౌలిక వసతులు లేని గ్రామాలపై ప్రభుత్వం స్పెషల్‌‌ ఫోకస్‌‌ పెట్టింది. ఇందులో భాగంగా రోడ్లు, డ్రైనేజీలు, స్ట్రీట్‌‌లైట్స్‌‌, పంచాయతీ ఆఫీసులు, సొంత స్కూల్ బిల్డింగ్స్​లేని గ్రామాలు, తండాలు, గూడేలను గుర్తించి వాటి వివరాలను అందించాలని పంచాయతీరాజ్​శాఖను ఆదేశించింది. ఆ రిపోర్ట్‌‌ అందగానే ఆయా చోట్ల వసతులు కల్పించాలని నిర్ణయించింది. ఇందుకోసం కేంద్ర, రాష్ట్రం నుంచి వచ్చే ఫండ్స్‌‌ను వినియోగించడంతో పాటు కలిసి వచ్చే ఎన్‌‌జీవోస్‌‌ సహకారం తీసుకోవాలని భావిస్తోంది. 

గ్రామాల్లో సర్వే చేస్తున్న ఆఫీసర్లు 

ప్రభుత్వ నిర్ణయం మేరకు పంచాయతీరాజ్‌‌ శాఖ ఆఫీసర్లు మండలాల వారీగా గ్రామాల్లో సర్వే చేపడుతున్నారు. ప్రధానంగా రోడ్లు, డ్రైనేజీలు, స్ట్రీట్‌‌లైట్లు, పంచాయతీ, స్కూల్, అంగన్‌‌వాడీ, సబ్‌‌ సెంటర్లకు బిల్డింగ్‌‌లు ఉన్నాయా ? లేవా ? ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి, పెండింగ్‌‌ పనులు, అక్కడి ప్రజల జీవన విధానం, ఉపాధి అవకాశాలు వంటి వివరాలను ఆరా తీస్తున్నారు. గ్రామాల్లోని మౌలిక సదుపాయాలతో పాటు ప్రజల స్థితిగతుల ఆధారంగా గ్రామాలను వర్గీకరించి, డిజిటల్‌‌ మ్యాపింగ్ ద్వారా ఆన్‌‌లైన్‌‌ చేస్తున్నారు. 

సమగ్ర నివేదిక తయారు చేసి త్వరలోనే సర్కారుకు అందించనున్నారు. అలాగే ఆయా గ్రామాల్లో చేపట్టాల్సిన పనులకు ప్రణాళికలు సైతం రూపొందిస్తున్నారు. పల్లెల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో పాటు సీఎస్‌‌ఆర్‌‌ తదితర ఫండ్స్‌‌ను వినియోగించుకుంటూ వసతులు కల్పించాలని భావిస్తున్నారు. ఈజీఎస్‌‌, నాబార్డ్‌‌తో పాటు రూరల్‌‌ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ ఫండ్స్‌‌, పీఎంజీఎస్‌‌వై తదితర పథకాలు, రాష్ట్ర నిధులతో రోడ్లు, బ్రిడ్జిలు, డ్రైనేజీలు, పాఠశాల భవనాలు నిర్మించనున్నారు. 

మూడు భాగాలుగా విభజన

రాష్ట్రంలో 12,777 గ్రామపంచాయతీలు ఉన్నాయి. వీటిని వెనుకబడిన గ్రామాలు, అత్యంత వెనుకబడిన గ్రామాలు, అభివృద్ధి చెందిన గ్రామాలుగా విభజించి సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అత్యవసరంగా చేపట్టాల్సిన పనులను ముందుగా గుర్తించి వాటిని ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేసేలా ప్లాన్‌‌ చేస్తున్నారు. గ్రామాలకు సంబంధించిన అన్ని వివరాలను పంచాయతీ కార్యదర్శులకు మొబైల్ ‘పీఎస్‌‌ యాప్’ (పంచాయతీ సెక్రటరీ యాప్‌‌)లో అప్‌‌లోడ్‌‌ చేయనున్నారు. ఒక్క క్లిక్‌‌ చేయగానే గ్రామ ముఖచిత్రం ఆవిష్కృతమయ్యేలా యాప్‌‌ రూపొందించారు. గ్రామంలో ఎన్ని పనులు చేయాల్సి ఉంది ? ఇప్పటివరకు ఉన్న గ్రామాల స్వరూపాన్ని యాప్‌‌లో పొందుపర్చనున్నారు. కాగా, డిజిటల్‌‌ మ్యాపింగ్, నిధుల కేటాయింపు, గ్రామసభల ద్వారా సమస్యల గుర్తించి పనులు చేపట్టనున్నారు. 

పల్లెల్లో ఆదాయ వనరులపై దృష్టి

గ్రామాల్లో ఆదాయ వనరులపై పంచాయతీరాజ్ శాఖ దృష్టి పెట్టింది. ఇప్పటికే ఇంటి, వృత్తి పన్ను, ఆస్తుల బదిలీలో వాటా, భూమిశిస్తు, నల్లా బిల్లు, దుకాణాలకు సంబంధించి పన్ను రూపంలో ఆదాయం సమకూరుతుంది. అయితే కొన్ని గ్రామపంచాయతీల్లో పన్ను వసూలు కావడం లేదు. దీనిపై త్వరలోనే దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయి. గ్రామాలకు ఇతర ఆదాయ వనరులను సృష్టించడం కోసం అన్వేషిస్తున్నారు. చెత్తను కంపోస్ట్‌‌ ఎరువుగా తయారు చేసి ఆదాయం సమకూర్చునేలా ప్లాన్‌‌ చేస్తున్నారు. 

ఇందులో భాగంగా గ్రామాల్లో ప్లాస్టిక్‌‌ వేస్ట్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ (పీడబ్ల్యూఎం) యూనిట్లు నెలకొల్పేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం రూ.64 కోట్ల స్వచ్ఛ భారత్‌‌ మిషన్‌‌ నిధులను కేటాయిస్తున్నారు. ప్రభుత్వ భూములుంటే లీజుకు ఇవ్వడం, ప్రభుత్వ భవనాలు ఉంటే అద్దెకు ఇవ్వడం తదితర అంశాలపై దృష్టి సారిస్తున్నారు.  సోలార్‌‌ ప్లాంట్లకు లీజ్‌‌కు ఇవ్వడంతో పాటు మహిళా సంఘాలు ఏదైనా వ్యాపారం చేస్తే.. వారికి పంచాయతీ స్థలాలను లీజ్‌‌కు ఇచ్చే యోచనలో ఉన్నారు.  

గ్రామాల సమగ్రాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

 గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం. పల్లెలు, తండాలు, గూడేల్లో వసతులు కల్పించాలన్న సంకల్పంతో ముందుకెళ్తున్నాం. మూడేండ్లలో పల్లెల రూపురేఖలు మార్చాలని టార్గెట్‌‌ పెట్టుకున్నాం. పల్లెలకు అవసరమైన రోడ్లు, మురుగుకాల్వలు, కమ్యూనిటీ హాల్స్, యువతకు లైబ్రరీ, క్రీడా ప్రాంగణాలు, పాఠశాల భవనాలు నిర్మించడంతో పాటు ప్రాధాన్యతా క్రమంలో వసతులు కల్పించేందుకు కసరత్తు చేస్తున్నాం. రాష్ట్రంలోని అన్ని గ్రామాల ముఖచిత్రాన్ని రూపొందిస్తున్నాం.

సృజన, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల డైరెక్టర్