మహేష్ కుమార్ గౌడ్ 4 దశాబ్దాల రాజకీయ ప్రస్థానం

మహేష్ కుమార్ గౌడ్ 4 దశాబ్దాల రాజకీయ ప్రస్థానం

రాజకీయాల్లో నాయకత్వం అనేది వారసత్వంగా లభించేది కాదు. సమాజంపై  లోతైన  అవగాహన,  ప్రజల సమస్యల పట్ల స్పందించే తత్వం, నిరంతర  పోరాటాల అనుభవం కలిసొచ్చినప్పుడే ఒక నాయకుడు  రాజకీయాల్లో నిలదొక్కుకుంటాడు. ఉద్యమాల మధ్య నుంచి ఎదిగిన నాయకత్వమే ప్రజల విశ్వాసాన్ని సంపాదించి కాలపరీక్షను ఎదుర్కోగలదు.

విద్యార్థి రాజకీయాల దశ నుంచి ప్రారంభమై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నత స్థానానికి  ఎదిగిన  బొమ్మ మహేష్ కుమార్ గౌడ్  ప్రయాణం కూడా అలాంటి  సుదీర్ఘ  రాజకీయ యాత్రే.  నాలుగు దశాబ్దాలుగా పార్టీతో  అనుబంధాన్ని  కొనసాగిస్తూ,  ఉద్యమాలు,  సంస్థాగత బాధ్యతల మధ్య తనదైన గుర్తింపును  సంపాదించిన  ఆయన టీపీసీసీ  అధ్యక్షుడిగా రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తూ  మన్ననలు పొందుతున్నారు.

నిజామాబాద్ జిల్లా ఎన్ఎస్‌యూఐ  అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో అప్పటి టీడీపీ ప్రభుత్వ విద్యార్థి వ్యతిరేక విధానాలకు నిరసనగా పలు ఆందోళనలు నిర్వహించారు. 1989లో  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో  కాంగ్రెస్  ప్రభుత్వం  ఏర్పడేందుకు పార్టీ బలోపేతానికి  కృషి చేశారు.  అనంతరం 1994 నుంచి 2004 వరకు వివిధ ప్రజా సమస్యలపై  నిరంతరం ఉద్యమాల్లో పాల్గొన్నారు.  తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆయన చురుకైన పాత్ర పోషించారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం 2014 నుంచి 2023 వరకు వివిధ హోదాల్లో  బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై  నిరసనలు చేపడుతూ పార్టీ కార్యకర్తలతో కలిసి పోరాటాలను కొనసాగించారు.

రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు
విద్యార్థి నాయకుడిగా ఆయన చూపిన చురుకుదనం కారణంగా ఆయన అనతికాలంలోనే రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు. 1990 నుంచి 1998 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్​ఎస్‌యూఐ అధ్యక్షుడిగా పనిచేసి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలను సమన్వయం చేస్తూ యువనేతగా రాణించారు.  రాజకీయాలతోపాటు క్రీడల పట్ల కూడా మహేష్ కుమార్ గౌడ్ ఆసక్తి చూపించారు. కరాటేలో 7వ డాన్ బ్లాక్ బెల్ట్ సాధించడం ఆయన క్రమశిక్షణకు నిదర్శనం.  తెలంగాణ కరాటే  అసోసియేషన్ అధ్యక్షుడిగా యువతలో క్రమశిక్షణ,  ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే  కార్యక్రమాలను చేపట్టారు.  క్రీడల పట్ల మక్కువ  ఆయన వ్యక్తిత్వాన్ని  మరింత  సమతుల్యంగా తీర్చిదిద్దింది.

విద్యార్థి నాయకత్వం నుంచి ప్రధాన రాజకీయాల్లోకి  అడుగుపెట్టిన మహేష్ కుమార్ గౌడ్ ఎన్నికల రాజకీయాల్లో కూడా తనదైన ప్రయాణం సాగించారు. 1994లో  డిచ్‌పల్లి  అసెంబ్లీ  నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి ఎదురైనా  వెనుదిరగలేదు. 2014లో  నిజామాబాద్ అర్బన్‌లో కూడా  పోటీ చేసి పరాజయం పొందినా అధైర్యపడకుండా ప్రజల మధ్యనే ఉన్నారు. ఆయన ఓటమిలతో కుంగిపోకుండా ఎన్నికల్లో గెలుపోటములు సహజమే అని భావించి ప్రజల సంక్షేమం కోసం కృషి చేశారు. 2018, 2023 ఎన్నికల సందర్భాల్లో పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అందివచ్చిన టిక్కెట్ అవకాశాన్ని కూడా త్యాగం చేసి ఇతరులకు వదులుకోవడం ఆయన పార్టీ నిబద్ధతకు నిదర్శనం.

ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం 11 ఎకరాల భూవిరాళం
పార్టీ సంస్థాగత వ్యవస్థలో ఆయన పాత్ర ఎంతో కీలకం.  ఏపీ గిడ్డంగుల సంస్థ చైర్మన్‌గా సేవలందించిన అనంతరం పీసీసీ కార్యదర్శి, అధికార ప్రతినిధి, ప్రధాన కార్యదర్శి వంటి పలు బాధ్యతలను విజయవంతంగా నిర్వహించారు. 2021లో  టీపీసీసీ వర్కింగ్  ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టి పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేశారు.

2023లో ఎన్నికల కమిటీ సభ్యుడిగా పనిచేసి ఎన్నికల వ్యూహాలలో భాగమయ్యారు. 2024 జనవరిలో ఎమ్మెల్యే కోటా నుంచి ఎమ్మెల్సీగా  ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఆయన రాజకీయ ప్రయాణంలో కీలక ఘట్టం.  అదే  ఏడాది సెప్టెంబర్‌లో టీపీసీసీ అధ్యక్షుడిగా నియమితులై పార్టీ బాధ్యతలు చేపట్టారు. బీసీ వర్గానికి చెందిన నాయకుడిగా ఆయన ఎదుగుదల పార్టీ  సామాజిక సమతుల్యతకు ప్రతీకగా నిలిచింది.

గ్రామీణ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడం, యువతను రాజకీయాల్లోకి ఆకర్షించడం, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని పెంచడంవంటి లక్ష్యాలతో ఆయన ముందుకు సాగుతున్నారు.  రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా ప్రాంతీయ అభివృద్ధికి కట్టుబడి పనిచేసిన నాయకుడిగా కూడా మహేష్ కుమార్ గౌడ్  గుర్తింపు పొందారు. తన స్వగ్రామం రహత్‌నగర్‌లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి 11 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చి దాతృత్వాన్ని చాటుకున్నారు. నిజామాబాద్ ప్రాంతంలో మూడు దశాబ్దాలుగా ఉన్న ఇంజినీరింగ్ కళాశాల కలను సాకారం చేయడంలో ఆయన పాత్ర విశేషం. వ్యవసాయ కళాశాల ఏర్పాటు కోసం కూడా కృషి చేశారు. 

టీపీసీసీ అధ్యక్షుడిగా పార్టీ బలోపేతం
ధర్మపురి నుంచి బాసర వరకు ఆలయాలను కలుపుతూ టెంపుల్ కారిడార్ రోడ్డు నిర్మాణానికి రూ.380 కోట్ల నిధుల కేటాయింపులో ఆయన పాత్ర కీలకం. ధర్మపురి, కొండగట్టు, వేములవాడ, లింబాద్రిగుట్ట, బాసర వంటి పుణ్యక్షేత్రాలను కలుపుతూ సుమారు 150–200 కిలోమీటర్ల పొడవునా నిర్మాణం జరగనున్న ఈ ప్రాజెక్ట్ పర్యాటక, వాణిజ్య రంగాలకు కొత్త ఊతాన్ని అందించనుంది. 

నేటి రాజకీయాల్లో సోషల్ మీడియా ప్రభావం పెరిగినప్పటికీ, ప్రజల మధ్య పనిచేసే నాయకత్వానికి విలువ తగ్గలేదు. మహేష్ కుమార్ గౌడ్  ప్రస్థానం ఈ విషయాన్ని స్పష్టంగా చూపిస్తుంది. విద్యార్థి ఉద్యమాల నుంచి ప్రారంభమైన ఆయన ప్రయాణం, క్రమశిక్షణ, సహనం, పార్టీ పట్ల నిబద్ధతతో  రాష్ట్రస్థాయి నాయకత్వానికి చేరుకుంది.

ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆయన, పార్టీని మరింత  బలోపేతం చేసి భవిష్యత్ ఎన్నికలకు సిద్ధం చేయడంపై దృష్టి పెట్టారు. గ్రామ స్థాయి నుంచి యువత, బీసీ వర్గాల  భాగస్వామ్యాన్ని పెంచే  ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయాణం కేవలం వ్యక్తిగత విజయగాథ కాదు.  ప్రజల మధ్య నుంచి ఎదిగే నాయకత్వానికి మార్గదర్శకంగా నిలిచే రాజకీయ కథనం. స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన చారిత్రాత్మకమైన కాంగ్రెస్ పార్టీపై మహేశ్ కుమార్ గౌడ్‌కు ఎనలేని అభిమానం. కాంగ్రెస్ అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీ అభివృద్ధికి నిస్వార్థంగా కృషి చేసిన ఘనత మహేశ్‌కు దక్కింది.

నేటి యువతకు స్ఫూర్తి
వందేళ్లకు పైగా చరిత్ర గల కాంగ్రెస్‌లో సామాన్య కార్యకర్తగా ఉన్నా సరే చాలు అని సంతృప్తి చెందే మహేశ్ కుమార్ గౌడ్ కృషిని గుర్తించిన పార్టీ ఎంతో నమ్మకంతో అత్యున్నతమైన రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది.

పార్టీ ఎంతో నమ్మకంతో తనపై ఉంచిన బాధ్యతలను వమ్ము చేయకుండా మహేశ్ కుమార్ గౌడ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మార్గదర్శకంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసికట్టుగా సాగుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న తెలంగాణ అభివృద్ధి అందిస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో,  పంచాయతీ,  మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేశారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి క్రమశిక్షణతో పనిచేస్తే సాధారణ కార్యకర్త కూడా ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని మహేష్ కుమార్ గౌడ్ తన రాజకీయ ప్రయాణంతో నిరూపించారు.

బీసీ వర్గానికి చెందిన నాయకుడిగా ఆయన ఎదుగుదల, కష్టపడి పనిచేసేవారికి రాజకీయాల్లో అవకాశాలు ఎప్పుడూ ఉంటాయని నిరూపించింది. విద్యార్థి ఉద్యమాల నుంచి ప్రారంభమై రాష్ట్ర స్థాయి నాయకత్వం వరకూ సాగిన ఆయన ప్రస్థానం, ప్రజాస్వామ్యంలో క్రమశిక్షణతో కూడిన నాయకత్వం ఎలా రూపుదిద్దుకుంటుందో చెప్పే ఉదాహరణగా నిలిచింది. పోరాటం, నిబద్ధత, పార్టీ పట్ల అంకితభావం ఉంటేనే రాజకీయాల్లో నిలదొక్కుకోవచ్చని ఆయన ప్రయాణం నేటి యువతకు స్ఫూర్తినిస్తోంది.

ఈరవత్రి అనిల్, మాజీ ఎమ్మెల్యే, ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్

  • ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ఐడీ openpage@v6velugu.com
  • రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
  • రచన 700 పదాలకు మించరాదు.