
టీఆర్‌ఎస్ సర్కారు ఏర్పాటై ఐదు నెలలు.. హామీల అమలు ఎప్పుడంటున్న లబ్ధిదారులు
ఎన్నికల కోడ్ ముగిసింది.. ఇక పైసలొస్తయని ఆశ
రైతుబంధు కోసం 54 లక్షల మంది..
రుణమాఫీ కోసం 48 లక్షల మంది తండ్లాట
నిరుద్యోగ భృతి మీద 25 లక్షల మంది ఆశ
రైతుబంధుకు 12 వేల కోట్లు, రుణమాఫీకి 32 వేల కోట్లు కావాలె
నిరుద్యోగ భృతికి ఏటా 8,686 కోట్లు కావాలె
బడ్జెట్‌లో కొంతవరకు కేటాయింపులు
అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్ భారీ వరాలు ఇచ్చింది. నిరుద్యోగ భృతి, రుణమాఫీ వంటి హామీలు ప్రకటించింది. జనం భారీ మెజారిటీతో టీఆర్‌ఎస్ పట్టం కట్టారు. ప్రభుత్వం కొలువుదీరి ఐదు నెలలు కావస్తోంది. ఇంకా హామీలు అమల్లోకి రాలేదు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని, రుణమాఫీ, రైతుబంధు, పింఛన్ల పెంపు చేస్తారని, నిరుద్యోగ భృతి ప్రకటిస్తారని జనం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నాలుగు పథకాల నుంచి లబ్ధిపొందేవారు దాదాపు కోటి 65 లక్షల మంది ఉన్నారు. వరుస ఎలక్షన్లు, కోడ్ కారణంగా జాప్యమైందనుకున్నా.. కోడ్ ముగియడంతో హామీలు అమల్లోకి వస్తాయని వారంతా ఆశపడుతున్నారు.
రైతుబంధు త్వరగా ఇవ్వాలె
రాష్ట్రంలో రైతుబంధు లబ్ధిదారులు దాదాపు 54 లక్షల మంది ఉన్నారు. గత ఆర్థిక సంవత్సరం (2018–-19)లో రైతుబంధు పథకం ప్రారంభమైంది. ఏటా రెండు సార్లు ఎకరాకు నాలుగు వేల రూపాయల చొప్పున రెండు సీజన్లకు కలిపి ఎనిమిది వేల రూపాయలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అమల్లో కొన్ని సాధక బాధకాలు ఎదురైనా రైతులకు డబ్బులు అందజేసింది. గత ఖరీఫ్‌లో 51.50 లక్షల మంది రైతులకు రూ. 5,260.94 కోట్లను చెక్కుల రూపంలో పంపిణీ చేశారు. రబీలో 49.03 లక్షల మందికి రూ.5,244.26 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో వేశారు. మొత్తంగా రూ.10,505.20 కోట్లను రైతులకు అందజేశారు. ఇక 2018 డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతుబంధు మొత్తాన్ని మరో రెండు వేలు పెంచుతామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఖరీఫ్, రబీ సీజన్లలో రూ.5,000 చొప్పున ఎకరాకు రూ.10 వేలు ఇస్తామన్నారు.
బడ్జెట్‌లో కేటాయించినా..
తాజా అంచనాల ప్రకారం ఈసారి 54 లక్షల మందికి ‘రైతుబంధు’ అమలు చేయాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు. దీనికోసం ఈ ఏడాది 12,000 కోట్లు అవసరమని చెబుతున్నారు. ఖరీఫ్ మొదలవుతుండటంతో తొలివిడతగా రూ.6,000 కోట్లు కావాలని అంటున్నారు. ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో ఈ పథకానికి రూ.12,000 కోట్లు కేటాయించింది. అందువల్ల నిధుల సమస్య తలెత్తదని అధికారులు అంటున్నారు. అయితే రైతులకు ఎప్పుడు డబ్బులు అందజేయాలనే విషయంలో ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి సూచనలు రాలేదని చెబుతున్నారు. జూన్ రెండో వారంలో ఇచ్చే అవకాశాలున్నాయని మాత్రం అంచనా వేస్తున్నారు. జూన్ రెండో వారం నాటికి నైరుతి రుతుపవనాలు వచ్చి, వర్షాలు మొదలయ్యే అవకాశం ఉంది. దీంతో ఎంత త్వరగా సహాయం అందితే అంత మంచిదని రైతులు ఆత్రుత పడుతున్నారు. పంటలకు అనువుగా భూమిని సిద్ధం చేసుకోవడం, విత్తనాలు, ఎరువుల కొనుగోలు, ఇతర ఖర్చులకు డబ్బు అవసరమని, ప్రభుత్వం ‘రైతు బంధు’డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తుందా అని ఎదురుచూస్తున్నారు.
రుణమాఫీ మార్గదర్శకాలే రాలే..
అసెంబ్లీ ఎలక్షన్లలో ఇచ్చిన మరో కీలక హామీ రైతు రుణాల మాఫీ. రాష్ట్రంలోని బ్యాంకుల్లో 48.14 లక్షల మంది రైతులకు పంట రుణాలు ఉన్నాయి. మరో ఆరు లక్షల మంది బంగారం కుదవపెట్టి వ్యవసాయ రుణాలు తీసుకున్నారు. ఇందులో 19 లక్షల మంది రైతులకు రూ.50 వేల వరకు, 18 లక్షల మందికి రూ.50 వేల నుంచి లక్ష రూపాయల వరకు, 11.14 లక్షల మంది రూ.లక్ష కంటే ఎక్కువ మొత్తంలో రుణాలు ఉన్నాయి. 2014–18 మధ్య కాలంలో విడతల వారీగా రుణమాఫీ పొందిన లబ్ధిదారులు 35.29 లక్షల మంది. సీఎం కేసీఆర్ 2018 డిసెంబర్ 11వ తేదీ నాటికి రుణం తీసుకుని ఉన్న రైతులకు రూ. లక్ష వరకు మాఫీ చేస్తామని ప్రకటించారు. గతంలో విడతల వారీగా రుణ మాఫీ చేసినందున ఇప్పుడు కూడా అదే విధానాన్ని కొనసాగించనున్నట్టు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో రుణమాఫీ కోసం ఆరు వేల కోట్లు కేటాయించింది. అధికారుల అంచనా మేరకు రుణమాఫీ కోసం మొత్తం 32 వేల కోట్లు అవసరం. గతంలో రూ.16,124 కోట్ల రుణమాఫీ కోసం నాలుగేళ్లు పట్టింది. ఈసారి ఎంత సమయం తీసుకుంటారో, ఎప్పుడు అమలు చేస్తారోనని రైతులు ఎదురుచూస్తున్నారు.
విడతలతో తలనొప్పేనా?
గతంలో విడతల వారీ రుణమాఫీ కారణంగా రైతులకు ఇబ్బందులు తలెత్తాయి. బ్యాంకులు చాలా మందికి కొత్త రుణాలు ఇవ్వలేదు. దాంతో ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వచ్చింది. విడతలవారీ చెల్లింపుల వల్ల ఏ ఇబ్బందులూ లేకుండా చూస్తామని, వడ్డీని తామే భరిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించినా.. రైతులకు సమస్యలు తప్పలేదు. మరి ఈసారి పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని, బ్యాంకర్లకు తగిన సూచనలు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
భృతి కోసం నిరుద్యోగులు..
నీళ్లు, నిధులు, నియామకాలు ప్రధాన నినాదంగా సాగిన తెలంగాణ పోరాటంలో పాల్గొన్న అనేక మంది విద్యార్థులు, నిరుద్యోగులు కనీసం నిరుద్యోగ భృతి అయినా అందుతుందన్న ఆశలతో ఉన్నారు. ఎలక్షన్ల సమయంలో సీఎం కేసీఆర్ నెలకు రూ. 3,016 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక నిరుద్యోగుల లెక్కలు తీసి, అమలు చేస్తామని.. దానికి కొంత టైం పట్టొచ్చనీ చెప్పారు. అయితే అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అవుతున్నా నిరుద్యోగ భృతి దిశగా ప్రభుత్వం కార్యాచరణ ఏదీ ప్రకటించకపోవడంపై నిరాశతో ఉన్నారు. ఎలక్షన్ కోడ్ ముగియడంతో ప్రభుత్వం దీనిపై దృష్టి పెడుతుందని ఆశిస్తున్నారు.
అర్హత మార్గదర్శకాలేవీ?
నిరుద్యోగ భృతి కోసం విద్యార్హత, వయసు పరిమితి వంటి వాటిపై స్పష్టత లేదు. దీనిపై కసరత్తు చేయాల్సిందిగాసీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావును ప్రభుత్వం పురమాయించినట్టు సమాచారం. నిరుద్యోగ భృతి అమల్లో ఉన్న ఏపీ, చత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, హర్యానాల్లో ఎలాంటి పద్ధతి అనుసరిస్తున్నారు, పరిస్థితి ఎలా ఉందన్న దానిపై అధికారుల బృందం అధ్యయనం చేస్తున్నట్టు తెలిసింది. చత్తీస్‌గడ్, కేరళల్లో 18 నుంచి 35 ఏళ్ల వారికి రూ.వెయ్యి చొప్పున భృతి ఇస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో 20 నుంచి 35 ఏళ్ల వారికి, రాజస్తాన్‌లో 21 నుంచి 35 ఏళ్ల వారికి, మధ్యప్రదేశ్, ఏపీల్లో 22 నుంచి 35 ఏళ్ల వారికి ఇస్తున్నారు. ఏపీలో ‘యువ నేస్తం’పేరుతో 12 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. దానికి ప్రతి నెలా రూ.120 కోట్లు ఖర్చవుతోంది.
ఎంత మందికి లబ్ధి
నిరుద్యోగ భృతి కోసం సుమారు 25 లక్షల మంది ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్‌సైట్‌లో 24 లక్షల 57 మంది ఉద్యోగం కోసం వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకోని వారెవరైనా ఉంటే ఈ సంఖ్యకు అదనం అవుతారు. ఓటీఆర్ చేసుకున్నవారి లెక్క ప్రచారం చూసినా.. నిరుద్యోగ భృతి కోసం ప్రతి నెలా రూ.723 కోట్ల చొప్పున ఏటా సుమారు రూ. 8,686 కోట్లు అవసరం. ప్రభుత్వం బడ్జెట్‌లో ఈ పథకానికి రూ.1,810 కోట్లు కేటాయించింది. భృతి ఎవరికి ఇవ్వాలనే విధివిధానాలు ఖరారయ్యాక లబ్ధిదారుల సంఖ్య 10, 12 లక్షల వరకే ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.