నల్లమల సాగర్పై సుప్రీంకు? ఏపీని ఆపేలా రిట్ పిటిషన్ వేసే అంశంపై యోచన.. అధికారులతో మంత్రి ఉత్తమ్ కీలక రివ్యూ

నల్లమల సాగర్పై సుప్రీంకు? ఏపీని ఆపేలా రిట్ పిటిషన్ వేసే అంశంపై యోచన.. అధికారులతో మంత్రి ఉత్తమ్ కీలక రివ్యూ
  • పాలమూరు ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ క్లియరెన్సులు త్వరగా తేవాలి
  • తుమ్మిడిహెట్టి డీపీఆర్​ను వీలైనంత త్వరగా తేల్చండి
  • అధికారులతో మంత్రి ఉత్తమ్ కీలక రివ్యూ 

హైదరాబాద్, వెలుగు: 
ఏపీ అక్రమంగా చేపడుతున్న పోలవరం–నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్ట్​కు చెక్ పెట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. పోలవరం బనకచర్ల లింక్​లో మార్పులు చేసి నల్లమలసాగర్ వరకు తరలించాలని నిర్ణయించిన ఏపీ.. ఇటీవలే దాని డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు(డీపీఆర్)కు టెండర్లను పిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నల్లమలసాగర్ లింక్​ను అడ్డుకునేలా సుప్రీంకోర్టుకు వెళ్లాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలిసింది. 

సెంట్రల్​ వాటర్ కమిషన్(సీడబ్ల్యూసీ), నేషనల్ వాటర్ డెవలప్​మెంట్ ఏజెన్సీ(ఎన్​డబ్ల్యూడీఏ), పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ(పీపీఏ), కృష్ణా బోర్డు, గోదావరి బోర్డులు అభ్యంతరాలు తెలిపినా.. ఏపీ మొండిగా ముందుకెళ్తుండడాన్ని ప్రభుత్వం సీరియస్​గా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే అన్ని ఆధారాలతో సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేసే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి సూచించినట్లు తెలిసింది. శనివారం సెక్రటేరియెట్​లో ఇరిగేషన్ శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా పోలవరం నల్లమలసాగర్ లింక్​తో పాటు పలు అంశాలపై చర్చించారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్ట్​కు సీడబ్ల్యూసీ క్లియరెన్సులు త్వరగా వచ్చేలా కసరత్తులు చేయాలని మంత్రి ఆదేశించినట్టుగా తెలిసింది. అప్రైజల్ లిస్టు నుంచి ప్రాజెక్టును తప్పించిన నేపథ్యంలో.. మళ్లీ అప్రైజల్ లిస్టులో చేర్పించేలా కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని.. ఆ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రాధాన్య జాబితాలో పెట్టుకుందని, వీలైనంత త్వరగా అనుమతులు వచ్చేలా చూడాలని చెప్పినట్టు సమాచారం. దాంతోపాటు సమ్మక్కసాగర్​ ప్రాజెక్టుకూ సీడబ్ల్యూసీ క్లియరెన్సులు వచ్చేలా చూడాలని మంత్రి చెప్పినట్టుగా తెలుస్తున్నది. కాగా, ఈ నెల10న సీఎం రేవంత్ వద్ద డిపార్ట్​మెంట్​పై రివ్యూ ఉందని, అన్ని అంశాలనూ సవివరంగా సిద్ధం చేసి పెట్టుకోవాలని అధికారులను మంత్రి ఉత్తమ్ ఆదేశించినట్టు సమాచారం. 

తుమ్మిడిహెట్టి డీపీఆర్ ఎంతవరకొచ్చింది?

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి డీపీఆర్ పనులు ఎంత వరకొచ్చాయని అధికారులను మంత్రి ఉత్తమ్ ఆరా తీశారు. ఆర్వీ అసోసియేట్స్ ఒక్కటే టెండర్​ను దాఖలు చేసిందని అధికారులు వివరించినట్టు తెలిసింది. దీనిని కూడా ప్రాధాన్య జాబితాలో పెట్టుకుని త్వరగా తేల్చాలని అధికారులకు మంత్రి సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల రిపేర్లకు టెండర్లను త్వరగా ఖరారు చేయాలని ఆదేశించారు. 

టెక్నికల్​గా అర్హత ఉన్న సంస్థకే డిజైన్ల బాధ్యతను అప్పగించాలని, ఎన్​డీఎస్ఏ సిఫార్సులకు అనుగుణంగానే రిపేర్లు చేసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సీతమ్మసాగర్​తో పాటు పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులపై దృష్టి సారించాలని, ఫైన్ కట్టి అనుమతులు తీసుకోవచ్చని ఇటీవలే సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. డిపార్ట్​మెంట్​కు అత్యంత కీలకమైన ఇంటర్ స్టేట్ వాటర్ రీసోర్సెస్(ఐఎస్​డబ్ల్యూఆర్), సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్(సీడీవో)ను పటిష్టం చేయాలని, ఆయా వింగ్స్​లలో టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వారినే నియమించాలని సూచించినట్టు తెలిసింది.