స్వగృహ అపార్ట్​మెంట్లకు గిరాకీ లేదు!

స్వగృహ అపార్ట్​మెంట్లకు గిరాకీ లేదు!
  • రేట్లు తగ్గించి అమ్మాలని సర్కారు యోచన
  • క్లస్టర్ల వారీగా కొనుగోలుకు ముందుకురాని బిడ్డర్లు
  • గుత్తగా కాకుండా ఫ్లాట్ల వారీగా సేల్
  • ప్రభుత్వ ఉద్యోగులకు ఫస్ట్ ప్రయారిటీ

హైదరాబాద్, వెలుగు: రాజీవ్​ స్వగృహ అపార్ట్​మెంట్ల అమ్మకంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. అపార్ట్​మెంట్లను క్లస్టర్లవారీగా కొనుగోలు చేయడానికి బిడ్డర్లు ముందుకు రాని కారణంగా ఫ్లాట్లవారీగా సేల్​ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఫ్లాట్ల రేట్లు తగ్గించి అమ్మాలని, ఉద్యోగులకు ఫస్ట్​ ప్రయారిటీ ఇవ్వాలని యోచిస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన రేట్లు, బహిరంగ మార్కెట్​లో ఉన్న అపార్ట్ మెంట్ల రేట్లకు దగ్గరగా ఉన్నాయి. దీంతో క్లస్టర్ల వారీగా వేలం నిర్ణయం బెడిసికొట్టింది. దీంతో రేట్లు తగ్గించి, ఫ్లాట్ల వారీగా వేలం నిర్వహించాలని నిర్ణయించినట్లు అధికారులు చెబుతున్నారు.

వేలం పాట వాయిదా

హైదరాబాద్​ బండ్లగూడలోని 2,246, ఖమ్మం దానవాయిగూడెంలోని 576 రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు ఈనెల 24న ఎంఎస్టీసీ వేలం నిర్వహించింది. ఒక్కో చదరపు అడుగుకు రూ.2,800 రేటు ఖరారు చేశారు. ఫ్లాట్ల వారీగా కాకుండా క్లస్టర్ల వారీగా వేలం నిర్వహించారు. ఒక్కో క్లస్టర్ లో 70 నుంచి 90 ఫ్లాట్లు ఉన్నాయి. అయితే ఒక్క కంపెనీ కూడా వేలంలో పాల్గొనలేదు. రాజీవ్ స్వగృహ అపార్ట్ మెంట్లు 10 ఏండ్ల కింద నిర్మించినవి కావటం, ఒక్కో ఫ్లాట్​ రిపేర్లకు మరో రూ.10 లక్షల వరకు ఖర్చుచేయాల్సి ఉన్నందున ఎవరూ ముందుకు రావడం లేదు. వీటి అమ్మకం ద్వారా ప్రభుత్వానికి రూ.800 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు భావించారు. బండ్లగూడలోని సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్​ 567 చదరపు అడుగులు రూ.16 లక్షలు, డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ 1,400 చదరపు అడుగులు రూ.38 లక్షలు, ట్రిపుల్ బెడ్ రూమ్ 1,600 చదరపు అడుగులు 43 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఇక దానవాయిగూడెం వద్ద 1,560 చదరపు అడుగుల ఫ్లాట్​లో ఒక్కో చదరపు అడుగుకు రూ.2,000, 1,200 చదరపు అడుగుల ఫ్లాట్ లో ఒక్కో చదరపు అడుగుకు రూ.1,500 వరకు ఖరారు చేశారు. ఒక్కో ఫ్లాట్ విలువ రూ.30 లక్షల పైనే ఉంది. రిపేర్లకు మరో రూ.10 లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఖమ్మం సిటీలో రూ.35 లక్షలు, రూ.40 లక్షలకు కొత్త అపార్ట్ మెంట్లు దొరుకుతున్నాయి. దీంతో బిడ్డర్లు ముందుకు రావడంలేదు.

రెండుమూడు రోజుల్లో గైడ్‌లైన్స్‌ ఇచ్చే చాన్స్‌

రేట్లు తగ్గించి, ఒక్కో ఫ్లాట్ ను వేలం వేయాలని, ఇందులో ప్రభుత్వ ఉద్యోగులకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. శనివారం ఈ ఫ్లాట్లను సీఎస్ సోమేశ్ కుమార్, హౌసింగ్, మున్సిపల్ స్పెషల్ సీఎస్ లు సునీల్ శర్మ, అరవింద్ కుమార్ పరిశీలించారు. ఆ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు వేలంలో ప్రాధాన్యత ఇస్తామని సీఎస్ ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లాట్ల అమ్మకంపై రెండు, మూడు రోజుల్లో గైడ్ లైన్స్  ఖరారు కానున్నాయి. మూడు రోజుల పాటు మున్సిపల్ ఉద్యోగులకు రాజీవ్​ స్వగృహ అపార్ట్​మెంట్ల రేట్లు, సదుపాయాలపై అవగాహన కల్పించారు. ఈ నెల 30న మున్సిపల్ ఉద్యోగులను తీసుకెళ్లి అపార్ట్ మెంట్లను చూపిస్తామని అధికారులు చెబుతున్నారు.