
- రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు
సూర్యాపేట, వెలుగు : నిరుద్యోగులు సంఘటితమై శాంతియుత పోరాటం ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని బీసీ ఇంటలెక్చువల్స్ఫోరం వ్యవస్థాపకుడు, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు, తెలంగాణ క్రాంతి దళ్ వ్యవస్థాపకుడు, తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్, అశోక అకాడమీ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు పాలకూరి అశోక్ సూచించారు. 2 లక్షల ఉద్యోగాల సాధన కోసం అనుములపురి జనార్దన్ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని పద్మశాలి భవన్ లో నిరుద్యోగ విద్యార్థి మహాసభ నిర్వహించారు. ఈ సభకు వారు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణలో రోజురోజుకూ నిరుద్యోగ సమస్య పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగులను తక్షణమే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
సూర్యాపేట ప్రాంతం ఎంతో చైతన్యవంతమైందని, గతంలో తెలంగాణ మహాసభ ఇక్కడి నుంచే ప్రారంభమైందని చెప్పారు. బండి యాదగిరి లాంటి వాళ్లు ఈ ప్రాంతం వారేనని గుర్తుచేశారు. నిరుద్యోగ విద్యార్థి మహాసభ ఇక్కడి నుంచే నాంది పలకడం శుభపరిణామమన్నారు. నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే రిటైర్మెంట్ కాలపరిమితిని 61 నుంచి 57 ఏండ్లకు తగ్గించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లేక విలవిలాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోపే అన్ని ఖాళీలను భర్తీ చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు.