
వయసు చూస్తే పదిహేనేండ్లు. కానీ.. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది అభిమానులను సంపాదించింది. నడక నేర్చే వయసులోనే నాట్యం చేయడం మొదలుపెట్టింది హర్నీధ్ కౌర్ సోధి. ఆమె డ్యాన్స్ చేస్తే నెమలి నాట్యం చేసినట్టే అనిపిస్తుంది. అందుకే సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసే వీడియోలకు లక్షల వ్యూస్, లైక్స్ వస్తుంటాయి. ఒక వైపు స్కూలుకు వెళ్లి చదువుకుంటూనే మరోవైపు కంటెంట్ క్రియేటర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా రాణిస్తున్న హర్నీధ్ గురించి మరిన్ని విశేషాలు..
హర్నీధ్ కౌర్ సోధి 2010లో పంజాబ్‌లోని లూధియానాలో పుట్టింది. కానీ.. ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటుంది. ఎందుకంటే.. తన చిన్నప్పుడే పేరెంట్స్ దుబాయ్‌కి షిఫ్ట్ అయ్యారు. అయినా హర్నీధ్ పంజాబీ, హిందీ అనర్గళంగా మాట్లాడుతుంది. ఆమెకు చిన్నప్పటినుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. రెండేండ్ల వయసులోనే అడుగులతోపాటు డ్యాన్స్ స్టెప్పులు కూడా వేసింది. ఆమెకి డ్యాన్స్ మీద ఉన్న ఇంట్రస్ట్‌ని గమనించిన పేరెంట్స్ ప్రత్యేకంగా డ్యాన్స్ మాస్టర్ దగ్గర శిక్షణ ఇప్పించారు. చిన్నప్పటినుంచే కమ్యూనిటీ ఈవెంట్లు, స్కూల్ ప్రోగ్రామ్స్‌లో డ్యాన్స్ చేసి అందర్నీ ఆకట్టుకునేది. ప్రస్తుతం ఆమె దుబాయ్‌లోని జేఎస్‌ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుకుంటోంది.
నాటు నాటుతో...
హర్నీధ్ సిగ్నేచర్.. ఫాస్ట్ ఫుట్‌వర్క్ స్టైల్ వల్ల ఆమె వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. లైట్ల డ్రెస్సులు వేసుకున్న వ్యక్తులతో కలిసి చేసిన వీడియోలతో ఆమెకు బాగా గుర్తింపు వచ్చింది. తర్వాత ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని ‘‘నాటు నాటు”పాటకు ఆమె చేసిన డ్యాన్స్ అందర్నీ ఆకట్టుకుంది. ఆ వీడియోకు ఏకంగా 77 మిలియన్ల వ్యూస్ రావడంతో పాటు తెలుగువాళ్లకు దగ్గరైంది. హర్నీధ్ ఇంత బాగా డ్యాన్స్ చేయడానికి కారణం.. నిరంతర శ్రమ. ఆమె ప్రతిరోజూ ఉదయం 5:45 గంటలకు నిద్ర లేచి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటుంది. అంతేకాదు రోజుకు రెండుసార్లు ధ్యానం కూడా చేస్తుంది. ఇండియా నుంచి దుబాయ్ విజిటింగ్‌కు వెళ్లిన ఇన్‌ఫ్లుయెన్సర్స్ చాలామంది ఆమెతో కలిసి వీడియోలు చేశారు.
ఎన్నో అవార్డులు
చిన్న వయసులోనే ఇంత పెద్ద విజయం సాధించినందుకు హర్నీధ్‌కు ఎన్నో అవార్డులు కూడా దక్కాయి. దుబాయ్‌లోని యంగెస్ట్ సోషల్ మీడియా ఇన్‌ప్లుయెన్సర్ల లిస్ట్‌లో స్థానం దక్కించుకుంది. అలాగే ‘బెస్ట్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ (జూనియర్)’ కేటగిరిలో ‘గల్ఫ్ ఎఛీవర్స్ అవార్డ్’ అందుకుంది. ఫిల్మ్‌ఫేర్ మిడిల్ ఈస్ట్ అవార్డ్స్‌కు కూడా నామినేట్ అయ్యింది. ఆమె అరబిక్ సినిమా ‘‘ఘనూమ్ ది బిలియనీర్’’లో కూడా కనిపించింది.
లక్షల్లో సంపాదన
బీట్స్ విత్ హర్నీధ్ చానెల్‌ని ఇప్పటివరకు 5.54 మిలియన్ల మంది సబ్‌స్క్రయిబ్ చేసుకున్నారు. చానెల్‌లో 687 వీడియోలు అప్‌లోడ్ చేశారు. వాటిలో పది మిలియన్ల వ్యూస్ దాటిన వీడియోలు బోలెడు ఉన్నాయి. ముఖ్యంగా తన ఫ్యామిలీతో కలిసి చేసిన కామెడీ వీడియోలు కూడా బాగా పాపులర్ అయ్యాయి. వాటిలో ఒక వీడియోకు 87 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. హర్నీధ్ యూట్యూబ్ యాడ్‌సెన్స్ ద్వారా లక్షల్లో సంపాదిస్తోంది. దాంతోపాటు బ్రాండ్ ప్రమోషన్స్, ఇన్‌స్టాగ్రామ్ ప్రమోషన్స్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ నుంచి ఆమెకు ఆదాయం వస్తోంది.
సోషల్ మీడియాలోకి ఇలా..
హర్నీధ్ పేరెంట్స్ ఆమె టాలెంట్‌ని ప్రపంచానికి తెలిసేలా చేయాలి అనుకున్నారు. అందుకే డ్యాన్స్ చేసే వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. అలా 2018లో టిక్‌టాక్ ద్వారా సోషల్ మీడియా ప్రస్థానాన్ని ప్రారంభించింది. మొదట్లో డ్యాన్స్‌తోపాటు లిప్-సింక్ వీడియోలు కూడా చేసేది. అలా చాలా తక్కువ టైంలోనే ఆరు లక్షల మంది అభిమానులను సంపాదించుకుంది. ఆతర్వాత ఇండియాలో టిక్‌టాక్‌ని బ్యాన్ చేయడంతో అప్పటినుంచి ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌ల్లో వీడియోలు చేసింది. 2021నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్ పోస్ట్ చేస్తోంది. అందులో పోస్ట్ చేసిన మొదటి డ్యాన్స్ వీడియో చాలా వైరల్ అయ్యింది. ఆ తర్వాత 2022 మార్చిలో ‘‘బీట్స్ విత్ హర్నీధ్”పేరుతో యూట్యూబ్ చానెల్ పెట్టింది. అందులో కూడా తక్కువ టైంలోనే పాపులర్ అయ్యింది. ఆమె డ్యాన్స్‌కి ఇండియా, దుబాయ్ మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. హర్నీధ్ కొన్నాళ్ల నుంచి వ్లాగ్స్, కామెడీ వీడియోలు కూడా చేస్తోంది. ఆమెకు ఒక అన్న, చెల్లి ఉన్నారు. వాళ్లు కూడా రెగ్యులర్‌గా వీడియోల్లో కనిపిస్తుంటారు.
►ALSO READ | ఈ సండే స్పెషల్: ఫిష్తో వెరైటీ వంటకాలు..ఒక్కసారి ట్రై చేయండి