వెలుగు ఓపెన్ పేజీ.. రోడ్డు భద్రతపై.. అవగాహన పెరిగేదెలా?

వెలుగు ఓపెన్ పేజీ.. రోడ్డు భద్రతపై.. అవగాహన పెరిగేదెలా?

భారతదేశంలో ప్రతిరోజూ సగటున 485 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతుండగా, 1,268 మంది గాయపడుతున్నారు. దేశ సామాజిక, ఆర్థిక,  న్యాయవ్యవస్థలకు ఇది పెద్ద సవాలు. ఈ నేపథ్యంలో డీజీపీ  బి.శివధర్ రెడ్డి చొరవతో  తెలంగాణ  పోలీసుశాఖ చేపట్టిన 'అరైవ్ అలైవ్' ఉద్యమం అత్యంత కీలకం. 

 ప్రపంచ వాహన జనాభాలో 1% మాత్రమే ఉన్నప్పటికీ, రోడ్డు ప్రమాద మరణాలలో 11% భారతదేశంలోనే సంభవిస్తున్నాయి. ‘గోల్డెన్ అవర్’ (మొదటి 60 నిమిషాలు)లో  సరైన చికిత్స అందితే ఈ మరణాలు 50%  తగ్గుతాయని లా కమిషన్​ పేర్కొంది. అంబులెన్స్ రావడానికి ఎంతో కొంత సమయం (సగటున 8-35 నిమిషాలు) పడుతోంది.  

పరిశోధనల ప్రకారం  85- 97% ప్రమాదాల్లో  సాధారణ ప్రజలు ప్రమాద స్థలానికి మొదట చేరుకుంటారు.  కానీ 11%  మాత్రమే ప్రథమ చికిత్స అందిస్తారు.  68%  చూస్తూ నిలబడతారు.  

కొం తకాలం క్రితం  విజయనగరంలో రోడ్డు  ప్రమాదంలో  రక్తపు మడుగులో పడి ఉన్న కొడుకును  బతికించుకోవాలని ఒకతల్లి రోడ్డుపై వెళ్లేవారిని  వేడుకున్నా ఒక్కరూ సాయం చేయలేదు. ఆ తల్లి కళ్లముందే ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇటువంటి  సంఘటనలు జరిగినప్పుడు  సమాజంలో  బాధ్యతారాహిత్యం  పెరిగిపోయిందనే  నిస్పృహ  వ్యక్తమవుతుంటుంది. అదృష్టవశాత్తు అది పూర్తిగా నిజం కాదు.

 ప్రమాద స్థలంలో ఉన్న వ్యక్తులు స్పందించకపోవడానికి గల అవరోధాలు మూడు.. 

1. మానసిక కారణాలు. 2. చట్టపరమైన అపోహలు. 3. ప్రాథమిక చికిత్స పట్ల అవగాహన లేమి.

మానసిక కారణాలు 

క్లిష్టమైన మానసిక అవరోధం - సమూహ  ప్రభావం (బైస్టాండర్ ఎఫెక్ట్).  ప్రమాదస్థలంలో ఎక్కువ మంది ఉన్నప్పుడు - ‘ఎవరో ఒకరు సహాయం చేస్తారు’.  ‘నా కంటే బాగా తెలిసినవారు ఎవరో ఉంటారు’ అనే భావన ప్రతి ఒక్కరిలోనూ  కలుగుతుంది.  దీనివల్ల గుంపులో ఉన్న  ఏ ఒక్కరూ ముందుకురారు.  అందరూ బాధ్యతను ఇతరులపైకి  నెట్టేయడం వల్ల చివరికి బాధితులకు ఎవరూ సహాయం చేయని పరిస్థితి  ఏర్పడుతున్నది.  అయితే,  ఇందుకు  భిన్నంగా  ఓ  సంఘటన జరిగింది.   

క్రికెటర్‌  రిషబ్‌ పంత్‌ ఉత్తరాఖండ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు.  రాత్రివేళ  ఆ దారిన  వెళ్తున్న ఇద్దరు బాటసారులు  రజత్ కుమార్,  నిషు కుమార్ మాత్రమే ఉన్నప్పటికీ  వారు  కారు  తగలబడేలోపే  అద్దాలు పగలగొట్టి  రిషబ్‌ను  బయటకు తీయడమే గాక, త్వరగా ఆస్పత్రికి  చేర్చారు.  

అంటే,  చుట్టూ  చాలామంది ఉన్నప్పటి కన్నా - ఒకరిద్దరు  ఉన్నప్పుడే సాయం చేసే అవకాశాలు  పెరుగుతాయి.   మరోపక్క  ప్రమాద స్థలంలో ఒత్తిడితో కూడా కొందరు నిశ్చేష్టులవుతారు. తగిన శిక్షణతో  అవగాహన కలిగిస్తే యువతకు ముందడుగు వేసే  ధైర్యం వస్తుంది.

చట్టపరమైన అపోహలు 

రెండో సమస్య .. సహాయం చేస్తే  పోలీసు కేసులతో - కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందేమో అనే అపోహలు.  కేంద్ర మోటారు వాహనాల (12వ సవరణ) నిబంధనలు, 2020  ప్రకారం  ప్రమాద బాధితులను ఆస్పత్రికి చేర్చినవారిని, ప్రమాదం  గురించి  పోలీసులకు  సమాచారం ఇచ్చినవారిని  ‘ఆపద్బాంధవులు’(గుడ్ సమరిటన్)గా పిలుస్తారు.  

వీరు  ప్రమాద బాధితులను ఆస్పత్రికి చేర్చిన వెంటనే వెళ్ళిపోవచ్చు.  తన పేరు, చరవాణి సంఖ్య,  చిరునామా, ఇతర వ్యక్తిగత  వివరాలేమీ  చెప్పవలసిన అవసరం లేదు.  సాక్షిగా  ఉండటం సమ్మతమైతేనే  తన వ్యక్తిగత  వివరాలు  వెల్లడి చేయవచ్చు.  తాము  సాయం  చేసినట్లు  ఆస్పత్రి నుంచి ధృవీకరణ లేఖ కూడా పొందవచ్చు. 

వీరికి ‘రాహ్ వీర్’ పథకం కింద  నగదు బహుమతి,  ప్రశంసాపత్రం కూడా ఇస్తారు.  ఆస్పత్రి  ప్రవేశ ద్వారం వద్ద ఈ నిబంధనలు ప్రదర్శించాలి.   కర్నాటక రాష్ట్రం దేశంలోనే  మొదటిసారిగా  ‘ది కర్నాటక గుడ్ సమరిటన్ అండ్ మెడికల్ ప్రొఫెషనల్ చట్టం, 2016’ను  తీసుకొచ్చింది.  

ఆసుపత్రులు  బాధితులకు తక్షణ చికిత్స నిరాకరించకూడదని, సహాయం చేసినవారికి అయ్యే  ఖర్చులను  తిరిగి  చెల్లించడానికి ‘గుడ్  సమరిటన్ ఫండ్’ ఏర్పాటు  చేయాలని ఈ చట్టం నిర్దేశిస్తోంది.   తెలంగాణలో  కూడా ఇలాంటి  రాష్ట్రస్థాయి  ప్రత్యేక చట్టం వస్తే  ప్రజల్లో  మరింత  భరోసా కలుగుతుంది.   

శ్వాస  రాకపోతే, స్పృహ లేకపోతే.. చేయాల్సిన ప్రక్రియలు 

శ్వాసకు అడ్డంకి కలిగి  గొంతు నుంచి  గురక శబ్దం వస్తుంటే, ఛాతీ కదులుతున్నా- శ్వాస రాకపోతే..  ఒక చేతిని బాధితుడి నుదిటిపై పెట్టి,  రెండో చేతి వేళ్లతో  గడ్డాన్ని పట్టుకుని తలను మెల్లగా  వెనక్కి వంచండి. ఇది శ్వాస మార్గాన్ని తెరుస్తుంది.  నోటిలో మట్టి, రక్తం కనిపిస్తే  వేలితో తీయండి.  

శ్వాస ఆడుతున్నా  స్పృహలో  లేకపోతే  వారిని వెల్లకిలా ఉంచకుండా  మెల్లగా  పక్కకు  తిప్పండి (రికవరీ పొజిషన్).   పై చేతిని తల కింద ఆసరాగా పెట్టి, పై కాలును మోకాలి దగ్గర వంచండి.  తలను కాస్త వెనక్కి వంచండి (వాంతులు బయటకు పోవడానికి).   వెన్నెముక  గాయాలపై అనుమానం ఉంటే (ముఖ్యంగా  బైక్ ప్రమాదాల్లో - కాళ్లు,  చేతులు కదలకపోయినా,  మెడలో నొప్పి ఉన్నా) ఆ వ్యక్తిని  కదిలించవద్దు.  మెడను, తలను నిటారుగా ఉంచండి. తప్పుగా కదిలిస్తే పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది.  

‘112 ఇండియా’  యాప్​లో వాలంటీర్,  షౌట్

సీపీఆర్ (గుండె ఆగిపోయినప్పుడు)  బాధితులు అస్సలు కదలక, ఊపిరి ఆడకపోయినా, అసాధారణ ఊపిరి ఉన్నా.. పెద్దలకు ఛాతీ మధ్యలో  రెండు చేతులు పెట్టి,  వేగంగా, బలంగా కిందకు  (నిమిషానికి 100-–-120 సార్లు)  నొక్కాలి. ‘112 ఇండియా’  యాప్​లో   ‘వాలంటీర్’,  ‘షౌట్’ అనే  ఆప్షన్లు  ఉన్నాయి.  

పౌరులు  ఎవరైనా ‘వాలంటీర్’గా  నమోదు చేసుకోవచ్చు.  ఆపదలో ఉన్నవారు 'షౌట్' బటన్  నొక్కినవెంటనే  వారి లొకేషన్‌తో  కూడిన  ఎస్ఓఎస్  సందేశం  కంట్రోల్ రూమ్‌తోపాటు,  దగ్గరలో ఉన్న వాలంటీర్లకు వెళుతుంది.  అంబులెన్సు,  పోలీసులు  వచ్చేలోపు ఈ '112 ఇండియా  వాలంటీర్' వ్యవస్థ  తక్షణ  సహాయానికి  వీలు  కల్పిస్తుంది.  

రాజ్యాంగంలోని  అధికరణ 51A ప్రకారం  తోటివారి పట్ల దయ కలిగి ఉండటం, హింసను  త్యజించడం పౌరుల ప్రాథమిక విధి.  ప్రమాద బాధితులను  రక్షించడం కూడా ఈ విధిలో భాగం అని గుర్తుంచుకోవాలి.   

ప్రాథమిక చికిత్స పట్ల అవగాహన లేమి 

- ప్రతి ఒక్కరూ ప్రథమ చికిత్స నేర్చుకునేలా ప్రభుత్వం  ప్రోత్సహించాలి.  అంబులెన్సు వచ్చేలోపు బాటసారులు చేయదగిన ప్రథమ చికిత్సపై  అవగాహన కల్పించాలి. ఈ క్రమంలో తొమ్మిది కీలక చర్యలను పరిగణనలోకిన తీసుకోవాలి.  ముందుగా మీ భద్రతను చూసుకుంటూ..  వేగంగా వచ్చే ఇతర వాహనాలు, విద్యుత్ తీగలు, మంటల పట్ల అప్రమత్తంగా ఉండండి. 112 (ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్) లేదా 108 (అంబులెన్స్)కి వెంటనే ఫోన్ చేయండి.   

ఇద్దరు ఉంటే  ఒకరు కాల్ చేయాలి, మరొకరు సహాయం చేయాలి.  బాధితులతో  మాట్లాడుతూ,  ధైర్యం చెబుతూ స్పృహలోనే ఉండేటట్లు చూడండి. చుట్టూ ఎక్కువ జనం గుమిగూడకుండా చూడండి,  గాలి తగలనివ్వండి.  రోడ్డు  ప్రమాద బాధితులకు గాయం నుంచి రక్తం కారుతుంటే, శుభ్రమైన గుడ్డతో రక్తం ఆగేవరకు గట్టిగా నొక్కి పట్టండి. మరొక పొడవైన గుడ్డతో గట్టిగా (మరీ బిగుతుగా కాదు) ముడి వేయండి.వేళ్లు నీలం రంగులోకి మారుతుంటే కట్టు కాస్త వదులు చేయండి.

 

- శ్రీనివాస్ మాధవ్, వ్యవస్థాపకుడు,51A అభీ ఫౌండేషన్