బీహార్లో క్రిమినల్స్ కోసం తెలంగాణ పోలీసుల వేట

బీహార్లో క్రిమినల్స్ కోసం తెలంగాణ పోలీసుల వేట
  • తెలంగాణ పోలీసులను గుర్తించి కాల్పులకు తెగబడ్డ క్రిమినల్స్
  • నలుగుర్ని పట్టుకుని హైదరాబాద్ కు తరలించిన తెలంగాణ పోలీసులు
  • తప్పించుకున్న వారి కోసం లోకల్ పోలీసులతో సెర్చ్

పాట్నా: బీహార్లో తెలంగాణ పోలీసులపై సైబర్ క్రిమినల్స్ కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల నుంచి మన రాష్ట్ర పోలీసులు తప్పించుకున్నారు. ఈ ఉద్రిక్తతల నడుమ బీహార్ పోలీసులతో కలిసి వ్యూహాత్మకంగా వ్యవహరించి నలుగురు క్రిమినల్స్ ను పట్టుకున్నారు. తప్పించుకుని పరారైన మిగిలిన నేరస్తుల కోసం లోకల్ పోలీసులతో కలిసి తెలంగాణ పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. పట్టుపడిన నలుగురు నేరస్తులను హైదరాబాద్ కు తరలించారు. తెలంగాణ రాష్ట్రంలో..ముఖ్యంగా సైబరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో పలువురు వ్యాపారస్తులను మోసం చేసిన ముఠాను పట్టుకునేందుకు సైబరాబాద్ పోలీసులు బీహార్ కు వెళ్లారు. 

ఆటో మొబైల్ షోరూమ్ ఏజెన్సీలు ఇప్పిస్తామంటూ బీహార్ సైబర్ క్రిమినల్స్ వ్యాపారులను మోసం చేస్తోంది. ఈ గ్యాంగ్ వలలో చిక్కుకున్న వ్యాపారులు లక్షల రూపాయలు మోసపోయారు.  ఆన్ లైన్ అడ్డాగా జరిగిన ట్రాప్ లో ఒక్కో వ్యక్తి రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు వసూలు చేశారు. క్రిమినల్స్ చేతిలో మోసపోయిన బాధితులు సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగి వ్యాపారస్తులను మోసం చేసిన నిందితుల ఫోన్ నంబర్లు, బ్యాంక్ అకౌంట్ల ఆధారంగా విచారణ చేపట్టారు. 

లభించిన సమాచారం ఆధారంగా ఈ నెల 11న సైబరాబాద్ పోలీసులు బీహార్ వెళ్లారు. నేరస్తుల ఆచూకీ తెలుసుకుని వెంటాడుతూ బీహార్ కు చేరుకుని స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి అన్వేషణ కొనసాగిస్తుండగా.. నవాడ ఏరియాలో నిందితులను గుర్తించారు. స్థానిక పోలీసులతో కలిసి అరెస్ట్ చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో ప్రధాన నిందితుడు మిథిలేష్ ప్రసాద్ తో పాటు మరో మరో ఐదుగురు కాల్పులు జరిపారు. 

ఊహించని కాల్పులతో తేరుకున్న పోలీసులు క్రిమినల్స్ పై ఎదురు కాల్పులు జరిపారు. నిందితులను రౌండ్ చేసేందుకు స్పెషల్ ఆపరేషన్ చేపట్టగా నలుగురు పట్టుపడ్డారు. అయితే ప్రధాన నిందితుడు మిథిలేష్ ప్రసాద్ కాల్పులు జరుపుతూ తప్పించుకున్నాడు.నవాడాలో తెలంగాణ పోలీసులపై దాడులు చేసి.. కాల్పులు జరిపిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి రూ1.22కోట్ల నగదు, 3 కార్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను విచారించగా కంట్రీమేడ్ తుపాకులతో కాల్పులు జరిపినట్లు గుర్తించారు. మంగళవారం పూర్తి వివరాలు వెల్లడిస్తామని సైబరాబాద్ పోలీసులు చెబుతున్నారు.