పొలిటికల్ వార్ : సెప్టెంబర్ 17 చుట్టూ తెలంగాణ రాజకీయం

పొలిటికల్ వార్ : సెప్టెంబర్ 17 చుట్టూ తెలంగాణ రాజకీయం

సెప్టెంబర్ 17వ తేదీ చుట్టూ తెలంగాణ పాలిటిక్స్ తిరుగుతున్నాయి. సెప్టెంబర్ 17వ తేదీ రోజు బహిరంగ సభలు నిర్వహించాలని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. మరోవైపు.. బీజేపీ, కాంగ్రెస్ సభలకు కౌంటర్ సభగా బీఆర్ఎస్ కూడా రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 6న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష చేపట్టారు. పాలమూరు, రంగారెడ్డి ప్రజాప్రతినిధులతో కేసీఆర్ భేటీ అయ్యారు. సెప్టెంబర్ 17 లేదా 18వ తేదీన పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రాజెక్ట్ ఓపెనింగ్ సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీఆర్ఎస్ కూడా ప్లాన్ చేస్తోంది. 

మరోవైపు.. తెలంగాణ విమోచన దినోత్సవానికి బీజేపీ రెడీ అవుతోంది. సెప్టెంబర్ 17వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో బహిరంగ సభ నిర్వహించాలని ప్లాన్ చేసింది. ఈ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లేదంటే రాజ్ నాథ్ సింగ్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ఏడాది కావడంతో భారీ బహిరంగ సభకు బీజేపీ రెడీ అవుతోంది. గతేడాది కూడా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించింది. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో పాలిటిక్స్ సెప్టెంబర్ 17వ తేదీ చుట్టూ తిరుగుతుండడం సర్వత్రా ఆసక్తి రేపుతున్నాయి.