
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఈ నెల 13న పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ జరగనున్నది. ఈ పరీక్షకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్టు ఎస్బీ టెట్ కన్వీనర్ పుల్లయ్య తెలిపారు. ఈ పరీక్షలకు మొత్తంగా 1,06,716 మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. దీంట్లో ఎంపీసీ స్ర్టీమ్ లో 64,295 మంది, ఎంబైపీసీ స్ర్టీమ్ లో 42, 421 మంది ఉన్నారు. వారి కోసం రాష్ట్రవ్యాప్తంగా 276 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.
మంగళవారం ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 1.30గంటల వరకూ పరీక్ష ఉంటుందని వివరించారు. స్టూడెంట్లను నిర్ణీత సమయానికి కంటే గంట ముందే ఎగ్జామ్ సెంటర్లలోకి అనుమతిస్తామని పేర్కొన్నారు. ఉదయం 11గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా లోపలికి అనుమతించబోమని స్పష్టం చేశారు. విద్యార్థులు తమ వెంట పెన్సిల్, ఏరెసర్, బ్లూ లేదా బ్లాక్ పెన్ తప్పక తీసుకొని రావాలని సూచించారు. హాల్ టికెట్ మీద ఫొటో ప్రింట్ కాని వాళ్లు పాస్ పోర్టు సైజ్ ఫొటోతో పాటు ఆధార్ కార్డు వెంట తీసుకురావాలన్నారు.