లేఖ రాయడం ఒక జ్ఞాపకం మాత్రమే కాదు.. ప్రకృతిపై మన బాధ్యతను చెప్పే వాగ్దానం అంటారు తపాలాశాఖ అధికారులు. చిన్నారులు భూమాతను ఉద్దేశించి మొక్కలు నాటుతామని, ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గిస్తామని, నీటిని కాపాడతామని రాసే లేఖలు.. పెద్దలు తమ చిన్ననాటి ప్రకృతి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ రాసే లేఖలు.. అమ్మ అంటే ప్రేమ.. భూమి అంటే జీవితం. మనల్ని పెంచి పోషిస్తున్న భూమాతకు ఇప్పుడు ఓ లేఖ రాస్తే ఎలా ఉంటుంది?
లేఖా రచన పోటీలు
సెల్‌ఫోన్‌లో మెసేజ్‌లు.. వాట్సాప్‌లో చాటింగ్‌ల కాలంలో మర్చిపోయిన ఉత్తరానికి మళ్లీ ప్రాణం పోస్తోంది తెలంగాణ సర్కిల్ తపాలాశాఖ. ‘భూమాతకు ఒక లేఖ.. ఈ ప్రకృతిని రక్షిస్తానని నా వాగ్దానం’ అంటూ హైదరాబాద్ తపాలాశాఖ నిర్వహిస్తున్న ‘ఢాయీ అఖర్’ లేఖల పోటీ పర్యావరణ ప్రేమను అక్షరాల్లో ఆవిష్కరించే వేదికగా మారింది.
ఇన్ లాండ్ లెటరులో 500 పదాలలోపు, కవరు విభాగంలో 1000 పదాల లోపు తెలుగు, ఇంగ్లిష్, హిందీ లేదా ఇతర భాషల్లో భూమాతకు లేఖ రాయవచ్చునని తెలంగాణ తపాలాశాఖ చీఫ్ పోస్టు మాస్టర్ వై. ప్రసాద్ వెల్లడించారు. 18 ఏళ్లు లోపు వారు, పైబడినవారు వేర్వేరు విభాగాలుగా లేఖలు రాస్తే ఆయా విభాగాల్లో ఉత్తమ లేఖలను ఎంపిక చేసి విజేతలకు రూ.5 వేల నుంచి రూ.50 వేల వరకు నగదు బహుమతులను అందజేస్తామని ఆయన తెలిపారు. ఈ లేఖలను అక్టోబరు 31వ తేదీలోగా చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్, తెలంగాణ సర్కిల్, పిన్ -500001 చిరునామాకు పంపించాలని కోరారు. ఇంకెందుకు ఆలస్యం భూమాతకు లేఖ రాయండి.
లేఖలు రాసేవారేరి ?
సెల్ ఫోన్లు, మెసేజులు, వాట్సాప్ రాకతో పోస్టల్ ఇన్‌ల్యాండ్ లెటర్లు, పోస్టు కార్డులు రాసేవారి సంఖ్య గణనీయంగా తగ్గింది. గతంలో బంధువులు, మిత్రులు, కుటుంబసభ్యుల నుంచి లేఖ వచ్చిందంటే చాలు స్వయంగా వారితో మాట్లాడిన అనుభూతి చెందేవారు. ఒక్క కార్డులో.. ఊరి కబుర్లంతా రాసేవారు. చేతిరాత కబుర్లకు పోస్టు కార్డు చిరునామాగా ఉండేది.ఇన్‌ల్యాండ్ లెటరు రాసి ఆ కాగితాన్ని మడిచి మూసి లేఖగా పంపేవారు.
పోస్టాఫీసు ద్వారా చిన్న సందేశాలు, సమాచారం, శుభాకాంక్షలు, వ్యక్తిగత విషయాలు పంపేందుకు ఉపయోగించే సరళమైన పోస్టల్ కార్డు. గతంలో చిన్న సమాచారం, వ్యక్తిగత కబుర్ల కోసం ఈ పోస్టు కార్డును విస్తృతంగా ఉపయోగించేవారని మౌలాలి తపాలా శాఖ పోస్టుమాస్టర్ భద్రునాయక్ చెప్పారు. పోస్టు కార్డులో ఒకవైపు చిరునామా, స్టాంప్‌కు సంబంధించిన భాగం, మరోవైపు సందేశం రాసే స్థలం ఉంటుందని ఆయన తెలిపారు.
వాట్సాప్ యుగంలో పోస్టు కార్డు జ్ఞాపకాలు!
ఒకప్పుడు “బాబాయ్‌కి నమస్కారం... అమ్మకు నా వందనాలు” అంటూ ఇంటి కబుర్లను ఊరికి మోసుకెళ్లిన పోస్టు కార్డు.. ఇప్పుడు డిజిటల్ సందేశాల కాలంలో ఒక మధుర జ్ఞాపకంగా మిగిలింది. ఒకప్పుడు మనసులోని మాటలను మోసుకెళ్లిన ఇన్‌ల్యాండ్ లెటర్, పోస్టు కార్డు ఇప్పుడు పోస్టాఫీస్ల్లో, పాత ఉత్తరాల్లో కనిపించే ఒక తరం జ్ఞాపకంగా మారిపోయింది. 2026లో కూడా పోస్టల్ ఇన్‌ల్యాండ్ లెటర్ కార్డు, పోస్టు కార్డు రెండూ ఇండియా పోస్టు అధికారిక మెయిల్ ప్రొడక్ట్స్‌గా కొనసాగుతున్నాయి.
ప్రస్తుతం హైదరాబాద్ పోస్టాఫీసుల్లో అమ్మకానికి అందుబాటులో ఉన్నా కవర్ అవసరం లేకుండా నేరుగా సందేశం రాసి పంపేవారి సంఖ్య తగ్గింది. గతంలో అతి తక్కువ ధరలో లభించే పోస్టల్ సేవగా ప్రజాదరణ పొందింది. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ సభ్యులకు సమాచారం పంపడానికి విస్తృతంగా ఉపయోగించేవారు. మొబైల్, వాట్సాప్, మెయిల్, సోషల్ మీడియా రాకతో వినియోగం బాగా తగ్గిందని ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్స్ యూనియన్ అధ్యక్షుడు, గ్రామీణ డాక్ బ్రాంచి పోస్టుమాస్టర్ బి. వెంకటేశ్వర్లు చెప్పారు.
భారత తపాలా శాఖలో నేటికీ సాధారణ పోస్టు కార్డు ధర 50 పైసలు, ఇన్‌ల్యాండ్ లెటర్ రెండున్నర రూపాయలు, 20 గ్రాముల సాధారణ లెటరు కవరు ఐదు రూపాయలకు విక్రయిస్తున్నామని ఆయన తెలిపారు. లేఖ రాయడం ఒక జ్ఞాపకం మాత్రమే కాదు.. ప్రకృతిపై మన బాధ్యతను చెప్పే వాగ్దానం. మీరు రాసే లేఖకు రిప్లై వస్తుందో లేదో తెలియదు.. కానీ భూమాతకు రాసిన ఈ లేఖకు మన చర్యే అసలైన సమాధానం. అక్షరాలతో మొదలైన ఈ ప్రేమ.. పచ్చదనంగా మారితే అదే ఢాయీ అఖర్‌కు అసలైన అర్థం.
