రైజింగ్–2047 సమిట్ తెలంగాణ విజన్కు నాంది

రైజింగ్–2047 సమిట్ తెలంగాణ విజన్కు నాంది

తెలంగాణ  ప్రజా ప్రభుత్వం సబ్బండ వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా అడుగులేస్తోంది.   ‘తెలంగాణ రైజింగ్‌‌‌‌ 2047’ లక్ష్యంగా ముందుకు సాగుతోంది.  తెలంగాణలో పుష్కలంగా వనరులు ఉన్నాయి. అయితే, రాష్ట్ర అభివృద్ధిలో వేగం పెరగాలంటే అందుకు తగిన విజన్​ ఉండాలి.  రాష్ట్ర భవిష్యత్​కు భరోసా కల్పించేలా ఫ్యూచర్‌‌‌‌ సిటీలో  ప్రభుత్వం తెలంగాణ రైజింగ్‌‌‌‌ గ్లోబల్‌‌‌‌ సమిట్‌‌‌‌ నిర్వహిస్తోంది. డిసెంబర్‌‌‌‌ 8, 9 తేదీల్లో  నిర్వహించబోయే ఈ సమిట్‌‌‌‌  తెలంగాణ భవిష్యత్తు లక్ష్యాలను ప్రపంచం ముందు ఆవిష్కరించనుంది.

ప్రపంచంతో పోటీపడుతూ స్వయం సమృద్ధి సాధించేందుకు వ్యూహాలు, ఏఐ సమ్మిళిత, పారిశ్రామిక అభివృద్ధి, కర్బన ఉద్గార రహిత ప్రగతికి బాటలు, ఆధునిక సాంకేతికత, అంతరిక్ష, రక్షణ, పర్యాటక, సెమీ కండక్టర్‌‌‌‌ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు రైతులు, మహిళ, యువత, విద్యార్థులకు.. అన్ని వర్గాల ఎజెండాలకు ప్రాధాన్యతనిచ్చే ప్రణాళికలను గ్లోబల్‌‌‌‌ సమిట్​లో ఆవిష్కరించనున్నారు.   పరిశ్రమలు,  ఐటీ,  ఫార్మా,  విద్య, ఆరోగ్యం,  వ్యవసాయం,  పర్యాటకం, మౌలిక వసతులు.. ఇలా పలు రంగాలపై  గ్లోబల్‌‌‌‌ సమిట్​లో  చర్చ జరగనుంది.  పెట్టుబడులను ఆకర్షించనుంది.

3 ట్రిలియన్​ డాలర్ల ఎకానమీ లక్ష్యం

బలమైన ఆర్థిక వ్యవస్థతోనే ‘తెలంగాణ రైజింగ్‌‌‌‌ 2047’ సాధ్యమనే  సంకల్పంతో  రేవంత్‌‌‌‌ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని 3  ట్రిలియన్‌‌‌‌  డాలర్ల ఆర్థిక వ్యవస్థ వృద్ధే లక్ష్యంగా ప్రకటించింది. ఇందుకు జాతీయ, అంతర్జాతీయ  కంపెనీలు పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం ఈ  రెండు రోజుల  సమిట్​లో  ప్రత్యేక  కార్యక్రమాలు  ఏర్పాటు చేసింది. జాతీయ, అంతర్జాతీయస్థాయి ప్రతినిధులు, వ్యాపార ప్రముఖులతోపాటు,  దేశ ప్రధాన మంత్రి,  కేంద్ర మంత్రులకు  ఆహ్వానం  ఉంది.  ఇతర రాష్ట్రాల సీఎంలు,  ప్రజాప్రతినిధులు  ఈ సమిట్​లో  పాల్గొననున్నారు. 

వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేలా, రైతు ఆదాయం పెంచేలా సమిట్​లో  కీలక  నిర్ణయాలు ఉంటాయి.  ఈ దిశలో  ఫుడ్‌‌‌‌ ప్రాసెసింగ్‌‌‌‌  యూనిట్లు,  కోల్డ్‌‌‌‌ స్టోరేజీలు, అగ్రో లాజిస్టిక్‌‌‌‌ హబ్‌‌‌‌ వంటి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి.  సాంకేతికత ఆధారంగా వ్యవసాయ ఉత్పత్తుల విలువ పెంపునకు అవకాశాలు, సాగు సంబంధిత అంశాలపై  చర్చ ఉంటుంది.

పర్యాటక రంగం అభివృద్ధిపై దృష్టి

పర్యాటక రంగంలో తెలంగాణకు మంచి అవకాశాలున్నాయి.  రాష్ట్రంలో ఉన్న చారిత్రాత్మక కట్టడాలు,  దేవాలయాలు, మత,  సాంస్కృతిక కేంద్రాలు తెలంగాణకి ప్రత్యేక గుర్తింపు ఇస్తాయి. ఆధ్యాత్మిక రంగానికి  ప్రాధాన్యతనిస్తూ  రాష్ట్రంలోని చారిత్రాత్మక  దేవాలయాలను  కలుపుతూ టెంపుల్‌‌‌‌ సర్క్యూట్‌‌‌‌  ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి.  

తెలంగాణలో  ప్రసిద్దమైన సమ్మక్క సారలమ్మ జాతరను అంతర్జాతీయ  పర్యాటక ఈవెంట్‌‌‌‌గా అభివృద్ధి చేయనుంది. 430  ఏండ్ల  చరిత్రగల హైదరాబాద్‌‌‌‌ నగరంలో ఉన్న చారిత్రాత్మక కట్టడాలు ప్రపంచవ్యాప్తంగా  పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.   పర్యాటక రంగంలో  ఆదాయాన్ని  గణనీయంగా పెంచేందుకు  గ్లోబల్‌‌‌‌ సమిట్​ ఉపయోగపడనుంది.

1300 కంపెనీలు రానున్నాయి

దావోస్‌‌‌‌ వేదికగా  ‘వరల్డ్‌‌‌‌ ఎకనామిక్‌‌‌‌ ఫోరం’ సమావేశాల్లో 2024లో రూ.40,832 కోట్లు, 2025లో రూ.1,78,50 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుకున్నది.  తెలంగాణ ప్రభుత్వం కంపెనీలను ఆకర్షించేందుకు గ్రేటర్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌ శివార్లలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ‘ఫ్యూచర్‌‌‌‌ సిటీ’ సకల సౌకర్యాలతో ఎంతో దోహదపడుతోంది. 1300కు పైగా కంపెనీలు, 3000కు పైగా  ప్రతినిధులు పాల్గొంటున్న  గ్లోబల్‌‌‌‌ సమిట్‌‌‌‌కు రావాలని కోరుతూ సీఎం  రేవంత్‌‌‌‌ రెడ్డి   స్వయాన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని, కేంద్ర మంత్రులను ఆహ్వానించారు.   సమిట్​లో  పాల్గొననున్న  పలు సంస్థలు తమ వ్యాపార లక్ష్యాలను ఉత్పత్తులను ప్రదర్శిస్తూ ఎగ్జిబిషన్‌‌‌‌ ఏర్పాటు చేస్తున్నారు.

అన్ని రంగాలపై చర్చలు

 ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులు కృత్రిమ మేధ (ఏఐ) ఆవిష్కరణలు, వివిధ రంగాల్లో ఏఐ వినియోగం, ఏఐ ఆధారిత అభివృద్ధిపై నిపుణులతో ప్రత్యేక చర్చలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో 27 అంశాలపై ప్లీనరీలు నిర్వహించనున్నారు.  

హ్యూమన్‌‌‌‌ డెవలప్​మెంట్‌‌‌‌ ప్లీనరీలో భాగంగా ఉన్నత విద్య అవకాశాలు, నైపుణ్యాల పెంపునకు  భారత్‌‌‌‌  ఫ్యూచర్‌‌‌‌ సిటీలో ప్రాధాన్యతనిస్తూ టాలెంట్‌‌‌‌ మొబిలిటీ కెనడా సెషన్స్‌‌‌‌ ఏర్పాటు చేస్తున్నారు.  తెలంగాణ వారసత్వ,  సాంస్కృతిక వైభవాన్ని చాటేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమిట్​ యావత్‌‌‌‌ దేశానికి   తెలంగాణను  ఒక దిక్సూచిగా మార్చే అవకాశాలు ఉన్నాయి.

-అమర్​వాజి నాగరాజు, జర్నలిస్ట్​-