కాంగ్రెస్ రెబల్స్కు బుజ్జగింపులు..రంగంలోకి దిగిన అధినాయకత్వం

కాంగ్రెస్ రెబల్స్కు బుజ్జగింపులు..రంగంలోకి దిగిన అధినాయకత్వం
  • ఒక్కొక్కరితో మాట్లాడుతూ భరోసాలు
  • హైదర్ గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో చర్చలు
  • మాణిక్ రావు ఠాక్రే వెంట మహేశ్ కుమార్ గౌడ్
  •  ఓట్లు చీలకుండా కట్టడి చేసే ప్రయత్నం

హైదరాబాద్:  నామినేషన్లు, స్క్రూట్నీ ముగియడంతో ఇక అందరి దృష్టీ ఉపసంహరణపై పడింది. నామినేషన్ల ఉపసంహరణకు రేపటి వరకు గడువు ఉండటంతో రెబల్స్ పై  దృష్టి సారించింది కాంగ్రెస్ అధినాయత్వం. చివరి క్షణం వరకు టికెట్ ఆశించి భంగపడ్డ అభ్యర్థులు ఇండిపెండెంట్లుగా, ఫార్వార్డ్ బ్లాక్ నుంచి నామినేషన్లు దాఖలు చేశారు. వారితో చర్చించి ఉపసంహరణపై దృష్టి సారించింది.  ఇవాళ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంగ్ మహేశ్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహరాల ఇన్ చార్జి మాణిక్ రావు ఠాక్రే ఓల్ట్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో రెబల్స్ ఆపరేషన్ చేపట్టారు. వారిని అక్కడికి పిలిపించుకొని చర్చలు జరుపుతున్నారు.

ప్రభుత్వ వ్యతిరేక, ముఖ్యంగా కాంగ్రెస్ ఓట్లు చీలకుండా తీసుకుంటున్న చర్యలో భాగంగానే రెబల్స్ తో చర్చలు జరుపుతున్నారని సమాచారం.  ఆదిలాబాద్ లో డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, గండ్ర సుజాత మద్దతుతో బరిలోకి దిగిన సంజీవరెడ్డితో విత్ డ్రా చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే సూర్యాపేటలో ఫార్వార్డ్ బ్లాక్ నుంచి నామినేషన్ వేసిన పటేట్ రమేశ్ రెడ్డి నామినేషన్ ఉపసంహరించుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడి నుంచి దామోదర్  రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన విషయం తెలిసిందే. బోథ్ నుంచి బరిలోకి అశోక్, నరేశ్​ జాదవ్ లతోనూ చర్చలు జరుపుతున్నారు.  వరంగల్ వెస్ట్ టికెట్ ను కాంగ్రెస్ అధినాయకత్వం నాయిని రాజేందర్  రెడ్డికి కేటాయించింది. ఇక్కడి నుంచి జంగారాఘవరెడ్డి బరిలో నిలిచారు. దీంతో ఆయన నామినేషన్ ఉపసంహరించుకునేలా చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. అలాగే ఇబ్రహీం పట్నం టికెట్ ను మల్ రెడ్డి రంగారెడ్డికి కేటాయించారు. ఇక్కడ రెబల్ గా బరిలో నిలిచిన దండెం రాంరెడ్డితో చర్చిస్తున్నారు. నామినేషన్ విత్ డ్రా చేసుకోవాలని కోరుతున్నారు.  వైరా నుంచి నామినేషన్ వేసిన విజయభాయ్, నర్సాపూర్ నుంచి నామినేషన్ వేసిన గాలి అనిల్ కుమార్, డోర్నకల్  నుంచి బరిలోకి దిగిన నెహ్రూ నాయక్ నామినేషన్లు విత్ డ్రా చేసుకొనేలా బుజ్జగిస్తున్నారు.  జుక్కల్ టికెట్ ను అధినాయకత్వం లక్ష్మీకాంతరావుకు ఇచ్చింది. ఇక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారాం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఆయనతోనూ ఠాక్రే చర్చిస్తున్నారు. నామినేషన్ ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మరో వైపు బాన్సువాడ టికెట్ దక్కక ఆత్మహత్యాయత్నం చేసిన కాసుల బాలరాజు ఇండిపెండెంట్ గా నామినేషన్ వేశారు. ఈ స్థానం టికెట్ ను కాంగ్రెస్ అధినాయకత్వం ఏనుగు రవీందర్ రెడ్డికి కేటాయించింది. స్థానికంగా పట్టున్న బాలరాజు నామినేషన్ ఉపసంహరించుకునేలా బుజ్జగిస్తోంది. అలాగే సిరిసిల్ల టికెట్ ను కేకే మహేందర్ రెడ్డికి కేటాయించిన విషయం తెలిసిందే. ఇక్కడి నుంచి ఉమేశ్ రావు రెబల్ గా బరిలో నిలిచారు. ఆయనతోనూ చర్చలు జరుపుతున్నారు. నామినేషన్ ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు. పాలకుర్తి టికెట్ ను యశశ్వినికి కాంగ్రెస్ కేటాయించింది. ఈ టికెట్ ను లక్ష్మణ్ నాయక్, సుధాకర్ గౌడ్ ఆశించారు. టికెట్ దక్కక పోవడంతో వారు ఇండిపెండెంట్లుగా నామినేషన్లు వేశారు. దీంతో వారితోనూ ఠాక్రే, మహేశ్ కుమార్ గౌడ్ చర్చిస్తున్నారు. రేపు సాయంత్రంలోగా వీరి నామినేషన్లు విత్ డ్రా చేయించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు.