V6 News

జాతీయ ఎజెండాను నిర్దేశిస్తున్న తెలంగాణ

జాతీయ ఎజెండాను నిర్దేశిస్తున్న తెలంగాణ

డీలిమిటేషన్  పోరాటం నుంచి  కులగణన  డేటా వెల్లడి వరకు,  రాజ్యాంగం  మారుస్తారనే డిమాండ్ దగ్గర నుంచి ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక వరకు.. తెలంగాణ  ఇప్పుడు  కేవలం  ఒక రాష్ట్రంగా కాకుండా జాతీయ రాజకీయ ఎజెండాను నిర్ణయించే  శక్తిగా నిలుస్తోంది. తెలంగాణ,  ఆంధ్ర  విభజన వివాదాల నుంచి ఆత్మగౌరవ పోరాటం వరకు తెలంగాణ  జాతీయ స్థాయిలో ఓ చర్చలా నిలుస్తోంది. రాజకీయాలు  కేవలం  సిద్ధాంతాలపైనే కాదు ప్రజానాడికనుగుణంగా  ట్రెండ్ క్రియేట్ చేయడంపై ఆధారపడి పురోగమిస్తుంటాయి.  మారుతున్న కాలం, ప్రజావసరాలు, సాంకేతికతకు తోడు నాయకత్వం తమ వ్యూహాలు మార్చుకోవడం ఈనాటి అనివార్యత.

రాజకీయాల్లో ‘ట్రెండ్ సెట్టింగ్’ ’ఎజెండా మార్పు’ అనే నిరంతర ప్రక్రియలో ఇవాళ తెలంగాణ ముందువరుసలో నిలుస్తోంది. రాజకీయాల్లో  ట్రెండ్ సెట్టర్ అంటే కేవలం ఎన్నికల్లో  గెలవడం కాదు.  మిగతా పార్టీలు అనుకరించి అనుసరించేలా మాట్లాడేలా చేయడం, ఓ నేత లేవనెత్తిన అంశాలే జాతీయ చర్చ అయ్యేలా చేయడం నిజమైన ట్రెండ్ సెట్టింగ్.  ఒక రాష్ట్రం  తన  స్థానిక  సమస్యలను  జాతీయ  ప్రశ్నలుగా మార్చగలిగినప్పుడు, అది నిజమైన రాజకీయ శక్తిగా ఎదిగిందని  అర్థమవుతుంది.  ఇప్పుడు తెలంగాణ సరిగ్గా అదే చేస్తోంది. డీలిమిటేషన్ వేళ  తెలంగాణ రాజకీయ డిమాండ్ పాటు  కులగణన లెక్కలు బహిర్గతం చేసి  జాతీయ స్థాయి చర్చల్లో నిలిచింది. 

కేంద్రం జనగణన, కులగణన,  డీలిమిటేషన్ వేళ  కులగణన లెక్కలు బహిర్గతం చేయడం తెలంగాణ  రాజకీయాల్లో  మైలురాయి.  ఓబీసీ జనాభా,  వనరుల పంపిణీలో వాటా,  రిజర్వేషన్  విస్తరణ  అనివార్యతలన్నీ  డేటాతో  నిరూపించారు. ఇది జాతీయస్థాయిలో ఓబీసీ రాజకీయాలకు  కొత్త దిశను చూపించిన అంశంగా చరిత్రలో నిలిచిపోతుంది.   ఇది కేవలం ఒక సర్వే కాదు.  సామాజిక న్యాయ ఆకాంక్షలకు డిజిటల్ ఆధారం. జాతీయ కులగణన వచ్చినప్పుడు  తెలంగాణ మోడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అనుసరించాలని  డిమాండ్ బలపడుతోంది.

కాంగ్రెస్ ట్రబుల్ షూటర్
విజయవంతమైన  ట్రెండ్ సెట్టర్  నాలుగు లక్షణాలు కలిగి ఉంటాడు.  సరైనవేళ అంశం లేవనెత్తే సమయ స్ఫూర్తి,  డేటాతో వాదన  బలపరచే  శాస్త్రీయ దృష్టి,  ఇతర రాష్ట్రాలను  ఒక వేదికపై తెచ్చే కూటమి నైపుణ్యం, అలాగే స్థానిక అంశాన్ని జాతీయ ప్రశ్నగా మార్చే దార్శనికత.  వీటన్నింటితో  సీఎం  రేవంత్  ముందున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే జాతీయ కాంగ్రెస్ పార్టీకి ఆయనో ట్రబుల్ షూటర్.  సీఎం రేవంత్ కేవలం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగానే కాకుండా,  జాతీయ స్థాయిలో  దక్షిణాది  ప్రయోజనాల కోసం పోరాడే నాయకుడిగా తన ఎజెండాను మారుస్తూ  రాజకీయాల్లో  ఒక  కొత్త ట్రెండ్  సెట్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా  నిలుస్తున్నారు. 

కాంగ్రెస్  పార్టీ  వర్కింగ్  ప్రెసిడెంట్గా,  టీపీసీసీ అధ్యక్షుడిగా,  ఆ తర్వాత  సీఎంగా  ఆయన  పార్టీని తెలంగాణలో  గెలిపించి,  అంతేవేగంతో  జాతీయస్థాయిలో డీలిమిటేషన్,  రాజ్యాంగ రక్షణ వంటి అంశాలపై బలమైన స్వరం వినిపించి  కాంగ్రెస్  వర్కింగ్ కమిటీ మీటింగుల్లో ఆయన ఓ ట్రబుల్  షూటర్​గా నిలుస్తున్నారు.

ఇదొక నిర్మాణాత్మక వ్యూహం!
కేవలం  రెండున్నరేళ్లలోనే  ఆయన పేరు తెలంగాణ సరిహద్దులు దాటి, జాతీయ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారడమనేది యాదృచ్ఛికం కాదు. ఇదో స్పష్టమైన  రాజకీయ వ్యూహంగా పరిగణించాలి.  బీజేపి మరోసారి వస్తే  రాజ్యాంగం మార్పు నినాదం నుంచి, ఇవాల్టి డీలిమిటేషన్,  కులగణన  లెక్కల బహిర్గతం వరకూ  జాతీయస్థాయి చర్చల్లో ప్రధానంగా  నిలుస్తున్నారు. 

అలాగే ఇటీవల జస్టిస్ సుదర్శన్ రెడ్డిని  భారత ఉప రాష్ట్రపతి  అభ్యర్థిగా  ఎంపికలో  సీఎం రేవంత్ పాత్ర కీలకమైంది.  ఇటీవల కేరళ, తమిళనాడు ఎన్నికల ప్రచారంలో స్టార్ కాంపైనర్​గా  వెళ్లి  తెలంగాణ మోడల్, పథకాలపై బలంగా వాదించడమేకాక అక్కడి  నేతలకు గట్టి సవాల్ విసిరారు.  అనతికాలంలో  కాంగ్రెస్  జాతీయ  రాజకీయాల్లో  రేవంత్  వేస్తున్న ముద్ర  చర్చకు  దారితీస్తున్నది.

ఉత్తరం రాజ్యమేలితే.. దక్షిణం బానిసవుతుందా?
డీలిమిటేషన్  ఎపిసోడ్​లో  తెలంగాణ  జాతీయస్థాయిలో చర్చను లేవనెత్తింది.  ఓ ఎజెండా సెట్ చేసి  దేశ రాజకీయాలన్నీ  మాట్లాడే అవకాశం కల్పించింది.  అది దక్షిణాది రాష్ట్రాలకు అత్యంత కీలకం కూడా. జనాభా పెరిగినా  పార్లమెంటు సీట్లు  తగ్గిపోతాయనే సహజ ఆందోళనను  మొదట  తెలంగాణ బలంగా లేవనెత్తింది. 

ఈ డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను జాతీయ చర్చగా మార్చడంలో  సీఎం రేవంత్ రెడ్డి ముందున్నారు. ఆ వెంటనే తమిళనాడు, కేరళ, కర్ణాటక వంటి రాష్ట్రాలు కూడా జత కలిశాయి.  దక్షిణాదికి జరిగే అన్యాయంపై  ఏకంగా  తమిళనాడు  సీఎం స్టాలిన్  డీలిమిటేషన్  ప్రతులను  తగులబెట్టారు.   ఒక రాష్ట్రం ఎజెండా నిర్ణయిస్తే మిగతావి అనుసరించాయి. ఇదే నిజమైన  రాజకీయ నాయకత్వ శక్తి.

దక్షిణాది గొంతుకగా..
సీఎం రేవంత్ ప్రతిపాదిస్తున్న హైబ్రీడ్ మోడల్​పై  జాతీయ స్థాయిలో  చర్చ జరుగుతున్నది.   కేంద్రం పెంచాలనుకుంటున్న  272  అదనపు  సీట్లలో  136 సీట్లు జనాభా (ప్రోరేటా) ప్రాతిపదికన,  మిగిలిన 136 సీట్లు రాష్ట్రాల స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) ఆధారంగా  కేటాయించాలని  ఆయన  సూచించారు. ఇది దక్షిణాది ఆర్థిక సహకారాన్ని గుర్తించి, జనాభా నియంత్రణకు శిక్ష విధించకుండా చేస్తుందని బలంగా చెప్పగలుగుతున్నారు.  ఈ  అంశంపై ఆయన నేరుగా ప్రధాని నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ కూడా రాశారు. దక్షిణాది సీఎంలకూ లేఖలు రాసి మరో  పోరాటానికి సిద్ధం కావాలని  పిలుపునివ్వడం సాహసోపేత చర్య.   ఇది ఒక ముఖ్యమంత్రి హోదా దాటి  దక్షిణాది రాష్ట్రాల సమష్టి గొంతుకగా తాను మాట్లాడుతున్నాననే సందేశాన్ని రేవంత్  జాతీయ వేదికపై  ప్రొజెక్ట్  చేస్తున్నారు.

హైబ్రీడ్  మోడల్ వెనుక ఉన్న తర్కం
ఉత్తరాది రాష్ట్రాలు దేశానికి  ‘రాజకీయ రాజధాని’ అయితే,  దక్షిణాది రాష్ట్రాలు  ‘ఆర్థిక ఇంజిన్’ అని  రేవంత్ రెడ్డి  వాదిస్తున్నారు.  జనాభా ఆధారంగా మాత్రమే డీలిమిటేషన్ చేస్తే, జాతీయ ఆర్థికాభివృద్ధికి అత్యధికంగా దోహదపడుతున్న దక్షిణాది రాష్ట్రాలను అన్యాయంగా శిక్షించినట్టవుతుందని బలంగా చెబుతున్నారు.  అందుకే 273 అదనపు స్థానాలలో 50 శాతం జనాభా ఆధారంగా కేటాయించాలి, మిగతా 50 శాతం స్థానాలు రాష్ట్రాల ఆర్థిక పనితీరు, వృద్ధి రేటు  ఆధారంగా పంపిణీ చేయాలంటున్నారు. మరింత స్పష్టంగా చెప్పాలంటే 136 స్థానాలు (50%) జనాభా ప్రాతిపదికన పంపిణీ చేయాలి.  మిగతా 136 స్థానాలు  జీడీపీ పనితీరు  ఆధారంగా  అత్యుత్తమ రాష్ట్రాలకు  మెరిట్  బేసిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై  ఇవ్వాలని వాదిస్తున్నారు.

ముందున్న సవాళ్లు
ట్రెండ్ సెట్  చేయడం తొలి అడుగు  మాత్రమే.  దాన్ని నిలబెట్టుకోవడమే  అసలు పరీక్ష.  డీలిమిటేషన్ విషయంలో లేవనెత్తిన  డిమాండ్లు ఫలితాలుగా మారాలి.  కులగణన డేటా ఆధారంగా వనరుల పంపిణీ జరగాలి. ప్రజల నమ్మకం కొనసాగాలి.  జాతీయ కూటమిలో నాయకత్వ స్థానాన్ని నిలబెట్టుకోవాలి. ఇవి నిరంతర కృషికి అవసరమయ్యే  సవాళ్లు. తన రాష్ట్రంలో బలమైన పునాది, జాతీయ పార్టీ అధిష్టానం నమ్మకం. రేవంత్ ప్రస్తుతం రెండూ సాధించినట్లు కనిపిస్తున్నారు.  డీలిమిటేషన్ అంశం రాబోయే సంవత్సరాల్లో దేశ రాజకీయాల్లో అత్యంత  కీలకమైన చర్చగా  కొనసాగనుంది.

ఆ చర్చకు పూర్వరంగం సిద్ధం చేసిన నేతగా రేవంత్ రెడ్డి చరిత్రలో నిలవనున్నారు. అయితే ఒక ముఖ్యమంత్రి అసలు పరీక్ష ఎప్పుడూ వేదికపై చేసే ప్రసంగాల్లో కాదు.  తన రాష్ట్ర ప్రజల జీవితాల్లో తీసుకొచ్చే మార్పులో.  జాతీయ నేతగా ఎదగాలన్న ఆకాంక్ష ఉండటం మంచిదే.  కానీ ఆ ఆకాంక్ష  తెలంగాణ పాలనపై  ప్రస్ఫుటం  చేయగలుగాలి.  ఇక్కడ పథకాలు, అబివృద్ధి, ప్రజల నుంచి వస్తున్న స్పందనలు,  పార్టీ పరమైన అంశాలకు తోడు సీఎం రేవంత్ ఈ సమతుల్యతను కాపాడగలిగితే, జాతీయ రాజకీయాల్లో ఆయన ప్రస్థానం నిజంగా అర్థవంతమవుతుంది.

వ్యూహంపై జాతీయ సంక్లిష్టతలు
అయితే ఇక్కడ ఒక రాజకీయ విరుద్ధత కూడా ఉంది. రేవంత్ రెడ్డి చేస్తున్న వాదనలు ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీకి అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉంది. అలాగే, ఉత్తరప్రదేశ్,  బిహార్ వంటి రాష్ట్రాల్లో పాగా వేయాలని చూస్తున్న కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఈ వాదనలు కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది.  కాంగ్రెస్ జాతీయ వ్యూహంలో భాగంగా దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు బలపరచుకోవడానికి రేవంత్ వాదనలు ఒక రాజకీయ నెరేటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రూపొందాయి. 

అయితే,  అది కేవలం ఆయన వ్యక్తిగత అభిప్రాయమా,  లేదా పార్టీ వ్యూహంలో భాగమా అన్న ప్రశ్న ఉంది.  రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన హైబ్రీడ్ మోడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హేతుబద్ధత లేదనికాదు.  రాబోయే ఎన్నికల్లో డీలిమిటేషన్, రిజర్వేషన్  చర్చల్లో తెలంగాణ  కీలక పాత్ర పోషిస్తుంది.

కొన్ని దేశాల్లో హైబ్రీడ్​ డీలిటిమిటేషన్ అమలులో ఉంది
జనాభా + ఆర్థికం కలిపిన  ‘హైబ్రీడ్’ డీలిమిటేషన్  కొన్ని దేశాల్లో  అమలులో ఉన్నది.  జనాభా మాత్రమే కాకుండా వేరే అంశాలను కూడా పరిగణించే  మిశ్రమ ప్రాతి పదిక విధానాలు పలు ప్రజాస్వామ్య దేశాల్లో 
అమలవుతున్నాయి.

యూరోపియన్​ పార్లమెంట్​ ‘Degressive Proportionality’ (క్షీణ అనుపాత) సూత్రం.. యూరోపియన్ పార్లమెంటులో సభ్యదేశాలకు స్థానాల కేటాయింపు "క్షీణ అనుపాత" (Degressive Proportionality) సూత్రం ఆధారంగా జరుగుతుంది. అంటే పెద్ద దేశాలకు ఎక్కువ స్థానాలున్నా, చిన్న దేశాలకు జనాభా నిష్పత్తిలో ఎక్కువ ప్రాతినిధ్యం లభిస్తుంది. జనాభా సూత్రానికి అతీతంగా, చిన్న దేశాల సమాన వాటాను కాపాడే విధానం.

నార్వే-భూభాగ+జనాభా మిశ్రమ సూత్రం: నార్వే పార్లమెంటు (స్టోర్టింగ్)లో 169 స్థానాల్లో 150 స్థానాలు 11 కౌంటీలకు  కేటాయిస్తారు. ఒక కౌంటీకి స్థానాల సంఖ్య నిర్ణయించేటప్పుడు  ప్రతి నివాసికి 1 పాయింట్, ప్రతి చదరపు కిలోమీటరుకు 1.8 పాయింట్ ఇస్తారు. అంటే జనాభాతో పాటు భూగోళ పరిమాణాన్ని కూడా లెక్కలోకి తీసుకుంటారు. 

స్పెయిన్- కనీస స్థానాల హామీ+జనాభా నిష్పత్తి: స్పెయిన్  కాంగ్రెస్ ఆఫ్ డిప్యుటీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మొత్తం 350 స్థానాలుంటాయి. ప్రతి ప్రావిన్సుకు కనీసం రెండు స్థానాలు హామీగా ఇవ్వడం జరుగుతుంది. (మొత్తం 100 స్థానాలు), మిగతా 248 స్థానాలు జనాభా ప్రాతిపదికన పంచుతారు.. దీనివల్ల చిన్న ప్రావిన్సులకు జనాభా నిష్పత్తికి మించి ప్రాతినిధ్యం లభిస్తుంది.

వెంకట్ గుంటిపల్లి, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం

* ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ openpage@v6velugu.com

* రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.

* రచన 700 పదాలకు మించరాదు.