గొర్రెల పంపిణీకి మళ్ళీ బ్రేక్

గొర్రెల పంపిణీకి మళ్ళీ బ్రేక్

గొర్రెల పంపిణీ పథకానికి మళ్ళీ బ్రేక్ పడింది.. రెండో విడత పంపిణీని ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. గొర్రెల కోసం డీడీలు కట్టిన లబ్దిదారులు నెలల తరబడి ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం 2017-2018లో  గొర్రెల పెంపకం అభివృద్ది పథకాన్ని ప్రవేశపెట్టింది. అర్హులైన గొల్ల కుర్మలకు రెండు విడతల్లో గొర్రెలను అందించాని సర్కారు నిర్ణయించింది. వీటి యూనిట్ల ధరను మొదట లక్షా 25వేలుగా నిర్ణయించి పథకం అమలు చేసింది. ఒక యూనిట్ కింద 20 గొర్రెలు, ఒక పొట్టేలును అందించారు. ఈ యూనిట్ పొందిన లబ్ధిదారులకు 75శాతం సబ్సిడీ ఇవ్వగా మిగతా 25శాతం లబ్ధిదారుడి నుంచి వాటా రూపంలో డీడీలను తీసుకుని యూనిట్లను మంజూరు చేశారు. 

నిజామాబాద్ జిల్లాలో.. మొదటి విడతలో 8 వేల 522 మంది లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లను పంపిణీ చేశారు. రెండో విడత పంపిణీ 2018-19 లో మొదలు పెట్టగా... కరోనా, ఇతర కారణాలతో బ్రేక్ పడింది. గొర్రెల ధరలు పెరగడంతో.. యూనిట్ ధరను కూడా ప్రభుత్వం పెంచింది ప్రభుత్వం. నాణ్యమైన గొర్రెలు దొరక్కపోవడంతో.. రెండో విడత పంపిణీని నిలిపేశారు. డీడీలు కట్టిన లబ్దిదారులు మాత్రం తమకు తొందరగా గొర్రెలను అందించాలని కోరుతున్నారు. లబ్దిదారులకు రెండో విడత గొర్రెలను గత అక్టోబర్ లోనే పంపిణి చేయాల్సి ఉంది. నాణ్యమైన గొర్రెలు దొరక్కపోవడంతో పంపిణీ నిలిపివేసినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ డీడీలు కట్టిన గొల్ల కుర్మలు తమ నెంబర్ ఎప్పుడొస్తుందని అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. 

ఈసారి గొర్రెలను కొనడానికి ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, అనంతపూర్ జిల్లాలను ఎంపిక చేశారు. వీటితో పాటు మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలోనూ కొనడానికి అనుమతి ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారు ఈ మూడు ప్రాంతాల్లోనే గొర్రెలు కొనడానికి పోటీ పడటంతో కొరత ఏర్పడింది. రెండో విడత కింద డీడీలు కట్టిన దాదాపు 1500 మంది లబ్దిదారులు నిజామాబాద్ జిల్లాలో ఇంకా ఎదురుచూస్తున్నారు. నాణ్యమైన యూనిట్లను లబ్ధిదారులకు ఇచ్చేందుకే ప్రస్తుతం గొర్రెల పంపిణీ తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే  స్కీమ్ నిలిపివేత తాత్కాలికమా.. పర్మినెంటా అన్న టెన్షన్ లబ్దిదారుల్లో కనిపిస్తోంది.

 

ఇవి కూడా చదవండి: 

కలిసున్న కవలలకు సెపరెట్ ఓటర్ కార్డులు

కొవిడ్ సర్టిఫెకెట్ పై ప్రధాని ఫొటో ఉండటం ప్రకటన కాదు