- చివ్వెంల పోలీస్ స్టేషన్లో ఘటన
- విషమంగా బాధితుడి ఆరోగ్య పరిస్థితి
సూర్యాపేట క్రైం, వెలుగు: అక్కను అనుమానించి, తరచూ చేయి చేసుకుంటున్న బావ గొంతుకోశాడో బామ్మర్ది.. రక్తమోడుతున్న బాధితుడిని బంధువులు లోకల్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. పరిస్థితి సీరియస్‌గా ఉందని చెప్పి డాక్టర్లు హైదరాబాద్‌కు పంపించారు. సోమవారం సూర్యాపేట జిల్లా చివ్వెంల్ల పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ ఘటన వివరాలు.. చివ్వెంల మండల పరిధిలోని జగన్నాయక్ తండాకు చెందిన రమావత్ దేవేందర్, శ్వేత భార్యాభర్తలు.. లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న దేవేందర్ కొంతకాలంగా భార్యపై అనుమానం పెంచుకున్నడు. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నయి. భర్తపై శ్వేత పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బయటికొచ్చాక మళ్లీ సర్దిచెప్పి ఇంటికి తీసుకెళ్లి కొట్టేవాడని శ్వేత తెలిపింది. ఈ క్రమంలో ఆదివారం మరోసారి స్టేషన్లో కంప్లైంట్ చేయగా.. సోమవారం ఇరువర్గాల పెద్దలు స్టేషన్ ఆవరణలో మాట్లాడుతున్నరు. పెద్దలు సర్దిచెప్పడంతో భార్య శ్వేతకు క్షమాపణ చెప్పడానికి దేవేందర్ అంగీకరించాడు. భార్య దగ్గరికి వెళ్లి క్షమాపణ చెబుతుండగా పక్కనే ఉన్న శ్వేత తమ్ముడు రఘు ఒక్కసారిగా బావపై దాడి చేశాడు. అక్కను అవమానించాడనే కోపంతో బ్లేడ్‌తో గొంతుకోశాడు. గాయపడిన దేవేందర్‌ను బంధువులు సూర్యాపేట ప్రభుత్వ అసుపత్రికి తరలించారు.
