నయీం చచ్చినంక దొరికిన డబ్బంతా ఎక్కడుందో కేసీఆర్ చెప్పాలె 

నయీం చచ్చినంక దొరికిన డబ్బంతా ఎక్కడుందో కేసీఆర్ చెప్పాలె 
  • రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల వెనుక టీఆర్ఎస్ లీడర్లే ఉన్నరు 
  • లక్ష ఎకరాలు ముంచిన ప్రాజెక్టుకు జాతీయ హోదా అడుగుతరా? అని ఫైర్​ 
  • యాదగురిగుట్ట నుంచి మూడో విడత పాదయాత్ర ప్రారంభం 

యాదాద్రి : రాష్ట్రంలో జరిగిన ప్రతి అరాచకం వెనుక టీఆర్ఎస్ నేతలే ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. క్యాసినో దందా, డ్రగ్స్ మాఫియా, మహిళలపై అత్యాచారాలు, చివరికి రాష్ట్రంలో జరుగుతున్న ఆత్మహత్యలకు కూడా టీఆర్ఎస్ నేతలే కారణమని మండిపడ్డారు. సంజయ్ చేపట్టిన మూడో విడత పాదయాత్రను మంగళవారం యాదగిరిగుట్టలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రారంభించారు. అంతకుముందు షెకావత్, సంజయ్ లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడారు. ‘‘నయీం ఎన్​కౌంటర్ తర్వాత 36 బస్తాల్లో రూ.వేల కోట్ల డబ్బు దొరికింది. వాటిని లెక్కించడానికి మెషీన్లు తెప్పించారు. నయీం డైరీతో లారీల నిండా డాక్యుమెంట్లు దొరికాయి. ఆ డబ్బు, డాక్యుమెంట్లు, నయీం డైరీ ఎక్కడుందో కేసీఆర్ చెప్పాలి” అని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలోకి రాగానే అన్నీ బయటకు వస్తాయని, డబ్బు రికవరీ చేస్తామని, మొత్తం కక్కిస్తామని చెప్పారు. బీజేపీ ఎక్కడుందని అడిగినోళ్లకు పాలమూరులో చూపించామని, ఇప్పుడు నల్గొండలో చూపిస్తున్నామని, త్వరలో ఖమ్మంలోనూ చూపిస్తామని తెలిపారు. సీఎం కేసీఆర్ ఢిల్లీకి పోయొచ్చిన సంగతి ఎవరికీ తెలియదని.. ఇక్కడ ఏమీ చేయనోడు, ఢిల్లీకి పోయి ఏం చేస్తాడని విమర్శించారు. 

కేసీఆర్ భయపడుతున్రు... 
ఉద్యమాల గడ్డ నల్గొండ నుంచి పాదయాత్ర అనగానే కేసీఆర్ భయపడుతున్నారని సంజయ్ అన్నారు. యాదాద్రి ఆలయంలో నాణ్యత లేని పనులు చేయించారని మండిపడ్డారు. ‘‘కేసీఆర్ నియంతృత్వ పాలనలో బుక్కెడు బువ్వ కోసం ట్రిపుల్ ఐటీ, గురుకుల విద్యార్థులు ఏడుస్తున్నారు. పురుగుల అన్నం తినలేక పస్తులుంటున్నారు. కేసీఆర్ మనవడు కూడా అదే అన్నం తింటున్నడా?” అని ప్రశ్నించారు. తాను నల్గొండలో పాదయాత్ర చేపడుతున్నానని తెలియగానే సర్కార్ చేనేత బీమా ప్రకటించిందని అన్నారు. ఇప్పటి వరకు ఎంతమంది నేతన్నలు చనిపోతే అంతమందికి బీమా ఇప్పించేంత వరకూ వదిలి పెట్టమన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని, ప్రతి బీజేపీ కార్యకర్త నరసింహాస్వామి అవతారమెత్తి కేసీఆర్ ను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. 

అందుకే పాదయాత్ర.. 
కేంద్ర నిధులను దారి మళ్లిస్తున్న విషయాన్ని ప్రజలకు చెప్పేందుకే మూడో విడత పాదయాత్ర చేస్తున్నానని తెలిపారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే సీఎంగా ఎవరున్నా గోల్కొండపై జాతీయ జెండా ఎగరేసి, భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటారని చెప్పారు. అధికారంలోకి రాగానే అందరికీ ఉచిత విద్య, వైద్యం అందిస్తామని, అందరికీ ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, ఎంపీలు ధర్మపురి అర్వింద్​, సోయం బాపూరావు, ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘనందన్​రావు, నేతలు స్వామిగౌడ్, రాంచందర్​రావు, యెండల లక్ష్మీనారాయణ, ఎన్వీఎస్​ఎస్​ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. 

కేసీఆర్ ను దించుడే లక్ష్యం: ఈటల 
కేసీఆర్​ను బొంద పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్​అన్నారు. కేసీఆర్​ను గద్దె దించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అద్దాల మేడలో కూర్చున్న కేసీఆర్.. అంతా భద్రంగా ఉందని అనుకుంటున్నారని, కానీ ఒక్క రాయి విసిరేస్తే అది పగిలిపోతుందని అన్నారు. రాజుల కాలంలో వాళ్లు ప్రజల మధ్య తిరిగే వారని.. కానీ కేసీఆర్ మాత్రం పోలీసుల పహారాలో ప్రగతి భవన్ లో లేకుంటే ఫాంహౌస్ లో ఉంటున్నారని విమర్శించారు. కేసీఆర్ ను కరీంనగర్ ప్రజలు మట్టి కరిపించారని, ఇప్పుడా అవకాశం నల్గొండ ప్రజలకు దక్కబోతోందని చెప్పారు. కాంగ్రెస్​ఇప్పుడు అంతరించిపోయే స్థితిలో ఉందన్నారు. రాకెట్ వేగంతో దూసుకుపోతున్న బీజేపీ..19 రాష్ట్రాల్లో పాలిస్తోందని, త్వరలో తెలంగాణలోనూ పాలించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. చాలామంది టీఆర్ఎసోళ్లు బీజేపీలో చేరడానికి రెడీగా ఉన్నారని, ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశారని చెప్పారు. యాదాద్రి నర్సన్ననూ మోసం చేసిండు:  అరుణ  యాదగిరి నరసింహస్వామినీ మోసం చేసిన ఘనుడు కేసీఆర్ అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. గుడి పనుల్లో మొత్తం అక్రమాలే జరిగాయని ఆరోపించారు. కమీషన్లకు కక్కుర్తి పడి నాసిరకం పనులు చేయించారని మండిపడ్డారు. ఇన్ని రోజులు కొండపై షాపులు నడుపుకున్న 150 కుటుంబాలను రోడ్డున పడేశారని ఫైర్ అయ్యారు. 

కేసీఆర్​ అన్ని వర్గాలను మోసం చేసిన్రు..: సంజయ్​
కేసీఆర్ చేతిలో అన్ని వర్గాలు మోసపోయాయని సంజయ్ అన్నారు. రైతు రుణమాఫీ, దళితులకు మూడెకరాల భూమి, ఎస్టీ రిజర్వేషన్ల పెంపు ఏమైందని ప్రశ్నించారు. వాసాలమర్రిలో ఇచ్చిన 100 హామీల్లో ఒక్కటన్నా నెరవేర్చలేదని ఫైర్ అయ్యారు. ప్రణాళిక లేకుండా కట్టిన కాళేశ్వరంతో లక్షల ఎకరాల్లో పంటలు మునిగిపోయాయని, అలాంటి ప్రాజెక్టుకు ఏ మొహం పెట్టుకొని జాతీయ హోదా అడుగుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కల్వకుంట్ల రాజ్యాంగాన్ని బొందపెట్టి, అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తామన్నారు.