తెలంగాణ రైతులు పంజాబ్ ను మించి వరి పండించారు

తెలంగాణ రైతులు పంజాబ్ ను మించి వరి పండించారు
  • తెలంగాణ దేశానికి ధాన్య భండాగారంగా మారింది
  • ప్రభుత్వ ప్రోత్సాహంతో రైతులు కష్టపడి స్వయం సమృద్ధి సాధిస్తున్నారు: మంత్రి కేటీఆర్

రాజన్న సిరిసిల్ల: ‘పంజాబ్ ను మించి  మన రైతులు వరి పండించారంటే గర్వంగా ఉంది. దేశానికి తెలంగాణ ధాన్య బండాగారంగా మారింది. ఏ లక్ష్యం కోసం తెలంగాణ తెచ్చుకున్నామో ఆ లక్ష్యం సాధించామన్న సంతృప్తి వ్యవసాయ రంగం చూస్తే కలుగుతోంది..’ అని మంత్రి కేటీఆర్ అన్నారు. కలెక్టరేట్ లో  ఏసంగి పంటల సాగు, వచ్చే సీజన్ లో పంటల మార్పిడి విధానాలపై ఆయాశాఖల ఉన్నత అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు కింద 85 శాతం చెరువులు 365 రోజులు నీరు ఉండే విధంగా తీర్చిదిద్దుకున్నామని వివరించారు. ‘ ప్రాజెక్టులు, చెరువుల్లో చేపలు, రొయ్యలుపెంచడంతో పాటు.. గొర్రెల పంపిణీ పథకం ద్వారా రాష్ట్రంలో గొర్రెల సంఖ్యను రెట్టింపు చేసాం. మాంసాన్ని ఎగుమతి స్థాయికి ఎదిగాం. ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టి... పండిన ప్రతి గింజను కొనుగోలు చేసాం. ఉమ్మడి ఏపీలో నష్టాల్లో ఉన్న విజయ డెయిరీని లాభాల బాట పట్టించాం. సిరిసిల్ల జిల్లాలోనే గత సీజన్ కు, ఈ సీజన్ కు మధ్య లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం ఎక్కువగా పండింది. రాష్ట్రం మొత్తం అసూయపడేవిధంగా సిరిసిల్ల రైతులు, నేతన్నలు అద్భుత ప్రగతి సాధిస్తున్నారు..’ అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. 
ఈ ఏడాది మాత్రం కొంటాం గానీ.. భవిష్యత్తులో బాయిల్డ్ రైస్ కొనబోమని కేంద్రం చెప్పింది
‘ఇటీవల కేంద్రమంత్రి పీయూస్ గోయల్ ను కలిసి.. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్.సి.ఐ) ధాన్యం కొనుగోలు చేయనంటోందన్న విషయాన్ని చెప్పాం.. బాయిల్డ్ రైస్ నాలుగేళ్లకు సరిపడ ఉన్నందున మేము కొనబోమని ఆయన చెప్పారు. ఇదే విషయాన్ని మేము కేసీఆర్ కు చెప్పాం. దీంతో.. సీఎం కేసీఆర్ ప్రధానితో, పీయూష్ గోయల్ తో మాట్లాడి సమస్యను ఓ కొలిక్కి తెచ్చారు. ఈ ఏడాది మాత్రం కొంటాం గానీ.. భవిష్యత్తులో బాయిల్డ్ రైస్ కొనబోమని వారు చెప్పారు. ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేలా రైతులను ప్రోత్సహించాలని కేంద్రం చెప్పింది. మనముందు ఇది ఓ సవాల్ లాంటిది. ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మోటివేట్ చేయాల్సిన బాధ్యత మనపై ఉంది..’ అని మంత్రి కేటీఆర్ వివరించారు. 
రైతులను పంటల మార్పిడి వైపు ప్రోత్సహించాలి
ఇప్పటి నుంచే వచ్చే ఏసంగి నాటికి రైతులను ఒప్పించి, మనస్సును గెలుచుకుని పంటల మార్పిడి వైపు ప్రోత్సహించాలని మంత్రి కేటీఆర్ సూచించారు. కానీ రైతులపై సీఎంపై ఉన్న అపార విశ్వాసంతో మళ్లీ దొడ్డువడ్లు సాగు చేసే అవకాశం ఉన్నందున.. వారికి పరిస్థితిని వివరించాలన్నారు. నీళ్లున్నాయి కాబట్టి అందరూ వరివైపు వెళ్తారు. ఇందులో సన్నవడ్లు వేస్తే ఫర్వాలేదు. కానీ దొడ్డువడ్లతోనే సమస్య వస్తుందన్నారు. మన దగ్గర పల్లి పంట(వేరుశనగ) పండించే వాతావరణం, భూములున్నాయి. పత్తి, కందులు, మక్కలు, శనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు లాంటి పంటలను వేసుకునేలా ప్రోత్సహించాలి. పప్పు ధాన్యాలు పండించం వల్ల రైతులకు మంచి ఆదాయం వస్తుంది. అంతర పంటల సాగును ప్రోత్సహించాలన్నారు. మన దగ్గర ప్రతి ఐదువేల ఎకరాలకు ఓ వ్యవసాయ విస్తరణ అధికారి ఉన్నారు. మనకు రైతు వేదికలున్నాయి. అధికారులు, రైతు వేదిక ప్రతినిధులు రైతులను ఒప్పించి పంటల మార్పిడివైపు ప్రోత్సహించాలి. ఇప్పటికీ కూరగాయలు, పామాయిల్ ఇతర ప్రాంతాల నుంచి తెప్పించుకుంటున్నాం. ఆ సమస్య లేకుండా కూరగాయలు, మిర్చీ పంటలు ప్రోత్సహించాలని మంత్రి కేటీఆర్ కోరారు. 
తెలంగాణ ఏర్పడక ముందు సిరిసిల్లలో సాగునీరు లేదు, విత్తనాలు, ఎరువులు దొరికేవి కావు, కరెంట్ ఉండేది కాదు. వ్యవసాయ గోడౌన్లు కూడా లేవు. ఓ వైపు నేత కార్మికులు, మరోవైపు రైతులు సిరిసిల్లలో ఆత్మహత్యలు చేసుకునేవారు. ఎల్లారెడ్డి పేట మండలం వెంకటపూర్ లో రైతులు ఎరువుల కోసం నిలబడి ఎల్లయ్య అనే రైతు  సొమ్మసిల్లి చనిపోయాడు. స్వయంగా రైతు బిడ్డ అయిన కేసీఆర్ ముఖ్యమంత్రి కావడంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని మంత్రి కేటీఆర్ తెలిపారు. దేశంలో 24 గంటలు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తున్న రాష్ట్రాలు లేవు, రైతుబంధు పేరుతో రైతుకు పెట్టుబడి సాయం చేస్తున్న ముఖ్యమంత్రి కూడా కేసీఆర్ ఒక్కరేనన్నారు. రైతుబంధు స్ఫూర్తితో మరో 12 రాష్ట్రాల్లో ఇప్పుడు సాయం అందిస్తుండగా, ప్రధాని కూడా ఇదే కార్యక్రమ స్ఫూర్తితో సాయం అందిస్తున్నారని తెలిపారు. రైతు చనిపోతే ఆ కుటుంబం తల్లడిల్లుతుందో తెలిసిన కేసీఆర్..  ఆ కుటుంబానికి అండగా ఉండేందుకు రైతు బీమా తెచ్చారని ప్రపంచంలోనే ఇలాంటి పథకం ఎక్కడా లేదన్నారు. ఎలాంటి నీటి తీరువా లేకుండా సాగునీరు అందిస్తున్నామన్నారు. మొదటి విడత అధికారంలోకి వచ్చినప్పుడు లక్ష రూపాయలు పూర్తి రుణమాఫీ చేసాం. ఈసారి కూడా 50 వేల లోపు రుణాలు మాఫీ చేస్తున్నాం. మిగతావి కూడా చేస్తామన్నారు. కరోనా కష్టకాలంలో కూడా ఏ రాష్ట్రంలో లేని విధంగా చివరి గింజ వరకు ధాన్యం కొన్నాం. ధాన్యం స్టోరేజీని 4 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 24 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి పెంచి గోదాములు కట్టుకున్నాం. మిషన్ కాకతీయ రూపంలో చిన్ననీటి వనరులను అభివృద్ధి చేసుకున్నాం. ఒకప్పుడు కరవు ప్రాంతంగా ఉన్న సిరిసిల్లలో ఇప్పుడు నీళ్లు ఎక్కువయ్యయాని రైతులు చెబుతున్నారు. పాడి పరిశ్రమను ప్రోత్సహించేందుకు లీటర్ కు 4 రూపాయలు ప్రోత్సహమిచ్చి.. క్షీరవిప్లవాన్ని ప్రోత్సహిస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు.