
నెట్వర్క్, వెలుగు : రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఉమ్మడి ఆదిలాబాద్జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిపారు. అమరవీరుల స్థూపాల వద్ద అధికారులు, నేతలు నివాళి అర్పించారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ లో కలెక్టర్ రాజర్షి షా జాతీయ జెండా ఆవిష్కరించారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను గుర్తుచేసుకున్నారు. అనంతరం ప్రసంగిస్తూ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు పెద్దపీట వేస్తోందన్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తెలంగాణాలో అసలైన స్వేచ్ఛా వాతావరణం నెలకొందన్నారు.
కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసిందని పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీ పథకాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచిందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రస్తావించారు. రైతుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం రైతునేస్తం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఎస్పీ గౌస్ ఆలం, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజల భాగస్వామ్యంతోనే జిల్లా అభివృద్ధి
ప్రజలందరి భాగస్వామ్యంతో జిల్లా అభివృద్ధికి పాటుపడదామని నిర్మల్ కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహించిన ఆవిర్భావ వేడుకల్లో ఎస్పీ జానకి షర్మిల, అడిషనల్ కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, భైంసా ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్‌తో కలిసి పాల్గొన్నారు. ముందుగా అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించారు. ఆ తర్వాత పోలీసులు గౌరవ వందనం స్వీకరించి, జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ..
తెలంగాణ సాకారం కోసం త్యాగదనులు ప్రదర్శించిన ఉద్యమ స్ఫూర్తి మరువలేనిదని కొనియాడారు. ప్రతి ఒక్కరు అంకితభావంతో జిల్లా, రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. వేడుకల సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అనంతరం స్టూడెంట్లకు నోట్బుక్లు అందజేసి చేసి, స్వీట్లు పంచారు.
జిల్లా అభివృద్ధికి పునరంకితం అవుదాం
ఆసిఫాబాద్ జిల్లా సమగ్ర అభివృద్ధికి పునరంకితమవుదామని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. చిల్డ్రన్స్ పార్క్‌లోని అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి, జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా సమగ్ర అభివృద్ధి సాధించే దశగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన ప్రతి ఒక్కరికి నివాళులు అర్పించాల్సిన అవసరం ఉందన్నారు. జాతీయ
అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఆదివాసీల సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకుంటూ భావితరాలకు అందించేలా ప్రోత్సాహిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణ, ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు, ఎస్పీ సురేశ్ కుమార్, అడిషనల్ కలెక్టర్లు, డీఎఫ్ఓ, ఏఎస్పీ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర సాధనలో సింగరేణి ఉద్యోగుల పాత్ర కీలకం
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో సింగరేణి ఉద్యోగుల పాత్ర కీలకమని మందమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి ఏరియాల సింగరేణి జీఎంలు ఎ.మనోహర్, బి.సంజీవరెడ్డి, బి.రవిప్రసాద్అన్నారు. సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో జీఎంలు పాల్గొని మాట్లాడారు. వందలాది మంది త్యాగాల ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందన్నారు. రాష్ట్ర సాధన కోసం చేపట్టిన సకల జనుల సమ్మెలో సింగరేణి ఉద్యోగుల పాత్ర కీలకమైందని గుర్తుచేశారు. సింగరేణి కార్మికక్షేత్రలైన మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీలు, మందమర్రి రూరల్ ప్రాంతాల్లో కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, బీఆర్ఎస్తో పాటు పలు పార్టీలు
సింగరేణి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన కల్చరర్ ప్రోగ్రామ్స్ఆకట్టుకున్నాయి. మందమర్రిలోని సింగరేణి హైస్కూల్ గ్రౌండ్లో జరిగిన వేడుకల్లో ఏరియా జీఎం ఎ.మనోహర్–-సవిత దంపతులు, శ్రీరాంపూర్‌లోని ప్రగతి మైదానంలో జీఎం బి.సంజీవరెడ్డి–-రాధాకుమారి దంపతులు, బెల్లంపల్లి ఏరియా సీఈఆర్ క్లబ్లో జరిగిన సంబురాల్లో జీఎం రవిప్రసాద్ పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లో ఉత్తమ ఉద్యోగులను సన్మానించారు. జైపూర్ మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్‌లోని అడ్మిన్ బిల్డింగ్ ఆవరణలో జీఎం బసివి రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
జన్నారం మండల కేంద్రంలోని తహసీల్దార్ ఆఫీస్ లో తహసీల్దార్ రాజమనోహర్ రెడ్డి, ఏంపీడీవో ఆఫీస్ లో ఏంపీపీ మాదాడి సరోజన, గుడిహత్నూర్ఎంపీడీఓ ఆఫీస్‌లో ఎంపీపీ కేంద్రే జ్ఞానోబా జాతీయ జెండాలను ఆవిష్కరించారు. జన్నారం, నేరడిగొండ, కాగజ్‌నగర్, కుంటాల తదితర మండలాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు.