కమీషన్లు తగ్గినయ్.. ఆదాయం పెరిగింది

కమీషన్లు తగ్గినయ్.. ఆదాయం పెరిగింది
  • రాష్ట్రంలో జీఎస్టీ, ఎక్సైజ్, మైనింగ్ రాబడిలో గణనీయమైన పెరుగుదల
  • కొత్త సర్కారు వచ్చిన రెండో నెలకే రూ.200 కోట్లకు పైగా అదనపు ఇన్​కం 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం సొంత ఆదాయంపై దృష్టి పెట్టింది. వివిధ శాఖల్లో ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన రాబడికి గండి కొడుతున్న వాటికి క్రమంగా చెక్​ పెడుతోంది. అందులో భాగంగానే కమర్షియల్​ ట్యాక్స్​ను మరింత కట్టుదిట్టంగా వసూలు చేస్తున్నది. దీంతో జీఎస్టీ రాబడులు ప్రతినెలా వచ్చే యావరేజ్​ కంటే కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండో నెలకే రూ.200 కోట్లకు పైగా అదనపు ఆదాయం వచ్చింది. జీఎస్టీ రిటర్న్​లో గోల్​ మాల్, ఎక్సైజ్​​వ్యాట్​ ఇతరత్రా వంటి వాటిపై పకడ్బందీగా ముందుకు వెళ్తుండడంతో రాష్ట్రానికి రాబడి పెరిగినట్లు అధికారులు చెప్తున్నారు.

మైనింగ్​లోనూ ఆదాయం పెరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. గతంలో వచ్చిన దానికంటే యావరేజ్ గా రోజుకు దాదాపు రూ.3 కోట్లు అదనంగా వస్తోంది. ఇసుక రీచ్​లలో సీసీ కెమెరాల ఏర్పాటు, ట్రాకింగ్​ ట్యాగ్​లతో ఆదాయం పెరిగింది. ఎక్సైజ్​ శాఖలోనూ నిబంధనలకు విరుద్ధంగా విదేశీ మద్యం అమ్మకాలు, వ్యాట్​ ఎగవేతలను ప్రభుత్వం సీరియస్​గా తీసుకున్నది. దీంతో ఎక్సైజ్​లోనూ అదనంగా ఇన్​కం పెరిగింది. ఇలా మూడు, నాలుగు శాఖల్లో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో నెలకు దాదాపు రూ.400 కోట్లపైనే ఇన్​కం వస్తున్నట్లు తెలిసింది. కమీషన్లు, లంచాలు లేకుండా, అక్రమ మార్గంలో అప్పట్లో కొందరు లీడర్లకు సహకరించిన అధికారులను తప్పించడంతోనూ ఆదాయం పెరిగినట్టు సమాచారం.